మందస్మిత

మందస్మితస్మిత పేరుకు తగ్గట్టే ఎప్పుడూ చిరునవ్వులు చిందిస్తూ ఉంటుంది. స్మితను చూడగానే మనసుకు ఏదో మంచి భావన కలుగుతుందని చాలామంది అంటారు. అనడమే కాదండోరు అది నిజం కూడా! మావాడు ఆ పిల్లను గొప్పగా పొగుడుతుంటే ఏమో! ఎలా ఉంటుందోలే అని అనుకున్నా! ఇప్పుడనిపిస్తుంది నాకు వాడు చెప్పింది నిజమని. అందుకే నాకు ఆ అమ్మాయి దగ్గరైంది. చలాకీగా ఉండే పిల్ల. చూడగానే చిరునవ్వుతో అందరినీ పలుకరిస్తూ ఎవరికి ఏ కష్టం వచ్చినా ఎంతో దైర్యంగా తనకు తోచిన సహాయం చేస్తుంది.
ఇక్కడ దగ్గర్లో నెట్‌ సెంటర్లో పని చేస్తుందని తెలిసింది. అందం, అణుకువ అన్నీ సమపాళ్లలో రంగరించిన కుందనపు బొమ్మ. ఇలాంటి అమ్మాయి ఉంటే బావుండు అనిపిస్తుంది తనను చూస్తే, అంత ప్రసన్నత ఆ మొహంలో…
అవును మావాడు అని చెప్తున్నానే వాడు నా పుత్రరత్నం! పేరు శ్రీహాస్‌. నా కొడుకని చెప్పడం కాదుగాని మంచి పిల్లాడు. కొంచెం సున్నిత మనస్కుడు ఎవ్వరినీ పల్లెత్తు మాటనడు. ఒక్కడే కొడుకవటం చేత కొంచెం వాడి మీదనే మా కాంసెంట్రేషన్‌ అంతా! మొన్ననే గ్రూప్‌ 2 ఉద్యోగం వచ్చింది. మంచిర్యాల జిల్లాలో పోస్టింగ్‌ ఇచ్చారు. మంచి సంబంధం చూసి పెళ్లి చెయ్యాలి! ఏంటి వీడు ఏదో ఆలోచిస్తున్నాడు.
”ఏంట్రా అంత పరధ్యాన్నం.. ఎన్నిసార్లు పిలిచినా మాట్లాడవేంటిరా! ఉలుకు పలుకు లేకుండా..” అని తల్లి పిలుపుతో ఈ లోకంలోకి వచ్చాడు శ్రీహాస్‌.
”ఏంటమ్మా..”
”టిఫిన్‌ తినరా!”
”ఆ..” అంటూ గబగబా టిఫిన్‌ తిని ఒకసారి దుర్గామాత ఫొటో చూస్తూ… అమ్మవారు ఆజ్ఞ ఇచ్చినట్టు భావించి దండం పెట్టి బయటికి వెళ్లిండు. తల్లి గమనిస్తుంది అదుర్దా అంతా..
దుర్గామాతకు దందం పెట్టుకోవడం శ్రీహాస్‌కు చిన్నప్పటినుండి అలవాటు .. హాల్లో.. మందస్మిత వదనంతో సింహవాహినియై దుర్గమ్మ ఫొటో ఉంది. రోజూ శ్రీహాస్‌ దుర్గమ్మకు దండం పెట్టి ఆరోజు కార్యక్రమాలు మొదలు పెడతాడు.
ఇక ప్రస్తుతం వాడి దినచర్య… నెట్‌ సెంటర్‌ దగ్గర పహారా కాయడం. స్మిత చిరునవ్వుకై వెంపర్లాడడం… షరా మామూలే!
శ్రీహాస్‌ నెట్‌ సెంటర్‌ దగ్గరకి వెళ్ళాడు. స్మిత గమనిస్తూనే ఉంది కాని ఏమీ తెలియనట్టు తనపని తాను చేసుకుపోతుంది. రోజూ ఏంటీ న్యూసెన్స్‌ అని చికాకు పడుతుంది కూడా! కానీ బయటికి ప్రదర్శించలేక పోతుంది. వార్నింగ్‌ ఇవ్వాలనుకొని ఎందుకులే డోంట్‌కేర్‌ అన్నట్టు ఉంటే పోలే.. అని సర్దిచెప్పుకుంది. ఎందుకో శ్రీహాస్‌ను చూస్తే అలా అనిపించడం లేదుకానీ, మనకు కుదరదని సర్దిచెప్పుకొని పట్టించుకోవడం లేదు. కానీ శ్రీహాస్‌ వరుస మాత్రం మారడంలేదు.
కావాలనే ఓ రోజు ”ఒరే శ్రీహాస్‌, సుందరం బాబాయితో నీకు మంచి సంబంధం చూడమని చెప్పారా” అన్నాను.
వెంటనే ”అమ్మా నేను ఇప్పుడే పెళ్లి చేసుకోను. నాకు కొంచెం టైం ఇవ్వు” అన్నాడు.
”ఇదేం వరసరా! నాకేం అర్థం కావడంలేదురా నీ వ్యవహారం” అంటున్న తల్లిమాట వినిపించుకోకుండా బయటికి పోయాడు.
నెట్‌ సెంటర్‌వైపు చూస్తూ నిల్చున్నాడు. ఈ రోజు ఏదో ఒకటి తేల్చుకోవాలని.. స్మిత పని ముగించుకొని బయటకు వస్తుంది. శ్రీహాస్‌ను గమనించి పట్టనట్టుగా వడివడిగా ముందుకు కదిలింది.
‘స్మితగారు…’ అన్న పిలుపు విని వెనక్కు తిరిగి చూసింది. ‘మీ.. పేరు.. బా..వుం… దండి..’ అనగానే థాంక్స్‌ ఇంకా… అంటూ ముందుకు వెళ్తుంది.
శ్రీహాస్‌ వాళ్ళమ్మ ఇదంతా గమనించింది. ఇదన్న మాట సంగతి అనుకుని నిశ్శబ్దాన్ని చేదిస్తూ.. ”బావున్నావామ్మా” అంది.
ఆమెను చూసి ఒక్కసారిగా.. ”ఆంటీ.. బావున్నా ఆంటీ. మీరు..” అంది.
”బావున్నానమ్మా .. కనబడటం లేదేంటి ఈ మధ్య”
”అదేం లేదాంటి. కొంచెం ఇంట్లో పని ఉండి…” అంటూ చిరునవ్వు.
వెనుక కొడుకు రావడం చూసింది ఆమె. స్మిత కూడా శ్రీహాస్‌ను గమనించింది. ఆంటి ఉందన్న భయంకూడా లేకుండా ఫాలో అవుతున్నాడు. ఒక చూపు చూసింది. అంతే.. అది గమనించి ”వీడు మా అబ్బాయి శ్రీహాస్‌” అని చెప్పగానే… ఆశ్చర్యంగా ”న..మ..స్తే” అంటూ రెండు చేతులు జోడించింది.
”అంటీ… మీరు ఇటువైపు వస్తున్నారు. ఏదైనా పనుందా అనడిగింది. పక్కన కొడుకు తల్లికి సైగ చేస్తున్నాడు అడుగు అన్నట్టు.
”నీతో మాట్లాడాలమ్మా!”
”చెప్పండి ఆంటి” అంది.
”మాకు నువ్వు నచ్చావమ్మా. నీకిష్టమైతే మా కోడలిగా చేసుకుందామనుకుంటున్నాం” అనగానే ఒక నవ్వు నవ్వి ”అది కాని పని ఆంటి.. నాకలాంటి ఆశలు లేవు” అంది అదే చిరునవ్వుతో.
”మీ వాళ్ళను వచ్చి అడుగుతామమ్మా..నీ అభిప్రాయం చెప్పు పర్వాలేదు!” అని శ్రీహాస్‌ వివరాలన్నీ చెప్పింది! మావాడు నచ్చలేదా! అని అడిగింది.
”నేను కరక్ట్‌ కాదు ఆంటీ మీ అబ్బాయికి. రండి..” అంటూ వాళ్ళింటి తీసుకెళ్లింది. అక్కడ లేవలేని స్థితిలో మంచంలో ఉన్నామెను చూపిస్తూ మా అమ్మ అని చెప్పి తన కథంతా చెప్పుకొచ్చింది. అమె కూడా నవ్వుతూ వణుకుతున్న చేతులతో నమస్కారం పెట్టింది.
”ఇదండీ మా పరిస్థితి” అని వివరించి తన బాధ్యతలను చెప్పింది అదే చిరునవ్వుతో! ఇప్పుడు చెప్పండి అంటూ.
ఆశ్చర్యపోవడం వీళ్ళ వంతైంది. ఇంత బాధను దిగమింగుకొని చిరునవ్వులు చిందిస్తూ ఉండే ఈ పిల్ల నిజంగా స్మిత మందస్మిత. ”మీ అమ్మాయి మాకు నచ్చిందండి. మీకిష్టమైతే మా ఇంటి కోడలుగా చేసుకోవాలని ఉంది. మాకంతా అర్ధమైంది. మీకు మేమెప్పుడు అండగా ఉంటాం. మీరు మాఇంట్లో ఉండొచ్చు. మీకు అభ్యంతరం లేకపోతే” అని చెప్పింది. ఆమె స్మిత వైపు చూసి సంతోషంతో తలూపింది.
”మీ అమ్మాయితో పాటు మీరు మా ఇంట్లో వారే” అంటూ స్మితవైపు చూసింది. స్మిత సిగ్గుతో రయ్యన వంటింట్లోకి వెళ్లి టీ తెచ్చిచ్చింది.
”టీ తాగాక మీ అమ్మాయిని మాతో ఓ పది నిమిషాలు పంపిస్తారా” అని అడిగింది. ఆమె స్మితవైపు చూసి చిరునవ్వు నవ్వింది సరే అన్నట్టు. సంతోషంగా అందరూ శ్రీహాస్‌ ఇంటికి వచ్చారు. వస్తూనే అమ్మవారి ఫొటో ముందు నిలబడి ఇద్దరూ దండం పెట్టారు.
శైలజ రాంపల్లి