మండలాన్ని కరీంనగర్ లో తిరిగి కలుపాలని..

– ప్రజాదర్భార్ లో దరఖాస్తు సమర్పించిన మల్లికార్జున్ 
– నవంబర్ 23న ఎన్నికల ప్రచారంలో సీఎం హామీ 
నవతెలంగాణ-బెజ్జంకి 
జిల్లాల పునర్విభజనలో బెజ్జంకి మండలాన్ని ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా నాటి ప్రజాప్రతినిధులు సిద్దిపేట జిల్లాలో కలుపారని..సిద్దిపేట జిల్లాతో మండల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ అన్యాయానికి గురవుతున్నారని యథావిధిగా తిరిగి మండలాన్ని కరీంనగర్ జిల్లాలో కలుపాలని ప్రజాదర్భార్ యందు దరఖాస్తు సమర్పించినట్టు మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు,ఆర్టీఐ ప్రచార కమిటీ చైర్మన్ రాసూరి మల్లికార్జున్ తెలిపారు.శుక్రవారం జ్యోతిరావు ఫూలే ప్రజా భవనం యందు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాదర్భార్ కార్యక్రమంలో గిరిజన సంక్షేమశాఖ మంత్రి సీతక్కకు మండలంలో నెలకొన్న ప్రజా సమస్యలను పరిష్కరించాలని మల్లికార్జున్ దరఖాస్తు సమర్పించారు.మండలాన్ని తిరిగి కరీంనగర్ జిల్లాలో కలపాలనే అంశంలో పాటు బెజ్జంకి శివారులోని సర్వే నంబర్ 961,962 లావుని పట్టా ప్రభుత్వ భూమిని అక్రమార్కుల రికార్డుల నుండి తొలగించి ఎస్సీ  కార్పొరేషన్ ద్వార కొనుగోలు చేసి పంపిణీ చేసిన లబ్ధిదారులకు పట్టా మార్పిడి చేసి అందజేయాలని మంత్రి సీతక్కకు విజ్ఞప్తి చేశామని మల్లికార్జున్ తెలిపారు.టీజేవీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ర్యాకం రాజు,ఉప్పులేటీ శ్రీనివాస్,గాదం మల్లికార్జున్ దరఖాస్తు అందజేతలో పాల్గొన్నారు.
ఎన్నికల ప్రచారంలో సీఎం హామీ..
నవంబర్ 2న తిమ్మాపూర్ మండలం రేణికుంట టోల్ గేట్ అవరణం వద్ద మానకొండూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కవ్వంపల్లి సత్యనారాయణ ఎన్నికల ప్రచార విజయభేరి సభకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బెజ్జంకి మండలాన్ని తిరిగి కరీంనగర్ జిల్లాలో కలుపుతామని హామీనిచ్చారు.కవ్వంపల్లి సత్యనారాయణ ఎమ్మెల్యేగా ఎన్నికవ్వడం,రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటవ్వడం మండల ప్రజలకు కాస్త ఊరటనిచ్చిన మండలాన్ని తిరిగి కరీంనగర్ జిల్లాలో ఎప్పుడు కలుపుతారోనని ఎదురుచూస్తున్నారు.సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని త్వరితగతిన అమలయ్యేల మండల కాంగ్రెస్ నాయకులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని పలవురు మండల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.