మిజోరంలో మణిపూర్‌ ఎఫెక్ట్‌

Manipur Effect in Mizoram– జాతిహింసతో బీజేపీకి ప్రజల్లో వ్యతిరేకత
– క్రైస్తవ మెజారిటీ రాష్ట్రంలో హిందూత్వంతో ఎదురీత
– ఎన్నికల్లో భంగపాటు తప్పదంటున్న రాజకీయ విశ్లేషకులు
ఇంఫాల్‌ : ఈ ఏడాది మే 3 నుంచి ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌ జాతి హింసతో తీవ్ర ఆందోళనలు, అలజడులను చూసింది. అక్కడి ప్రజలు ఎంతగానో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కారు మాత్రం అల్లర్లను కట్టడి చేయలేకపోయింది. పైగా కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కారు సైతం హింసను అణచివేయటంలో విఫలమైంది. ఈ అల్లర్లు బీజేపీపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమయ్యాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే, దీని ప్రభావం పొరుగున్న ఉన్న రాష్ట్రం మిజోరాంపై సైతం పడిందని చెప్తున్నారు. ముఖ్యంగా, క్రైస్తవులు మెజారిటీగా ఉండే ఈ రాష్ట్రంలో బీజేపీ తీరు ఆందోళనకరంగా ఉన్నదంటున్నారు. హిందూత్వంతో ఇక్కడ తన రాజకీయాన్ని నడపాలనీ, ఎన్నికలలో గట్టెక్కాలని చూస్తున్నదని రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు.
దాదాపు 87 శాతం క్రిస్టియన్‌ మెజారిటీ ఉన్న మిజోరంలో బీజేపీకి ఎప్పుడూ గట్టిపోటీనే ఎదురవుతుండగా.. మణిపూర్‌ జాతి హింస అంశంతో ఇప్పుడు ఆ పార్టీలో గుబులు మొదలైందని అంటున్నారు. మిజోయేతర జనాభా ఎక్కువగా ఉన్న పశ్చిమ, దక్షిణ నియోజకవర్గాల్లోని 40 అసెంబ్లీ స్థానాల్లో 23 నుంచి బీజేపీ పోటీ చేయనున్నది. కనీసం ఐదుగురు బీజేపీ రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ.. ” పార్టీ 4-5 సీట్లు గెలుచుకోవాలని భావిస్తున్నది. ఇది హంగ్‌ అసెంబ్లీ విషయంలో తమను కింగ్‌మేకర్‌ స్థానంలో ఉంచవచ్చు” అని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కార్యకర్తలు ఢిల్లీ అధిష్టానం పట్ల అసంతృప్తితో ఉన్నారని తెలిపారు. మిజోరాంలోని మమిత్‌ జిల్లాలో ప్రధాని మోడీ షెడ్యూల్‌ చేసిన పర్యటన కూడా అకస్మాత్తుగా రద్దయిన విషయాన్ని గుర్తు చేశారు.
త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో మిజోరం ఒకటి. అయితే, మణిపూర్‌ అంశం మిజోరంలో తీవ్రంగా ప్రభావం చూపుతుందని బీజేపీ నాయకులు ఆందోళనలో ఉన్నారు. ‘మిజోలు బీజేపీని విలన్‌గా భావిస్తున్నారు. పార్టీ క్రైస్తవ వ్యతిరేకమని వారు అనుకుంటున్నారు. ప్రతిపక్షం ఈ కథనాన్ని ఎంతగానో వ్యాప్తి చేసింది. అది ఇప్పుడు మిజోస్‌ రక్తంలో ఉంది” అని బీజేపీ నాయకుడు అవియా అన్నారు. దీని నుంచి బయటపడటం చాలా కష్టమని తెలిపారు. గత కొన్ని నెలలుగా బీజేపీ అధ్యక్షుడు జెపి నడ్డా, నితిన్‌ గడ్కరీ వంటి జాతీయ నాయకులు ఎన్నికల ప్రచారం కోసం రాష్ట్రానికి వచ్చారు. అయితే వారెవరూ అటల్‌ భవన్‌లోని కార్యాలయాన్ని సందర్శించి ఆఫీస్‌ బేరర్లు, పార్టీ కార్యకర్తలను కలిసే ప్రయత్నం చేయరని అవియా అన్నారు. ”లోక్‌సభలో, మిజోరాంలో కేవలం ఒక సీటు మాత్రమే ఉన్నది. కాబట్టి పార్టీ పెద్దలు ఇక్కడ గెలుపు కోసం ఆసక్తితో లేరు. మనం గెలిచినా ఓడినా పట్టింపు లేదు. ఇతర రాష్ట్రాల్లో చాలా ఎక్కువ సీట్లు ఉన్నాయి. కాబట్టి వారు వాటి గురించి ఎక్కువ శ్రద్ధ వహిస్తారు” అని ఆయన తెలిపారు. క్రైస్తవ మెజారిటీ రాష్ట్రంలో హిందూత్వతో కొన్ని సీట్లన్నా గెలవాలని యోచిస్తున్న బీజేపీకి అసెంబ్లీ ఎన్నికల్లో భంగపాటు ఎదురుకాక తప్పదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.