తల్లీబిడ్డల హత్య కేసులో ఉన్మాదికి ఉరిశిక్ష

చిత్తూరు : తల్లీబిడ్డ హత్య కేసులో దోషికి ఏపీలోని చిత్తూరు కోర్టు ఉరిశిక్ష విధించింది. సంబంధించి ప్రాసిక్యూషన్‌ కథనం ప్రకారం… చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి మండలం గంగిరెడ్డిపల్లికి చెందిన సయ్యద్‌ మౌలాలి చేపలు పట్టుకుని జీవనం సాగించేవాడు. అదే గ్రామానికి చెందిన సరళమ్మతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. తాగుడుకు బానిసైన మౌలాలి… సరళమ్మ పెద్ద కుమార్తె గంగులమ్మపై అత్యాచారం చేసేవాడు. ఈ విషయం తెలుసుకొని నిలదీసిన సరళమ్మను 2020లో ఇంట్లోనే హత్య చేసి గ్రామ సమీపంలోని పెద్ద ఏరులో మృతదేహాన్ని పడేశాడు. తల్లి గురించి పిల్లలు ప్రశ్నించడంతో మీ అమ్మకు కరోనా సోకిందని, ఆస్పత్రిలో ఉందని నమ్మబలికాడు. పిల్లలతో సహా బెంగళూరుకు మకాం మార్చేశాడు. తన తల్లిని ఏం చేశావంటూ ప్రశ్నించిన గంగులమ్మనూ హత్య చేసి, మృతదేహాన్ని మాయం చేశాడు. ఈ రెండు సంఘటనలూ 2020 ఆగస్టులో చోటుచేసుకున్నాయి. తల్లీబిడ్డ కనిపించకుండా పోవడంతో 2021లో సరళమ్మ సమీప బంధువు ధనమ్మ తంబళ్లపల్లి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు మౌలాలిని అరెస్టు చేసి హత్య, పోక్సో చట్టంతోపాటు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. విచారణ తుది దశకు వచ్చి నేరం రుజువు కావడంతో అతనికి ఉరి శిక్ష విధిస్తూ చిత్తూరు ఎడిజె కోర్టు న్యాయమూర్తి రమేష్‌ మంగళవారం తీర్పు చెప్పారు.