మణిపూర్‌ మారణకాండ-మరోకోణం

ఇప్పుడు మణిపూర్‌ అంటే అలలు, అలలుగా… బారులు తీరి ఉండే కొండలు… పచ్చపచ్చని పంట పొలాలు… అడవులు… లోయలు, అంతెత్తు నుంచి జాలువారే జలపాతాలు… నింగిని తనలో నింపుకున్నట్లు ఉండే నీలినీలి సరస్సులు కాదు. ఇప్పుడు మణిపూర్‌ అంటే… రగులుతున్న రావణకాష్టం! ఇప్పుడు ఇక్కడి గాలి వేడిని నింపుకొని వీస్తుంది. ఇచ్చటి నీరు ఎర్రటి రక్తాన్ని స్రవిస్తుంది. ఇచ్చటి నేల మహిళల కన్నీటితో తడిసి ముద్దయింది. ఇలా ఇంకా రాయాలని ఉంది. కాని కలం కన్నీరు స్రవిస్తు ఉంది.బహుశా చాలా అరుదుగా ఇటువంటి స్థితి రచయితలకు వస్తుందేమో! అయినా ఈ ఘోరకలి ప్రపంచానికి తెలియజేయాలనే తపనే ఇలా రాయించింది.
మనువాదం ఉన్న చోట మానవత్వం ఉండదని మణిపూర్‌ను చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. 1990లో నూతన ఆర్ధిక విధానాలు అమలు మొదలైనప్పటి నుంచి దేశంలో జరుగుతున్న పరిణామాలు నిశితంగా పరిశీలిస్తే ఆర్ధిక దోపిడీకి మతం ముసుగు తొడిగి కలసిమెలసి జీవిస్తున్న ప్రజల మధ్య విద్వేషాలు రగిలించిన కారణంగా అనేక హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. గత మూడు నెలలుగా మణిపూర్‌లో జరుగుతున్న హింసాకాండ అంతా ఇంతా కాదు. రెండు జాతుల మధ్య పరస్పర విద్వంసం, జాతి వైరం తారా స్థాయికి చేరుకుంది. ఎల్లెడలా సైన్యం విస్తరించినా ఏమీ చేయలేని పరిస్థితి. మెజార్టీ మెయితీ అల్లరి మూకలు అత్యాధునిక ఆయుధాలతో ఊచకోతలు కోస్తున్నారు. వారి చేతుల్లోకి ఈ ఆయుధాలు ఎలా వచ్చాయి.? ఇంకా ఎన్నో, ఎన్నెన్నో అమానవీయ సంఘటనలు ప్రతిరోజూ జరుగు తూనే ఉన్నాయి. ఇంతఘోరకలి జరుగుతున్నా భాద్యతగల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ‘నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయి. ఇద్దరు అమాయక యువతులను బట్టలు లేకుండా రెండు కిలో మీటర్లు నడిపించి, సామూహికంగా అత్యాచారం చేసి చంపేశారు. రక్షించబోయిన సోదరుడు, తండ్రిని ప్రాణాలు పోయేలా కొట్టారు. మే 4వ తేదీన జరిగిన ఈ సంఘటనకు సంబంధించిని విడియో ఆలశ్యంగా వైరల్‌ అవడడంతో దేశం నివ్వెరపోయింది. ఇప్పటి వరకు మౌనముద్రలో ఉన్న ప్రధాని మోడి మొసలి కన్నీరు కార్చగా, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరెన్‌సింగ్‌ ఒక టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇలాంటి సంఘటనలు వందలు జరిగాయని, అందుకే రాష్ట్రంలో ఇంటర్నెట్‌ సేవలు నిలిపి వేశామని చెప్పడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి?
ఆదివాసి మహిళ అయిన దేశాధినేత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ సంఘటనపై నోరు మెదపకపోవడం దేన్ని సూచిస్తుంది? ఇదేనేమో మోడీ డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ పనితీరు. చివరకు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు జ్యోక్యం చేసుకొని ‘మీకు చేతకాకపోతే మేమే సమస్యను పరిష్కరిస్తామని ‘ప్రభుత్వాన్ని హెచ్చరించిందంటే బీజేపీ పాలన ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇక అసలు విషయానికి వస్తే మెయితీలకు ఎస్టీ హోదా కల్పించి కుకీల అటవీ భూములను మెయితీలకు కట్టబెట్టి ఇలా అటవీ ప్రాంతంపై ఆదిపత్యం కల్పించటం ద్వారా సామ్రాజ్యవాద బడా పెట్టుబడి దారులకు, అటవీ సంపదను దోచి పెట్టడం పాలకుల అసలు వ్యూహంగా ఉంది. అందుకే ఈ మారణకాండ. సువిశాలమైన సాంస్కతిక వైవిధ్యం, భిన్నత్వం కలిగి కలిసిమెలిసి జీవిస్తున్న ప్రజల మధ్య విధ్వేషం రగిలించటం ఇందులో భాగంగా చూడాలి. నేడు దేశం మొత్తం ఈ పరిస్థితి ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా మణిపూర్‌ లో గనులు, విలువైన ఖనిజ సంపద కోసం అన్వేషణ మొదలైంది. ప్రభుత్వ రంగ సంస్థ జీఎస్‌ఐ పెద్ద ఎత్తున సర్వేలు చేపట్టింది. ఈ సర్వేలలో ఆదివాసిలు నివసించే అటవీ ప్రాంతంలో ప్రపంచంలోనే అత్యంత విలువైన, అరుదైన ఖనిజ నిక్షేపాలు ఉన్నాయని గుర్తించారు. విలువైన ఆకుపచ్చ గ్రానెట్‌, ప్లాటినం గ్రూప్‌ మెటల్స్‌, ఎలిమెంట్స్‌, నికేల్‌, నోమైట్‌, కాపర్‌, బొగ్గు, పెట్రోలియం, సిమెంట పరిశ్రమకు అవసరమైన సున్నపురాయి లాంటి విలువైన నిక్షేపాలు గుర్తించారు.
ఈ నిక్షేపాల అప్పగింతలపై మణిపూర్‌ ప్రభుత్వం 2017లో 39 కార్పొరేట్‌ కంపెనీలతో ఒప్పందం చేసుకుంది. అయితే ఆదివాసి ప్రజలు నివసించే అటవీ, కొండ ప్రాంతాలలో వారికి కొన్ని రాజ్యాంగ, చట్టపరమైన హక్కులు ఉన్నాయి కాబట్టి అక్కడ మైనింగ్‌ దోపిడీకి సాధ్యం కాదు. ఇది బహుళజాతి కంపెనీలకు అడ్డంకిగా ఉంది. ఇందులోభాగమే అటవీ సంరక్షణ చట్టాల మార్పు చేయడం, హింసాత్మాకంగా ఆదివాసిలను బలవంతంగా అడవుల నుంచి గెంటి వేయడం, మారణకాండలు సృష్టించడం, వీరిపై మాదక ద్రవ్యాల స్మగర్లుగా, చట్టవిరుద్ద కాందిశీకులుగా బురద జల్లడం జరుగుతున్నాయి. పైకి మణిపూర్‌ మారణకాండ రిజర్వేషన్ల జాతుల వైరంగా కనిపిస్తున్న ప్పటికి వాస్తవంలో అది అటవీ, ఖనిజసంపద మొత్తం బహుళజాతి కంపెనీలకు కట్టబెట్టడమే అసలు లక్ష్యం. ప్రజలు వాస్తవాలను గుర్తించి దేశాన్ని విభజించి పాలిస్తున్న మతోన్మాద, పాసిస్టు పాలక మూకల నుండి కాపాడుకోవాలి. మణిపూర్‌ ఆదివాసి ప్రజలకు అండగా నిలబడాలి.
– షేక్‌ కరిముల్లా,
సెల్‌: 9705450705