మండల పరిషత్ ప్రాదేశిక నియోజక వర్గాలు సర్ధుబాటు

నవతెలంగాణ – అశ్వారావుపేట
తెలంగాణ ప్రభుత్వం అశ్వారావుపేట మేజర్ గ్రామ పంచాయితీ తో పాటు మరో రెండు పంచాయితీల తో అశ్వారావుపేట మేజర్ పంచాయితీ కి మున్సిపల్ హోదా కల్పించడంతో మండలంలోని ప్రాదేశిక నియోజక వర్గా (ఎంపీటీసీ)లను సైతం సర్దుబాటు చేసినట్లు ఎంపిడివో ప్రవీణ్ కుమార్ రాజకీయ పార్టీల నేతలకు సూచించారు.అశ్వారావుపేట,గుర్రాల చెరువు,పేరాయిగూడెం పంచాయితీల పరిధిలో 8 ఎంపీటీసీ స్థానాలను రద్దు చేసి వీటి పరిధిలో ఉన్న పాత అల్లిగూడెం పంచాయితీని ఊట్లపల్లి ప్రాదేశిక నియోజక వర్గంలో,వేదాంతపురం  పంచాయితీ ఓటర్లను వినాయకపురం ప్రాదేశిక నియోజక వర్గం స్థానాల్లో విలీనం చేసినట్లు వివరించారు. ఈ మేరకు స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ఆయన ఎంపీటీసీ ల సర్దుబాటుపై రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించారు. ఈ అంశంపై రాజకీయ పార్టీల నుండి అభ్యంతరాలు స్వీకరించారు.ఏజన్సీ స్థానాలను ఏజన్సీ,నాన్ ఏజన్సీ స్థానాలను నాన్ ఏజెన్సీలో వాటికి అనుగుణంగా సర్దుబాటు చేసినట్లు ఎంపీడీవో నాయకులకు స్పష్టం చేశారు. కానీ వివిధ పార్టీల నాయకులు ఈ ప్రతిపాదనలు ఓటర్లకు ఇబ్బందికరంగా ఉంటాయని, పాత అల్లిగూడెం ను నారం వారి గూడెం ప్రాదేశిక నియోజక వర్గంలో, వేదాంతపురం ను ఊట్లపల్లి ఎంపీటీసీ స్థానాల్లో కలపాలని సూచించారు. మా ప్రతిపాదనలను ఉన్నతాధికారులకు నివేదించాలని,ఏ నిర్ణయం తీసుకున్నా ఓటర్లకు ఇబ్బంది లేకుండా ఉండాలని సమావేశంలో సీపీఐ(ఎం), సీపీఐ, కాంగ్రెస్, టీడీపీ, బీజేపీల నేతలు చిరంజీవి, రామక్రిష్ణ, తుమ్మ రాంబాబు, కట్రం స్వామి దొర, బండారు చంద్రశేఖర్ లు పాల్గొన్నారు.