మంధాన, కౌర్‌ సెంచరీలు

మంధాన, కౌర్‌ సెంచరీలు– దక్షిణాఫ్రికా మహిళలపై నాలుగు పరుగుల తేడాతో గెలుపు
– వన్డే సిరీస్‌ 2-0తో కైవసం
బెంగళూరు: భారత్‌, దక్షిణాఫ్రికా మహిళల మధ్య జరిగిన రెండో వన్డేలో టీమిండియా మహిళలు చివరి బంతికి గెలిచి ఊపిరి పీల్చుకున్నారు. చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో హర్మన్‌ప్రత్‌ సేన నాలుగు పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై గెలిచింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 3వికెట్ల నష్టానికి 325పరుగుల భారీస్కోర్‌ను నమోదు చేసింది. ఓపెనర్‌ స్మృతి మంధాన(136), కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌(103నాటౌట్‌) సెంచరీలతో రాణించారు. అనంతరం దక్షిణాఫ్రికా మహిళలు నిర్ణీత 50 ఓవర్లు పూర్తయ్యే సరికి 6వికెట్లు కోల్పోయి 321పరుగులు మాత్రమే చేశారు. ఓపెనర్‌ వోల్వోడార్ట్‌(135నాటౌట్‌), కాప్‌(114) భారీ శతకాలతో రాణించారు. వీరిద్దరూ క్రీజ్‌లో ఉన్నంతసేపు దక్షిణాఫ్రికా జట్టు విజయం వైపు దూసుకెళ్లగా.. కాఫ్‌ ఔటవ్వడంతో జట్టు ఫలితంపై ప్రభావం చూపింది.
సుడిగాలి శతకంతో విరుచుకుపడిన హర్మన్‌
ఈ మ్యాచ్‌లో వైస్‌ కెప్టెన్‌ మంధన మెరుపు శతకంతో విరుచుకుపడితే.. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సుడిగాలి సెంచరీతో (103నాటౌట్‌; 88బంతుల్లో, 9ఫోర్లు, 3సిక్సర్లు) అలరించింది. 49వ ఓవర్‌ 2వ బంతి ఎదుర్కొనే సమయానికి 85 బంతుల్లో 88 పరుగులు చేసిన హర్మన్‌ ఆ తర్వాత మూడు బంతులను వరుసగా 4, 6, 4 బాది సెంచరీ పూర్తి చేసుకుంది. వన్డేల్లో హర్మన్‌కు ఇది 6వ సెంచరీ. టీమిండియా తరఫున అత్యధిక వన్డే సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో హర్మన్‌ మూడో స్థానంలో నిలిచింది. ఇదే మ్యాచ్‌లో సెంచరీ చేసిన మంధన భారత్‌ తరఫున అత్యధిక వన్డే సెంచరీలు చేసిన మిథాలీ రాజ్‌ రికార్డును(7) సమం చేసింది. కెప్టెన్‌, వైస్‌ కెప్టెన్లు ఇద్దరూ సెంచరీలతో కదం తొక్కడంతో భారత్‌ భారీ స్కోర్‌ చేసింది. షఫాలీ వర్మ (20), హేమలత (24), రిచా ఘోష్‌ (25నాటౌట్‌) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. దక్షిణాఫ్రికా బౌలర్లు మాబేకు రెండు వికెట్లు దక్కాయి.
భారీ ఛేదనలో దక్షిణాఫ్రికా జట్టు ఛేదనను ధాటిగానే ప్రారంభించింది. ఓపెనర్‌ బ్రిట్‌(5) నిరాశపరిచినా.. మరో ఓపెనర్‌ వోల్వోడార్ట్‌(135నాటౌట్‌) చివరి బంతి వరకు క్రీజ్‌లో నిలిచి టీమిండియా బౌలర్లకు చెమటలు పట్టించింది. దక్షిణాఫ్రికా జట్టు ఓ దశలో 67పరుగులకే 3వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ దశలో వోల్వోడార్ట్‌, కాప్‌(114) సెంచరీలతో కదం తొక్కారు. వీరిద్దరూ 4వ వికెట్‌కు ఏకంగా 184పరుగులు జతచేసి గెలుపు తీరాలకు చేర్చారు. చివరి ఓవర్లో 11 పరుగులు దక్షిణాఫ్రికా చేయాల్సి రాగా.. పూజ వస్త్రాకర్‌ వేసిన తొలి రెండు బంతులకు 5పరుగులు రాబట్టి 4 బంతుల్లో 6పరుగులకు సమీకరణలు మారాయి. ఆ దశలో పూజ వరుసగా 2 బంతుల్లో ఇద్దరు బ్యాటర్లు ఔట్‌చేసి విజయాన్ని భారత్‌వైపు తిప్పింది. చివరి బంతికి 5పరుగులు చేయాల్సి రాగా.. ఆ బంతిని పూజ డాట్‌బాల్‌గా వేయడంతో భారత్‌కు విజయం దక్కింది. ఈ గెలుపుతో భారత్‌ మూడు వన్డేల సిరీస్‌ను మరో వన్డే మిగిలి ఉండగానే 2-0తో చేజిక్కించుకుంది. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌కు లభించింది.
స్కోర్‌బోర్డు..
ఇండియా మహిళల ఇన్నింగ్స్‌: మంధాన (సి)తాంజ్మిన్‌ బ్రిట్స్‌ (బి)మాబే 136, షెఫాలీ వర్మ (సి)క్లాస్‌ (బి)మాబే 20, హేమలత (సి)బాట్చ్‌ (బి)క్లాస్‌ 24, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (నాటౌట్‌) 103, రీచా ఘోష్‌ (నాటౌట్‌) 25, అదనం 17. (50 ఓవర్లలో 3వికెట్ల నష్టానికి) 325పరుగులు.
వికెట్ల పతనం: 1/28, 2/100, 3/271
బౌలింగ్‌: కాకా 10-2-51-0, క్లాస్‌ 10-0-67-1, క్లార్క్‌ 8-1-50-0, మాబే 10-0-51-2, షాంగాసే 6-0-57-0, బాట్చ్‌ 1-0-10-0, లూస్‌ 5-0-36-0
దక్షిణాఫ్రికా మహిళల ఇన్నింగ్స్‌: వోల్వోడార్ట్‌ (నాటౌట్‌) 135, బ్రిట్స్‌ (బి)అరుంధతి రెడ్డి 5, బాట్చ్‌ (సి)రోడ్రిగ్స్‌ (బి)దీప్తి 18, లూస్‌ (సి)రీచా (బి)మంధాన 12, కాప్‌ (సి)పూజ (బి)దీప్తి 114, క్లార్క్‌ (సి)అరుంధతి రెడ్డి (బి)పూజ 28, షాంగేస్‌ (సి)హర్మన్‌ప్రీత్‌ (బి)పూజ 0, రిడైర్‌ (నాటౌట్‌) 0, అదనం 9. (50 ఓవర్లలో 6వికెట్ల నష్టానికి) 321పరుగులు.
వికెట్ల పతనం: 1/14, 2/54, 3/67, 4/251, 5/320, 6/320
బౌలింగ్‌: పూజ వస్త్రాకర్‌ 7-0-54-2, అరుంధతి రెడ్డి 8-0-62-1, దీప్తి శర్మ 10-1-56-2, రాధా యాదవ్‌ 10-0-52-0, స్మృతి మంధాన 2-0-13-1, శోభన 9-0-53-0, షెఫాలీ వర్మ 4-0-26-0