మనిషి చనిపోయి కట్టెయ్యాక ఒకేసారి కాలుతాడు. కానీ బతికుండగానే క్షణక్షణం చితిమంటల్లో కాలడం ఎంత నరకం? రావణకాష్టంలా రగులుతున్న మణిపూర్ రాష్ట్రాన్ని, ఆ రాష్ట్ర ప్రజానీకాన్ని తలచుకుంటేనే భయం కలుగుతుంది. ఈ మంటలింక ఎన్నాళ్లు?
ఆరెస్సెస్ అధినేత మోహన్ భగవత్ ఇటీవలి ”హెచ్చరికలు”! అల్లర్లతో అతలాకుతలమవుతున్న మణిపూర్ సమస్యను తొలుత పరిష్కరించాలని మోడీ ప్రభుత్వానికి ”సూచించారు”. నేతలు అహంకారరహితంగా ప్రజాసేవలో నిమగం కావాలని, సభ్యతను, హుందాను మరచి ఒకర్నొకరు విమర్శించుకునే తీరు సమాజాన్ని రెండు వర్గాలుగా చీల్చుతుందని, పరస్పర అవిశ్వాసాన్ని కలిగిస్తుందని హితవచనాలు పలికారు. ఏడాదికాలంగా మణిపూర్ శాంతికోసం ఎదురు చూస్తున్నదన్నారు.
ఆ తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్‌షా మణిపూర్ రాష్ట్ర ఉన్నతస్థాయి భద్రతా సమావేశం ఇటీవల ఢిల్లీలో నిర్వహించారు. అయితే ఈ సమావేశానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ హాజరుకాకపోవటం వైచిత్రి. ఆ రాష్ట్రం నుండి ఎన్నికైన పార్లమెంటు సభ్యునికైతే ఆహ్వానమే లేదు. రాష్ట్రంలోని మెయితీ – కుకీ జాతుల మధ్య ఘర్షణ నివారణ కోసమే ఈ సమావేశం ఉన్నత భద్రతాధికారులతో జరిగినట్టు షా చెప్పుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కులదీప్‌సింగ్ సమావేశానికి అధ్యక్షత వహించారు.
‘అసలు కేంద్ర ప్రభుత్వం మణిపూర్‌ను ప్రతీకారేచ్ఛతో ఓ అస్థిత్వం లేని పరాయి రాష్ట్రంగా చూస్తున్నదని’ ఆ రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీ. బిమల్ అకోరుజమ్ విమర్శిస్తున్నారు. ఢిల్లీ సమావేశం అంతా షా నేతృత్వంలో సాగిన జరిగిన సైనిక (భద్రతా) అధికారుల తంతుగా ఆయన అభివర్ణించారు. ఆ సమావేశానికి స్థానిక ఎంపీనైన తనకూ ఆహ్వానం లేదు. ముఖ్యమంత్రీ పాల్గొనలేదు. రాష్ట్ర ప్రజా ప్రతినిధులు పాల్గొనని ఆ సమావేశం అప్రజాస్వామ్యం కాదా? అని ప్రశ్నించారు. ”రెండు ప్రజా సమూహాలు (జాతులు) మధ్య వైరం ఉన్నప్పుడు ఓ సమూహాన్నే నేరస్తులుగా, అను మానితులుగా పరిగణించడం ఘోరం కాదా? ఈ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి మౌనం కూడా సందేహాస్పదంగా ఉన్నది. చూస్తుంటే ఇదేదో కుట్రలా కనపడుతున్నది. సమావేశం కేంద్రపాలిత ప్రాంతం జమ్ము కాశ్మీర్‌ది మాదిరిగా నడిచింది. అక్కడ లెఫ్ట్‌నెంట్ జనరల్ ఉంటాడు. ఇక్కడ ఉండడు అంతే తేడా. కానీ ‘మాకిక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అంతర్గత శాంతి భద్రతల అంశం రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత. కేంద్రం ఈ విషయాలను ఏ మాత్రం పరిగణలోకి తీసుకోకుండా ఒంటెత్తు పోకడతో వ్యవహరిస్తున్నది. తన సైనిక కండకావరాన్ని చూపడానికి సిద్ధమవుతున్నది. ఇది నిరంకుశ పోకడ కాదా? దీనిని దేశ ప్రజలంతా గమనించాలి.’ అని బిమల్ విజ్ఞప్తి చేశారు.
ఏ కారణం రీత్యా సమావేశం జరిగినా ఆ సమావేశం సైనిక బలంతోనే శాంతిని నెలకొల్పాలనే దురుద్దేశ్యమే అవగతమవుతుంది. ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగోట్టేవారు, విద్వేషమంటలను ఎందుకు చల్లార్పుతారు? అనే ప్రశ్న లేకపోలేదు. శాంతిని నెలకొల్పడం అంటే ఆయుధబలంతోనే అనేది వారి స్వభావంలోనే ఉన్నప్పుడు ఉత్పన్నమవుతున్న పరిస్థితి ఇది.
మణిపూర్ రాష్ట్రంలో అశాంతిని కట్టడి చేయడంలో విఫలమయ్యామని లోక్‌సభ ఎన్నికల తర్వాత సాక్షాత్తు ముఖ్యమంత్రి బీరేన్‌సింగ్ ఒప్పుకున్నారు కూడా. మణిపూర్‌లో మెజారిటీ వర్గమైన మెయితీలకు షెడ్యూల్ తెగల హోదా ఇవ్వాలన్న అసందర్భ డిమాండే మారణహోమానికి మూల కారణమని అక్కడ ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఆ డిమాండ్‌కు నిరసనగా కొండ ప్రాంతంలోని ఆదివాసులు అందరూ పెద్ద ఎత్తున సంఘీభావ ర్యాలీ చేపట్టారు. గతేడాది మే 3వ తేదీ నుండి ఘర్షణలు అలా చెలరేగాయి. అప్పటినిండి ఈ కార్చిచ్చు రగులుతూనే ఉంది. అటు కేంద్రం – ఇటు రాష్ట్రం డబుల్ ఇంజన్ సర్కార్ స్వార్థపూరిత ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలతో ఈ అగ్నికి ఆజ్యం పోసిందే తప్ప మానవీయతకు రవ్వంత విలువనివ్వలేదు. గడిచిన ఈ 400 రోజుల్లో 220 మందికి పైగా అమాయకులు బలైపోయారు. దాదాపు 60 వేల మంది కొంపాగోడు వదిలి ఎక్కడెక్కడో వెళ్లి తలదాచు కున్నారు. అనేక మంది నిరాశ్రయులయ్యారు. వేలమంది చిన్నారులు బడులకు పోలేక చదువులకు దూరమయ్యారు.
మయన్మార్ నుంచి అక్రమంగా ప్రవేశించిన చొరబాటుదారులే ఈ ఘర్షణలకు మూలమని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వాదిస్తున్నాయి. ఎందుకంటే మయన్మార్ వలసదారులు, మణిపూర్ కొండ ప్రాంతాల్లో నివసించేవారు ఒకే కుకీ జాతికి చెందినవారు. ప్రభుత్వాలు, మైదాన ప్రాంత మెయితీ జాతికి కొమ్ము కాస్తున్నాయి. ఇప్పటికీ ఇదే పరిస్థితి.ఇదే భావన కాంగ్రెస్ ఎంపీ బిమల్ వ్యక్తం చేస్తున్నాడు. ఈ పక్షపాత ధోరణే శాంతికి భగమని విమర్శిస్తున్నాడు. అయినవారికి ఆకుల్లో, కానివారికి కంచాల్లో వడ్డించడం ఇంకెంతమాత్రం చెల్లదంటున్నాడు.
ఒకప్పుడు ఈశాన్య రాష్ట్రాల్లో అత్యధిక తలసరి ఆదాయంతో తులతూగిన మణిపూర్, ఈ ఘర్షణల కారణంగా అత్యల్ప మూడో తలసరి ఆదాయం గల రాష్ట్రంగా దిగజారింది. ఒక పక్క నానాటికి బతుకు దుర్భరమవు తున్నది. మరోపక్క ఎప్పుడు ఏ వైపు నుండి ఏక్షణాన ఘర్షణ కమ్ముకొస్తుందేమోననే భయం. అస్సాం సరిహద్దుగల ప్రాంతం జికోబామ్ జిల్లాలో సాక్షాత్తు ముఖ్యమంత్రి సెక్యూరిటీ కాన్వారుతో తాజాగా దాడులు జరిగాయి. దాంతో వేలాది మంది ప్రజానీకం అసోంకి తరలిపోయారు. ఇప్పుడు మణిపూర్ సమస్య మణిపూర్‌కే పరిమితం కాలేదు. సరిహద్దు రాష్ట్రాలకూ పాకింది.
ఇంత జరుగుతున్నా ప్రధాని మోడీ స్పందించకపోవడం మిలియన్ డాలర్‌ల ప్రశ్న. మూడోసారి ప్రధాని అయ్యాక కూడా దేశ విదేశాలు పర్యటిస్తున్నారు కానీ, మణిపూర్ వెళ్లరు. మణిపూర్ గురించి మాట్లాడరు. ఎన్నికల ప్రచారంలో కూడా ‘అశ్వద్ధామ హత: – కుంజరహా’ అన్నట్టు అక్కడ మణిపూర్‌లో రాష్ట్ర ప్రభుత్వ యత్నాలు – కేంద్రం జోక్యంతో పరిస్థితి మెరుగైనట్టు చెప్పారు అంతే.
అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పనితీరును ఎండగడుతూ. ఆ రాష్ట్ర ప్రజానీకం రెండూ ఎంపీ సీట్లలోనూ కాంగ్రెస్‌కే పట్టంగట్టారు. కాగా కేంద్ర ప్రభుత్వ గోడీ మీడియా ఎప్పటికప్పుడు మణిపూర్ పరిస్థితిని బాహ్య ప్రపం చానికి దాచిపెట్టినా, సత్యం, అహింస, ప్రజాస్వామ్యకాంక్షా ప్రియుల వలనే సోషల్ మీడియా ద్వారా వాస్తవాలు బయటకు వస్తున్నాయి. కేవలం కపటత్వంతో, ఆయుధబలంతో శాంతిని నెలకొల్పాలనుకోవడం మూర్ఖత్వం. ప్రజలు తమకు అవసరమైన శాంతి సామరస్యాలను ఉద్యమాల ద్వారా తప్పక సాధించుకుంటారు. ప్రజలే చరిత్ర నిర్మాతలు అన్న విషయం తెలిసిందే కదా!
కె. శాంతారావు
9959745723