మణిపూర్ మరలా మండుతోంది. మోడీ మణిపూర్ పోలేదని విపక్షాల విమర్శ. మణిపూర్ సమస్యను తీర్చమని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే రాష్ట్రపతికి లేఖ రాశారు. రాజ్యాంగాధికరణలు 370, 35ఎ కశ్మీరీలకు భూమి హక్కునిచ్చాయి. వీటి రద్దుతో కశ్మీర్ భూములను కార్పొరేట్ల కిచ్చారు. లక్షద్వీప్ కేంద్ర పాలనాధికారి రాజ్యాంగ పరిమితి దాటి చట్టాలు చేశారు. ప్రకృతి సంపద, సముద్ర తీరాలు, నిర్జన ద్వీపాలను కార్పొరేట్లకు పంచారు. నేటి పాలకవర్గాల ఇలాంటి చర్యలే మణిపూర్ అల్లర్లకు కారణం.
2017లో 60 సీట్ల (40 మైతీలకు, 20 కుకీ, నాగా, జోమి గిరిజనులకు) మణిపూర్‌లో 21 సీట్ల బీజేపీ పభుత్వాన్ని ఏర్పర్చింది.వైదికవాద మెజార్టీ మైతీలను, సనమహిలను రెచ్చగొట్టి సంఘ్ సంస్థలు క్రైస్తవ కుకీలపై దాడిచేశాయి. వారితో ఆస్తులు, ఇండ్లు, పొరుగు పంచుకోవద్దని 2022 ఎన్నికల్లో ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ మైతీలకు చెప్పారు. వారు ఈ గుజరాత్ నమూనాను పాటించారు. కుకీలు, నాగాలు మణిపుర్ లోయలో పిల్లలను చదివిస్తారు. చిన్న పనులతో అద్దె ఇండ్లలో బతుకుతారు. సంఘ్ దాడులతో పిల్లల చదువు, పెద్దల జీవనం ఆగాయి. డబులింజిన్ ప్రభుత్వంతో శాంతిభద్రతలు, జీవన ప్రమాణాలు పెంచుతా మని, మైతీలకు షెడ్యూల్డ్ ట్రైబ్ (ఎస్టీ) హోదా ఇస్తామని మోడీ ప్రచారం చేశారు.(సామాజిక, ఆర్థిక వెనుక బాటుతో రాజకీయ ప్రాతినిధ్యం పొందలేని మూలప్రాంతాల గిరిజనులకు రాజ్యాంగం ఎస్టీ హోదానిచ్చింది. మైతీలు దీనికి అనర్హులు) రాజ్యాంగ విరుద్ధ వాగ్దానాలతో దోచుకున్న 32 సీట్లతో 2022లో ప్రభుత్వాన్ని ఏర్పర్చారు.అభివృద్ధి నిధుల్లో 80శాతం మైతీలకు, 20శాతం గిరిజనులకిచ్చారు. పాలకవర్గ మైతీలకు 36 వేర్పాటువాద తీవ్రవాద సంస్థలపై ఆంక్షలను ఎత్తేశారు. అవి విజృంభించాయి. ఎస్టీ హోదా కోసం మైతీలు ఉద్యమించారు. వారి తీవ్రవాద సంస్థలు, సంఘ్ వత్తాసు పలికాయి. దీనికి గిరిజనులు నిరసన తెలిపారు. వీరిని అడ్డుకునేందుకు మైతీలు హింసకు పాల్పడ్డారు.
మణిపూర్‌లో మయన్మార్లు చొరబడ్డారని సంఘ్ ప్రచారం. నియంత్రిత ప్రాంత అనుమతితో విదేశీయులకు పదిరోజుల మణిపూర్ ప్రవేశం ఇస్తారు. అధికార అశ్రద్ధతో బర్మా చిన్ తెగవారు మణిపూర్‌లో చొరబడ్డారు. రోహింగ్య ముస్లింలను అడ్డుకున్న కేంద్రం వీరిని ఆపలేదు. బీజేపీ పాలిత గుజరాత్, రాజస్థాన్, హరియాణాలకు వైదిక విదేశీయులను రానిచ్చారు. వారికి పౌరసత్వం, ఓటు హక్కు ఇచ్చి 2014లో వారితో 19 ఎంపీ సీట్లు పొందారు. ఇదే ప్రయోజనాన్ని ఆశించి కేంద్ర రాష్ట్ర పాలకులే మణిపూర్‌లోకి బర్మీయులను రానిచ్చారు. కుకీల పర్వత ప్రాంతాల్లో బొగ్గు నిలువలున్నాయి. ఇటీవల చమురు,వజ్రాల నిక్షేపాలు కనిపెట్టారు. వాటిని కార్పొరేట్లకు ఇవ్వాలని బీజేపీ పాలకుల పన్నాగం. రక్షిత, వన్యప్రాణ అభయారణ్య అడవుల సాకుతో కుకీల భూములను ఆక్రమించారు. వారిని తరిమేశారు. కుకీలు నల్లమందు పండిస్తున్నారని వారి తోటలను ధ్వంసం చేశారు. పాలక మైతీల వాణిజ్యవేత్తలే నల్లమందు వ్యాపారం చేస్తారు. వారి డ్రగ్ సిండికేట్లు కుకీల నుండి నల్లమందును తక్కువ ధరకు కొంటారు. నల్లమందు పంటను, వ్యాపారాన్ని సొంతం చేసుకోవాలని వీరి పథకం. పోలీసులు అరెస్టుచేసిన నల్లమందు ముఠాలలో ముఖ్యమంత్రి బంధువులున్నారు. ఆర్థిక అసమానతలు, నిరుద్యోగం, పేదరికం, జాతి ద్వేషాలు కుకీలను నల్లమందు వైపునకు నెట్టాయి. పాలకులు సమస్యలను పరిష్కరిస్తే కుకీలు నల్లమందు జోలికిపోరు.
మణిపూర్ క్రైస్తవ జనాభా పెరిగిందని, వారు మైతీలను మించుతారని సంఘ్ ప్రచారం. 1961-2011 మధ్య యాభైఏండ్లలో క్రైస్తవులు ఐదు లక్షలు పెరిగారు. వైదికులూ పెరిగారు. క్రమేపి పెరిగిన జనాభా, ఓట్ల కోసం పాలక ఆమోదిత వలసలు, వైదిక వివక్షను భరించలేక క్రైస్తవానికి మార్పిళ్లు పెరుగుదలకు కారణం. క్రైస్తవ పెరుగుదలను ఆపడానికి జాతీయ పౌరసత్వ, జనాభా జాబితాలను తయారుచేయమని, 1951 జనాభా ప్రకారం పౌరసత్వాన్ని సవరించమని సంఘ్ గొడవచేసింది. దీనితో 95శాతం కుకీలు, నాగాలు పౌరసత్వం కోల్పోయి రాష్ట్రాన్ని వదలాలి. అల్లర్లలో ఆరు వేల ఆయుధాలు చోరీఅయ్యాయి. పోయింది వెయ్యేనని, 200 రికవరీ చేశామని ముఖ్యమంత్రి అన్నారు. అల్లర్లు జరిగిన చురాచందపుర్‌లోనే కాక రాష్ట్రమంతా (కేంద్ర, సైనిక, ప్రత్యేక దళాల భాండాగారాలను వదిలి) రాష్ట్ర రక్షణదళాల భాండాగారాల నుంచే చోరీలు జరిగాయి. ఒక్కటీ పట్టుబడలేదు. అన్ని స్టేషన్లలో పోలీసు నిర్లిప్తత అనూహ్యం. పాలకుల, అధికారుల మద్దతుతో ఈ ఆయుధాలు సంఘ్, మైతీ సంస్థలకు చేరాయి. చనిపోయిన 250 మందిలో 98శాతం, పారిపోయిన 6,500 మందిలో 70శాతం, గాయపడ్డ 500 మంది కుకీలు. కుకీల 20వేల ఇండ్లు, 200 చర్చిలు, 17 గుళ్లు, 124 గ్రామాలు, వారి ఆస్తులు, వాహనాలే బూడిదయ్యాయి. కుకీలను తీవ్రవాదులుగా చిత్రించి పాలకులే చంపారు. 3 జూన్ 2023న కేంద్రం నియమించిన దర్యాప్తు సంస్థ గడువుతీరినా నివేదిక నివ్వలేదు. గిరిజనులు ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుతున్నారు. ఈ సందులో మయన్మార్ సైనిక ఝుంఠా మణిపుర్‌లో చొరబడగలదు.
స్త్రీలు, క్రీడాకళాకారులు, మేధావులు దేశవ్యాపితంగా నిరసనలు తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ సంస్థలు, ఐరాస మానవహక్కుల సంస్థ, 550 మంది పౌరసమాజ ప్రతినిధులు, కేంద్ర పాలకులు జోక్యం చేసుకోవాలని, హత్యలు, హింసను, దమనకాండను ఆపాలని ఉత్తరాలు రాశారు. ప్రధాని, రాష్ట్రపతి పట్టించుకోలేదు. మోడీ మణిపూర్‌కు పోతే ‘నీవిస్తానన్న ఎస్టీ హోదా ఎక్కడా?’ అని నిలదీస్తారు. డబులింజిన్ డొల్లని విమర్శిస్తారు. మోడీ అక్కడికెళ్లినా నష్టమే. మణిపూర్ సమస్యకు విపక్షాలే కారణమంటారు. తాను సమస్యను పరిష్కరిస్తుంటే క్రైస్తవులు, కమ్యూనిస్టులు అడ్డుకున్నారంటారు. తన ”ఘనత”ను ఘోషిస్తారు. నాలుగు వందల ఏండ్ల నాటి ముస్లిం పాలన, హిందు ఇస్లామీకరణ, క్రైస్తవీకరణలు మణిపూర్ మంటలకు మూలాలంటారు. ధృతరాష్ట్ర (వాట్సాప్) విశ్వవిద్యాలయ వత్తాసుదారులతో నమ్మిస్తారు.ప్రజాసేవకు, శ్రేయస్సుకు అంకితమవుతానని రాజ్యాంగాధికరణ 60 ప్రకారం రాష్ట్రపతి ప్రమాణం చేశారు.
గిరిజన ముర్ముకు మణిపూర్ సొంత సమస్య. వందల స్త్రీల మానప్రాణాలు పోయాయి. గిరిజనులు హత్యలు, దోపిడీలకు గురయ్యారు. మణిపూర్ గిరిజన సంక్షేమానికి కొండ ప్రాంతాలను కాపాడే రాజ్యాంగాధికరణ 371సి ఇచ్చిన ప్రత్యేక హోదాను మోడీయం దుర్లక్ష్యం చేసింది.స్త్రీలు, తన జాతి ప్రజలకు ఇన్ని అన్యాయాలు జరిగినా, మణిపూర్ ప్రజాహింసకు సైనిక ప్రత్యేకాధికారాల చట్టం తిరిగి అమలయినా సర్వసైన్యాధిపతి ముర్ము మౌనంగా ఉన్నారు.దేశ ప్రతిష్ట, లౌకికత్వం, మానవత్వాల రక్షణకు ప్రభుత్వాధిపతికి సూచనలివ్వడం దేశాధిపతి బాధ్యత.
మోడీ కార్పొరేట్ ఫాసిజానికి, ఆశ్రిత కార్పొరేట్ల దోపిడీ, మోసాలకు వ్యతిరేకంగా సమాజాన్ని చైతన్యపర్చాలి.లౌకిక సమాజ అవసరాన్ని వివరించాలి.మనముందే రాజ్యవ్యవస్థ కూలింది. మన క్షేమాన్ని మనమే పట్టించుకోవాలి. సామాన్యుల సమస్యల పరిష్కారానికి పోరాడిన చారిత్రక విప్లవవీరులెందరో మనకు ఆదర్శం. వారి పోరాటాలు సమస్యల నిరోధకాలు, పరిష్కారాలు. స్వేచ్ఛాసాధికార న్యాయబద్ద జీవితాల సాధనాలు. ఆశ్రిత పక్షపాత పెట్టుబడిదారి పద్ధతి సామాన్యుల సమస్యలు పరిష్కరించదు. మనం ఒంటరులం కాదు. సామూహికంగా సమస్యలను పరిష్కరించుకోగల ఆలోచనాపరుల సంఘ సభ్యులం. శాంతిసౌఖ్యాల ప్రపంచ నిర్మాణానికి విప్లవమార్గం పడదాం.
– సంగిరెడ్డి హనుమంత రెడ్డి, 9490204545