మణిపూర్‌లో గిరిజన మహిళల్ని వేధిస్తూ తీసిన వీడియో, పరిస్థితిని చక్కదిద్దడంలో ఆ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం ఇంకా కొనసాగుతూనే ఉందని రుజువు చేసింది. కాబట్టి రాష్ట్రంలో రాజ్యాంగ క్రమాన్ని రక్షించేందుకు ప్రధాని తన చర్యలను వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది.
బీజేపీ పాలిత రాష్ట్రమైన మణిపూర్‌లో ఒక గుంపు, కూకీ తెగకు చెందిన ముగ్గురు మహిళలపై అనాగరికంగా అత్యాచారం చేసి, ఏడుస్తున్న వారిని పూర్తిగా వివస్త్రలను చేసి ఊరేగించింది. ఆ గుంపులోని కొందరు, వారిని తాకడం ద్వారా క్రూరమైన అశ్లీలతను ప్రదర్శించి, అనాగరికంగా దుర్భాషలాడుతూ, అవమానకరంగా నిందించి పైశాచిక ఆనందాన్ని పొందారు. గుజరాత్‌లో బిల్కిస్ బానోపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడి, ఆమె మూడు నెలల బిడ్డతో పాటు కొంతమంది కుటుంబ సభ్యులను హత్య చేసి, జీవిత ఖైదు శిక్షలు విధించబడిన 11మంది హంతకులను, రేపిస్టులను గుజరాత్ బీజేపీ ప్రభుత్వం ఆగస్ట్ 15, 2022 స్వాతంత్య్ర దినోత్సవం నాడు విడుదల చేసిన తొమ్మిది నెలల తరువాత (ఈ సంవత్సరం మే మొదటి వారంలో) మణిపూర్‌లో ఈ భయంకర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆగస్ట్ 15న ఎర్రకోట పైనుండి ప్రధాని నరేంద్ర మోడీ ‘నారీశక్తి’ (మహిళా శక్తి) గురించి మాట్లాడుతూ ”మహిళలను అవమానపరిచే, కించపరిచే మన ప్రవర్తన, సంస్కృతి, రోజువారీ జీవితంలోని లక్షణాలను వదిలించుకుంటామని మనం ప్రతినబూనలేమా?” అని మాట్లాడిన తరువాతే, శిక్షాకాలం తగ్గింపు నిబంధనలను అన్వయించి నిందితులను, రేపిస్టులను విడుదల చేశారు.
రెస్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ కూడా అయిన బ్రిజ్ భూషణ్ సింగ్ లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా ఢిల్లీలో నిరసన వ్యక్తం చేస్తున్న అంతర్జాతీయంగా ప్రశంసలుపొంది, పతకాలు సాధించిన కొందరు మహిళా రెజ్లర్లు ఢిల్లీ పోలీసుల అనాగరిక చర్యలను ఎదుర్కొంటుండగా, అలాంటి మణిపూర్ మహిళలను గాయపరిచి, బట్టలూడదీసి, బహిరంగంగా నగంగా బజార్లలో ఊరేగించడం విషాదకరమైన విషయం. మే 3, 2023 నుండి ‘రాష్ట్రం గందరగోళంగా ఆందోళనకరమైన హింసంలో చిక్కుకున్న తరువాత అలాంటి వందల సంఘటనలు చోటుచేసుకుంటాయి, వాటి తీవ్రత ఏ మాత్రం అదుపు కాకుండా కొనసాగుతాయి’ అని చెప్పడంలో మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ తన మందబుద్ధిని ప్రదర్శించాడు.
దేశ విభజనకు ముందు రోజుల పునఃప్రదర్శన
భారతదేశంలో పశ్చిమ, ఉత్తర ఈశాన్య ప్రాంతాల్లో జరుగుతున్న ఇలాంటి భయంకర పరిణామాలు మహిళల పరువు, గౌరవాల ఉల్లంఘనలకు ప్రాతినిథ్యం వహిస్తున్నాయి. జూలై 2, 1947నాడు మహాత్మాగాంధీ వరుస హింసాత్మక సంఘటనలు, విధ్వంసం, మహిళలపై అనాగరిక దాడులను ఉదహరిస్తూ ”నేడు గాలిలో హత్యలు, దొంగతనాలు, అత్యాచారాలు జరుగుతున్నాయి” అని మాట్లాడిన సందర్భపు (విభజనకు ముందు) రోజులను, ప్రస్తుత మణిపూర్ పరిణామాలు పునఃప్రదర్శిస్తున్నాయి. దేశంలోని పెద్ద ప్రాంతాల్లో మత, జాతి పరమైన ఘర్షణలను ప్రజ్వలింపచేసే క్షమించరాని అధిక సంఖ్యాకవాదం (మెజారిటేరియనిజం) కారణంగా మన దేశప్రతిష్టకు కోలుకోలేని నష్టం వాటిల్లడం వల్ల మనం ఇలాంటి బాధాకరమైన పరిస్థితులను అనుభవించేందుకు నెట్టబడ్డామా?
ప్రధానమంత్రి మౌనం
బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ క్రమాన్ని కొనసాగించ లేని మణిపూర్‌లో కొనసాగుతున్న విధ్వంసం, వేగంగా పెరుగుతున్న హింసపై ప్రధానమంత్రి మౌనం, మొత్తం దేశాన్ని కలవరానికి గురిచేసి, దేశంలో భిన్న వర్గాల ప్రజల మధ్య ఐక్యత, స్నేహం కోసం నిలబడే వారిని వేదనకు గురి చేస్తున్నాయి. ఆయన జూలై 21వ తేదీన మణిపూర్ మహిళల వేదనలు, బాధలపై కేవలం 36 సెకన్లు మాట్లాడి, ఆ తరువాత కాంగ్రెస్ పార్టీ పాలిస్తున్న రాజస్థాన్, ఛత్తీస్‌ఘఢ్ రాష్ట్రాల్లో జరుగుతున్న హింసను, మణిపూర్‌లో జరుగుతున్న హింసతో పోల్చుతూ మాట్లాడినాడు. వాస్తవానికి మణిపూర్‌లో జరుగుతున్నంత హింస ఆ రాష్ట్రాల్లో జరగడం లేదు.
మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన తీరుపై ఆగ్రహించిన సుప్రీంకోర్టు మణిపూర్ సమస్యను సుమోటోగా స్వీకరించింది. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించడంలో విఫలమైతే, తానే సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోనున్నట్లు చెప్పింది. ఇలాంటి నిర్థారణలు, సమస్య పట్ల సుప్రీంకోర్టు ఆందోళనను బహిర్గతం చేసి, రాష్ట్రంలో రాజ్యాంగ క్రమం విచ్ఛిన్నం అవుతున్న తీరును సూచిస్తున్నాయి.
గాంధీజీ దార్శనికత
హింస, అలజడి, అల్లకల్లోలాల కారణంగా మహిళలు, పిల్లలే ఎక్కువగా బాధలు అనుభవించేవారు. వారిని రక్షించడంలో ప్రభుత్వం విఫలం చెందినప్పుడు వారి బాధలు మరింతగా పెరుగుతాయి. డిసెంబర్ 1, 1946న మహాత్మాగాంధీ, గుజరాత్ రాష్ట్రంలో కథియావార్ సంస్థానంలో మహిళలతో వ్యవహరించిన తీరును గురించి ‘హరిజన్’ పత్రికలోలో ఇలా పేర్కొన్నాడు. ”మానవుని స్వభావం ఎంత దుర్నీతికి పాల్పడుతుందో నేను మీకు వర్ణించలేను. కొన్ని సంస్థానాలలో ఏ మహిళ గౌరవానికీ రక్షణ ఉండదు, ఏ పాలకుడూ దుండగుడు కాదు కానీ, భగవదంశచేత రాజవుతాడు.” మణిపూర్‌లో బట్టలూడదీసి, నగంగా బజార్లలో ఊరేగించిన మహిళలతో వ్యవహరించిన తీరులో బహిర్గతమైన మానవుని దుర్నీతి తీవ్రత, వెన్నులో వణుకుపుట్టించేలా ఉంది. రాజ్యాంగం ప్రకారం పాలన చేయాలని, రాజ్యాంగాన్ని కాపాడే లక్ష్యంతో ఎన్నుకోబడిన బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పటికీ, పోలీస్ స్టేషన్ నుండి తీసుకొని వచ్చి, అత్యాచారం చేసి, అవమానించిన పురుషుల దుర్నీతికి మహిళలు బాధితులుగా మారుతున్నారు.
జాతికే అవమానం
లింగ, జాతి, మత అస్తిత్వం కారణంగా బాధిత మణిపూర్ మహిళలు ఎదుర్కొంటున్న భయంకర పరిస్థితులు మొత్తం దేశాన్ని కదిలించివేసింది. బిల్కిస్ బానో కేసులో, అత్యాచారాలకు, హత్యలకు పాల్పడి, నేరస్తులుగా శిక్షలు పడిన వారి విడుదల లాంటి అసభ్యకరమైన చర్యలు, మహిళలకు వ్యతిరేకంగా జరుగుతున్న నేరాలు, మణిపూర్‌లో కొనసాగుతున్న హింస అభ్యంతరకరమైనది, అనాగరికమైనదని రుజువు చేస్తున్నాయి. ఇది భారతదేశ ప్రతిష్టను ప్రపంచ వ్యాప్తంగా దిగజార్చుతుంది. అంతర్జాతీయ మీడియాలో మణిపూర్‌పై వస్తున్న పతాక శీర్షికలకు ఇదొక సూచిక.
రాష్ట్ర ప్రభుత్వం అసమర్థంగా మారిందా?
ఇటీవల కాలంలో మాత్రమే సుప్రీంకోర్టు ద్వేషపూరిత ప్రసంగాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం అసమర్థంగా మారిందని వర్ణించింది. మణిపూర్ మహిళలకు జరిగిన తీరు మరీ భయంకరమైనదిగాను, వణుకు పుట్టించేదిగాను ఉంది. రక్తపాతాన్ని, హింసను రెచ్చగొట్టే ద్వేషం నింపుకున్న అధిక సంఖ్యాకవాదం చర్యల ఫలితమే ఇలా జరిగిందని ప్రతీ ఒక్కరూ విశ్వసిస్తారు. ద్వేషం నింపుకున్న అధిక సంఖ్యాకవాదాన్ని కట్టడి చేసి, ఓడించకపోతే మణిపూర్ మహిళలకు జరిగిందే ఏ మహిళకైనా జరుగుతుంది.
బాధితులను గౌరవించండి
హింసను, మత ఘర్షణలను చల్లార్చడానికి 1947లో మహాత్మాగాంధీ బంగ్లాదేశ్‌లోని నోఖాలీలో ఉన్నారు. నవంబర్ 26, 1947లో ఓ ప్రార్థనా సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ, అక్కడ కిడ్నాప్‌కు గురై, నిర్దాక్షిణ్యంగా, క్రూరంగా హింసించబడి చెప్పలేని బాధలను అనుభవించిన మహిళల గురించి ప్రస్తావించారు.” నా కూతురు లేదా నా భార్య కూడా అపహరించబడి, అత్యాచారాలకు గురి కావచ్చు, కానీ ఆ కారణంగా నేను ఆమెను ద్వేషించను” అని ఆయన అన్నారు. శారీరకంగా హింసకు గురై బాధలను అనుభవించే హిందూ ముస్లిం మహిళలు ఇరువురూ ఆయనను నోఖాలీలో కలిసారు. ఆయన మనలోని లోపాలను ఎత్తి చూపుతూ ఇలా అన్నాడు… ”మనం అందరం గూండాలుగా మారిపోయాం, సిగ్గు పడాల్సింది అత్యాచారాలకు పాల్పడిన పురుషులు కానీ, పాపం! ఆ మహిళలు కాదు” అని ఆయన ఆ మహిళలను ఓదార్చారు.
అత్యంత దారుణమైన అవమానాలను ఎదుర్కొన్న మణిపూర్ మహిళలు, న్యాయం కోసం రాజ్యాంగబద్ధంగా పోలీసులను ఆశ్రయించడం లాంటి సాహసోపేతమైన చర్యల ద్వారా తమ ధైర్యాన్ని ప్రదర్శించారు. వారికి న్యాయం జరగాలంటే ప్రధానమంత్రి నోరువిప్పి, నిర్ణయాత్మక చర్యలను చేపట్టాలి. ఆయన ప్రమాణం చేసిన విధంగానే రాజ్యాంగ బద్ధంగా, చట్టబద్ధంగా ఎలాంటి భయం, పక్షపాతం, ఆప్యాయత, దురుద్దేశాలు లేకుండా జీవిస్తూ, అన్ని వర్గాల ప్రజలకు మంచి జరిగే విధంగా చర్యలు చేపట్టాలి. ఆయన మౌనం, మణిపూర్ పై ఆయన కొద్ది సెకండ్ల పాటు చేసిన కొన్ని వ్యాఖ్యలు, ఆయన చేసిన ప్రమాణానికి తగిన విధంగా లేవు. మణిపూర్ కష్టాల నుండి ప్రజల్ని గట్టెక్కించి, మొత్తం దేశాన్ని రక్షించడానికి ఆయన వేగవంతమైన చర్యల్ని చేపట్టాలి.
(”న్యూస్ క్లిక్” సౌజన్యంతో)
అనువాదం:బోడపట్ల రవీందర్, 9848412451
ఎస్. ఎన్. సాహూ