29న మణిపూర్‌ అసెంబ్లీ సమావేశం!

గువహటి : మణిపూర్‌ శాసనసభ వర్షాకాల సమావేశం ఆగస్టు 29న నిర్వహించాలని ముఖ్యమంత్రి బీరేన్‌ సింగ్‌ నేతృత్వంలోని మంత్రివర్గం నిర్ణయించింది. సోమవారం తీసుకున్న నిర్ణయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం మంగళవారం ఎక్స్‌ (ట్విట్టర్‌)లో ప్రకటించింది. జులై నుండి మణిపూర్‌ కేబినెట్‌ మూడుసార్లు ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో జాతుల ఘర్షణ, హింసపై చర్చించేందుకు సోమవారం ప్రత్యేక సమావేశం జరపాలని కేబినెట్‌ కోరినా గవర్నర్‌ నోటిఫికేషన్‌ జారీ చేయకపోవడంతో సమావేశం జరగలేదు. ఈసారి గవర్నర్‌ నోటిఫకేషన్‌ జారీ చేస్తారని భావిస్తున్నట్లు సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. ఏడాదిలో కనీసం రెండుసార్లు అసెంబ్లీ సమావేశమవాల్సి వుంటుంది. గత సమావేశం మార్చిలో జరిగింది. సెప్టెంబరు 2లోగా మరో సమావేశం జరగాల్సి వుంది. అయితే ఒకవేళ సమావేశం పెట్టినా భద్రతా కారణాల రీత్యా తాము రాలేమని ఇప్పటికే బిజెపికి చెందిన ఏడుగురు కుకీ ఎంఎల్‌ఎలు చెప్పారు.