ఆయన చేతి వేళ్ల మధ్య ఇమిడిన కత్తెర
టకటకమని శబ్దంతో శ్రమిస్తది
దూసే దువ్వెన పండ్ల నుంచి లేచిన
వెంట్రుకల పొగరును కటకట కత్తిరిస్తది
నెత్తి మీద దువ్వెనా కత్తెరల తైతక్కలతో
తల వెంట్రుకల క్షేత్రంలో సుందర నృత్యం
చిందర వందర పెరిగిన కేశాలను తీర్చిదిద్ది
సౌందర్యాత్మకంగా మలచడమే కత్తెర కళ
పెట్టుగడి చంద్రయ్య కలపతో నడిచి వస్తుంటే
తలకాయలు జొన్న కంకులోలె ఊగిన ఆనందం
మౌనంగా కనిపించే మా ఊరి చంద్రుడు
ఇంటింటి మగ ముఖాలపై వెలుగు నింపే సూర్యుడు
తాత నాన్న నేను, మా అందరి తలలను
వేప చెట్టు కింద ఆయనకు అప్పగించి
బుద్ధునిలా బుద్ధిగా కూర్చునేవాళ్ళం
తను మా తలలను క్షౌరించి, నూనెతోమర్దించి
తల చుట్టూర కొత్త తేజస్సు నింపేవాడు
కాళ్లకు ముల్లు గుచ్చి నొప్పి లేస్తే
గోరు గాలుతో కెల్లగించి తీసివేసిన జ్ఞాపకం
చంద్రయ్య భార్య లచ్చవ్వనైతే
మా పోతారం ఊరిలో
ఎన్ని వందల కాన్పులు చేసిందో
ఎన్ని మాయిమంతలు దాసిందో
ఆమె చేయి గుణమే నవ శిశువుల నవ్వు
మంత్రసాని లచ్చవ్వ అంటే జనులకు జనని
మంగలి తనం అంటే మాంగల్య దీపం
తలకు సుందర రూపాన్ని తెచ్చే అపురూపం
అదొక సేవా జీవన కళాత్మక వృత్తి
– అన్నవరం దేవేందర్, 9440763479