రాజ్యాంగ సంక్షోభం ముంగిట మణిపూర్‌?

Manipur on the brink of constitutional crisis?– క్యాబినెట్‌ సిఫార్సును పట్టించుకోని గవర్నర్‌
– జరగని అసెంబ్లీ ప్రత్యేక సమావేశం
– సుప్రీంకు గీతా మిట్టల్‌ కమిటీ నివేదిక
న్యూఢిల్లీ : మణిపూర్‌లో నెలకొన్న సంక్షోభ పరిస్థితులపై చర్చించేందుకు సోమవారం అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమవ్వాలని మంత్రివర్గం సిఫార్సు చేసినా ఆ రాష్ట్ర గవర్నర్‌ అనసూయ ఉయికే అనుమతించలేదు. దీంతో అసెంబ్లీ సమావేశం జరగలేదు. గవర్నర్‌ అనుమతినివ్వక పోవడంతో రాజ్‌భవన్‌ నోటిఫికేషన్‌ జారీ చేయలేదని అధికారులు తెలిపారు. మణిపూర్‌లో చెలరేగుతున్న జాతుల ఘర్షణపై చర్చించేందుకు వెంటనే శాసనసభను సమావేశపరచాలని ప్రతిపక్ష కాంగ్రెస్‌తోపాటు ఇతర జాతీయ పార్టీలు డిమాండ్‌ చేస్తున్నాయి. తాజాగా గవర్నర్‌ సభా నిర్వహణకు అనుమతినివ్వకపోవడంపై కాంగ్రెస్‌ స్పందిస్తూ ఈ పరిస్థితి రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభానికి దారితీస్తుందని వ్యాఖ్యానించింది. ఆదివారం ఇంఫాల్‌లో పార్టీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ నేత ఓక్రమ్‌ ఐబోబి సింగ్‌ మాట్లాడుతూ, రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఆరు మాసాలకోసారి అసెంబ్లీ సమావేశమవడం తప్పనిసరని అన్నారు. సాధారణ అసెంబ్లీ సమావేశానికి 15 రోజులు ముందుగా నోటిఫికేషన్‌ జారీ చేయాల్సి వుంటుంది. గవర్నర్‌ కార్యాలయం అటువంటి నోటిఫికేషన్‌ ఏదీ ఇప్పటివరకు జారీ చేయలేదని అధికారులు చెప్పారు. ఈ నెల ఆరంభంలో కేబినెట్‌ సమావేశమైనప్పుడు 21వ తేదీ నుంచి 12వ మణిపూర్‌ అసెంబ్లీ నాలుగో సెషన్‌ సమావేశాలు జరపాల్సిందిగా సిఫార్సు చేసింది. ఈ మేరకు ఆగస్టు 4న అధికారిక ప్రకటన వెలువడింది. మార్చిలో అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. ఆ తర్వాత అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడింది. తదుపరి సమావేశాలు సెప్టెంబరు 2లోగా జరగాల్సి వుంది. లేనిపక్షంలో రాజ్యాంగ సంక్షోభం తప్పదని మరో అధికారి వ్యాఖ్యానించారు. ఈలోగా మే నుంచి హింస చెలరేగింది.
సుప్రీంకోర్టుకు 3 నివేదికలు అందజేసిన గీతామిట్టల్‌ కమిటీ
ఘర్షణలు, హింస, కాల్పులు, గృహ దహనాల్లో ధ్వంసమైన వేలాది కీలక పత్రాలను తిరిగి రూపొందించి బాధితులకు సాధ్యమైనంత త్వరగా అందచేయాలని గీతామిట్టల్‌ కమిటీ సూచించింది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు మూడు నివేదికలను అందచేసింది. మణిపూర్‌ ప్రజలకు చట్టబద్ధ పాలన పట్ల తిరిగి విశ్వాసాన్ని పునరుద్ధరించేందుకు అవసరమైన సూచనలు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్‌ ఈ కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కీలక పత్రాల పునర్నిర్మాణ బాధ్యతలను చేపట్టేందుకు నోడల్‌ అధికారిని నియమించాలని కమిటీ సూచించిందని నివేదికలను పరిశీలించిన తర్వాత చంద్రచూడ్‌ తెలిపారు. మణిపూర్‌ బాధిత నష్టపరిహార పథకం (ఎంవిసిఎస్‌)కి సంబంధించి కమిటీ రెండో నివేదికను అందజేసింది. ఆ పథకాన్ని ఇంకా గణనీయమైన రీతిలో మెరుగుపరచాల్సి వుందని కమిటీ అభిప్రాయపడిందని చంద్రచూడ్‌ చెప్పారు. బాధితులు మరో సంక్షేమ పథకంలో ప్రయోజనం పొందుతున్నట్లైతే వారు ఎంవిసిఎస్‌ కింద ప్రయోజనాలకు అర్హులు కాకపోవడాన్ని కమిటీ తీవ్రంగా విమర్శించింది. ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి పరిమితులు, నిషేధం లేవని కోర్టు పేర్కొంది. ఇతర రాష్ట్రాల్లో, బాధితుడు మరే ఇతర పథకం కిందైనా ప్రయోజనం పొందుతున్నట్లైతే, ఈ పథకం కింద నష్టపరిహారాన్ని నిర్ణయించేటప్పుడు దాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటారని చంద్రచూడ్‌ వ్యాఖ్యానించారు. దీనిపై విచారణను కోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది.