మాంజా వద్దు.. మామూలు దారాలే ముద్దు

– ప్రమాదాలో జాగ్ర్రత్తలు తీసుకోవాలి
నవతెలంగాణ-బాలానగర్‌
పిల్లల నుంచి పెద్దల వరకు తారతమ్యాలు లేకుండా కేరింతలతో నిర్వహించుకునే పండుగలో సంక్రాంతి పండగ ఓ ప్రత్యేకమైనది. సాధారణ పర్వదినాల నుంచి మొదలుకుని రాష్ట్ర, జాతీయ పండుగల వరకు ఎంతో సంబురంగా నిర్వహించుకుంటాం. ఇక సంక్రాంతి లాంటి పండుగ వస్తే గ్రామాలతోపాటు పట్టణ ప్రాంతాల్లోని ప్రతి ఇంటిపై పతంగి ఎగరాల్సిందే. కైట్‌ ఫెస్టివల్‌ సందర్భంగా మనుషులు, పక్షులు, జంతువులతోపాటు భూమిపై ఉన్న సమస్త జీవరాశులకు ఎలాంటి అవరోధం, అపాయం కలగకుండా నడుచుకోవడమే మానవ ధర్మంగా పలువురు ప్రకతి ప్రేమికులు, పర్యావరణ, ఆధ్యాత్మిక వేత్తలు, జంతు ప్రేమికులు సూచిస్తున్నారు. వివిధ రకాల గాలిపటాలు ఎగురవేసే సందర్భంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. తల్లిదండ్రులు కూడా ఎప్పటికప్పుడు తమ పిల్లలు తగు జాగ్రత్తలు తీసుకునేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
చైనా మాంజాలతో పొంచివున్న ప్రమాదం
అందరూ కలిసి గాలిపటాలు ఎగురవేస్తూ ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు. కాగా పతంగులను ఎగురవేయడానికి ఉపయోగించే చైనా మాంజాతో పెద్ద ప్రమాదం పొంచి ఉందనే చెప్పాలి. గతంలో ఈ మాంజా వల్ల నగరంలో ఉన్న పక్షులకు ప్రమాదం వాటిల్లింది. కానీ ప్రస్తుతం ఈ చైనా మాంజాలు చాలా గట్టిగా ఉండటంతో, మూగజీవాలకే కాదు రోడ్డుపై వెళ్లే ప్రయాణికులకు ప్రాణహాని నెలకొందని, గాల్లోకి ఎగిరిన పతంగులు తెగి రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో అవి వాహనదారుల మెడలకు, కన్నులకు తగిలి తీవ్ర గాయాలవుతు న్నాయి. ఈ సంవత్సరం చైనా మాంజాల ప్రమాదాల సంఖ్య తగ్గింది. ఈ చైనా మాంజా నుంచి ప్రజల ప్రణాలు కాపాడేందుకు జీహెచ్‌ఎంసీ అధికారులు తగిని చర్యలు తీసుకొవాలని ద్విచక్రవాహణ దారులు కోరుకుంటున్నారు. సంక్రాంతి పండుగ తరుణంలో పతంగులు ఎగుర వేసేందుకు చైనా మాంజాను వాడొద్దని, సాధారణ దారాన్నే వాదే విధంగా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
గాలిపటాలు ఎగురవేసేటప్పుడు విద్యుత్‌ తీగలతో జాగ్రత్తగా ఉండాలి
సంక్రాంతి పండుగా సందర్భంగా గాలిపటాలు ఎగరవేసే ప్రతి ఒక్కరు తగు జాగ్రత్తలు పాటించాలని, విద్యుత్‌ వైర్లకు దూరంగా ఉండాలని బాలానగర్‌ సీఐ కె. భాస్కర్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా చిన్న పిల్లలు విద్యుత్‌ తీగలకు వేలాడే గాలిపటాలను తీసుకోవాడానికి ఇనుప రాడ్లను, తడిగా ఉన్న కర్రలను ఉపాయోగించ కూడదన్నారు. అదేవిధంగా గాలి పటాల దారాలు విద్యుత్‌ తీగలలో పడినప్పుడు గట్టిగ లాగడం చేస్తే తీగలు ఒక దానికొకటి తగిలి తెగిపోయే ప్రమాదం ఉంటుందని చెప్పారు. కావున విద్యుత్‌ తీగలకు దూరంగా గాలిపటాలను ఎగరవేయాలని ఆయన సూచించారు. ఇంటిపై ఉండే విద్యుత్‌ తీగలతో చాలా జాగ్రత్తగా ఉండాలని చిన్న పిల్లలు గాలిపటాలు ఎగరవేసేటప్పుడు తప్పకుండా పక్కన పెద్దలు తప్పని సరిగా ఉండాలని ఆయన సూచించారు.