రాజకీయ విభేదాలను మించి అసహన దూషణలు తాండవిస్తున్న ఈ రోజుల్లో కూడా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు దేశం ఏకోన్ముఖంగా జోహారులర్పించింది. తన అధ్యయనం, అనుభవం, అంతర్గత విలువలతో అందరికీ ప్రీతిపాత్రమైన ఆయన వ్యక్తిత్వానికి ఇది నిదర్శనం. ఆయనను పితామహుడుగా చెప్పే సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ (ఎల్‌పిజీ)విధానాలతో గట్టిగా విభేదించి పోరాడే వామపక్షాలు కూడా ఆయన లౌకిక నిబద్ధతను గౌరవించాయి. దేశానికి మేలుచేసేవిగా తను నమ్మిన విధానాలనే ఆయన అనుసరిం చారని, వ్యక్తిగా ఆయన నిబద్ధత ప్రశ్నించడానికి వీలులేనిదని పేర్కొన్నాయి. ఆ కార్పొరేట్ విధానాలకు తన మత రాజకీయాలు జోడిస్తూ కాంగ్రెస్‌ను బద్ద శత్రువుగా పరిగణించే బీజేపీ నేతలూ ఆర్థికరంగంలో మన్మోహన్ ముద్రను కీర్తిస్తున్నారు. ఆర్థిక మంత్రిగా ప్రధానిగా ఆయన తీసుకున్న నిర్ణయాలు, విధానాలు మన్మోహనామిక్స్ అనే పేరు పెట్టారు గాని నిజానికి వాటిని స్పష్టమైన చారిత్రక నేపథ్యంలోనే చూడవలసివుంటుంది. 1991లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమవడం, పివి నరసింహారావు ప్రధాని పదవి చేపట్టడం కాస్త అటూ ఇటూగా జరిగాయి. భారత పాలకవర్గాలు అప్పటివరకూ కొన్ని తేడాలతో అనుసరిస్తూ వచ్చిన అలీన స్వావలంబన విధానాల నుంచి విడగొట్టుకోవడానికి సిద్ధమన్నారు. కార్పొరేట్ ప్రైవేటీకరణ విధానాల వైపు మరల ఆ ప్రక్రియను జాగ్రత్తగా అమలు చేయడానికి అటు పీవీతో పాటు ఇటు మన్మోహన్ సరైన వ్యక్తి అని ఆ వర్గాలు కూడా భావించాయనేది నిర్వివాదాంశం.
కీలక ఎంపిక
2004లో సోనియాగాంధీ ప్రధాని పదవి చేపట్టకపోవడం మంచిదని నిర్ణయించుకున్నాక ఆ స్థాయిలో విశ్వసనీయత, విషయజ్ఞత వున్న నేతగా మన్మోహన్‌నే ఎంచుకోవడానికి కూడా స్పష్టంగా ఇవే కారణమైనాయి. వ్యక్తిగతంగా ప్రణబ్ ముఖర్జీ సమర్థుడైనా ఆ విధంగా ఆయనపై ఆధారపడగల పరిస్థితి వుండదని ఆమెకు తెలుసు. ఆనాడు లోక్‌సభలో 59 మంది సభ్యులు గల వామపక్షాల మద్దతు లేకపోతే యూపీఏ-1 సర్కారు ఏర్పాటే సాధ్యం కాదు. అలాటి సర్కారుకు సారథ్యం వహించడమంటే భిన్నకోణాలను సమన్వయం చేయవలసి వుండేది. యూపీఏ-1 మొదటి దశలో 11 అంశాల కనీస కార్యక్రమం ప్రకటించడం అలా జరిగిందే. గ్రామీణ ఉపాధి హామీపథకం, అటవీ హక్కుల చట్టం, భూ సేకరణ చట్టం లాటివి ప్రజలకు ఉపశమనం కలిగించే ఉద్దేశంతో రూపొందడానికి వామపక్షాల మద్దతు కీలకపాత్ర వహించింది. వాటినే ఇప్పుడు ఆయన సానుకూల విజయాలుగా అభివర్ణించడం చూస్తున్నాం. అయితే చిల్లర వ్యాపారంలో విదేశీ కంపెనీ లకు ద్వారాలు తెరవడం నుంచి అమెరికాతో పౌర అణు ఒప్పందంపై సంతకాలు చేయడం వంటివి వామపక్షాలు ఏ మాత్రం ఆమోదించలేదు. అలాగే తనను కోరితెచ్చుకున్న బలాఢ్య వర్గాల ప్రభావం బలమైంది గనక మన్మోహన్ సింగ్ వెనక్కు తగ్గలేదు. 2007 ఆగస్టు 7న టెలిగ్రాఫ్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏది ఏమైనా అణు ఒప్పందం తప్పదని వామపక్షాలు మద్దతు ఉపసంహరించుకుంటే కాని వ్వండని తీవ్ర వ్యాఖ్యానంచేశారు. దాదాపు ఆ వెనువెం టనే ప్రకాశ్ కరత్, ఎబి బర్దన్‌ల ఉపసంహరణ ప్రకటన వెలువడింది.
1972లో ఆర్థిక సలహాదారుగా, అంతర్జాతీయ వేదికల్లో భారత ప్రతినిధిగా, ప్రపంచ బ్యాంకులో కీలక అధికారిగా, రిజర్వు బ్యాంకు గవర్నర్‌గా, ప్రణాళికా సంఘ ఉపాధ్యక్షుడుగా అనేక విధాల బాధ్యతలు నిర్వహించిన మన్మోహన్‌కు దేశ విదేశీ పాలకవర్గాల ఆర్థిక నీతి బాగా తెలుసు. రాజకీయ విధానాల మూలాలు ఆర్థిక శాస్త్రంలో నిర్ణయమవుతాయనీ తెలుసు. సోవియట్ అనంతర ప్రపంచ పరిణామాలపై పాలక వర్గాల కోణం ఏమిటో ఆయనకు పూర్తి అవగాహన వుంది. రాజీవ్‌గాంధీ దారుణ హత్య తర్వాత అనూహ్య పరిస్థితుల్లో పివి నరసింహారావు ప్రధాని అవడం, తనను ఆర్థికమంత్రిగా ఎంపిక చేయడం వెనక వున్న బలీయమైనే జాతీయ అంతర్జాతీయ కార్పొరేట్ వర్గాల పట్టు కూడా ఆయనకు పూర్తిగా తెలుసు. ఆర్థికమంత్రిగా ఇన్ని తీవ్ర నిర్ణయాలు ఎలా తీసుకున్నారంటే ఎప్పుడూ జేబులో రాజీనామా లేఖ పెట్టుకుని తిరిగేవాడినని చెప్పగలిగారంటే అందుకు కారణం ఆ వర్గాలే. అణుఒప్పందం కుదరకపోతే రాజీనామా చేస్తానని అధిష్టానానికి సంకేతాలు ఇవ్వడం ఆయన ఎంత మొండి మనిషో నిరూపించింది. వామపక్ష బృందం నేతగా అప్పట్లో కీలక బాధ్యతలు నిర్వహించిన ప్రకాశ్ కరత్ తాము అమెరికా సామ్రాజ్యవాదంతో వ్యూహాత్మక బంధం అన్న దాన్ని వ్యతిరేకించామనీ, సాంకేతికంగా అణు ఒప్పందం మాత్రమే కాదని నిన్న ఇచ్చిన వివరణ గమనించదగ్గది.
యూపీఏ-2 కష్టాలు
అణు ఒప్పందంపై తీవ్ర చర్చ తర్వాత టీడీపీ తదితర పార్టీలను చీల్చి, ఎస్‌పీని తమవైపు తిప్పుకుని యూపీఏ గట్టెక్కింది కానీ మన్మోహన్ వ్యక్తిగతంగానూ, యూపీఏ ప్రభుత్వంగానూ ఎదుర్కొన్న పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. పదవులు ప్రయోజనాల బేరాలు తప్ప మరే విధాన సమస్యలు లేని ప్రాంతీయ మిత్రులను నిలబెట్టుకోవడానికి ఇష్టం లేని వారిని మంత్రులను చేయడంతోసహా ఆయన చాలా విన్యాసాలే చేయవలసి వచ్చింది. రకరకాల ఆరోపణలు కుంభకోణాల కేసులతో పెనుగులాడవలసి వచ్చింది. ఆ క్రమంలోనే మిశ్రమ ప్రభుత్వం గనక రాజీపడాల్సి వచ్చిందని యూపీఏ-2 కాలంలో ఆయన బాహాటంగా ఒప్పేసుకున్నారు. మీడియా ఛానళ్ల అధినేతలతో సమావేశమై యూపీఏ అంటేనే అవినీతి అన్నట్టు చిత్రించవద్దని అభ్యర్థించాల్సి వచ్చింది. ఇన్ని ఆరోపణల మధ్యనా ఎవరూ ఆయన నిజాయితీని శంకించడం గానీ, తనకు వ్యక్తిగత బాధ్యత ఆపాదించడం గానీ జరక్కపోవడం నిజంగా ఆశ్చర్యమే. అదే ఆయన వ్యక్తిత్వ ముద్ర. ఇప్పుడు అదానీ వ్యవహారం మోడీతో సహా రచ్చకెక్కిన తీరుకు ఇది పూర్తి భిన్నం. అక్కడ అన్నీ కొల్లగొట్టుకుపోయినా హూజూర్ దోచుకుపోయిన వారి వివరాలు మాత్రం చెప్పడం లేదు అని పార్లమెంటులో ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్ ఒకసారి కవితతో గేళి చేశారు. నేను మీ కళ్లకు ఆనకపోవచ్చు గానీ కనీసం నా బలమైన ఆకాంక్షనైనా చూడండి అని మన్మోహన్ ఇక్బాల్ కవితతో బదులిచ్చారు! వారిద్దరి కవితా వాగ్వాదాలు రసవత్తరంగా వుండేవి. సాహిత్యంలోనూ ఆయనదిట్ట.
బీజేపీ గురివింద నీతులు
2014 ఎన్నికల తరుణంలో వెలువడిన మీడియా సలహాదారు సంజరుబారు పుస్తకంలో ప్రధానిగా మన్మోహన్ ఫైళ్లు సోనియాగాంధీకి పంపించిన తర్వాతే నిర్ణయాలు తీసుకునేవారని రాశారు. ఆ బాధ్యత ఎవరు నిర్వహించేవారో కూడా పేర్కొన్నారు. వెంటనే బీజేపీ వారు రంగంలోకి దిగిపోయారు.ఇది మోడీ బృందం ప్రచారానికి అస్త్రంగా ఉపయోగపడేందుకు వేసిన అభాండమని నాటి ప్రధాని కార్యాలయం ఖండించింది. నిజం చెప్పాలంటే కేరళలో ఎల్‌డీఎఫ్ ప్రభుత్వ విధానాలు ఏకేజీ భవనం నిర్ణయిస్తుందని కేరళలో నిరంతరం దుష్ప్రచారం జరుగుతుంటుంది. ఆయా పార్టీలు తమ ప్రభుత్వాల విధానాలపై చర్చ చేయడం ప్రజాస్వామ్యబద్దమే. రాజకీయంగా ఒక పంథా తీసుకోవడం వేరు, రాజ్యాంగ పరంగా నిర్ణయాలు ఉత్తర్వుల జారీ వేరు. నాగపూర్ ఆరెస్సెస్ రాజగురువుల ముందు మోడీతో సహా మొత్తం బీజేపీ మంత్రులు హాజరై నివేదికలిస్తారు గానీ ఇతరులపై లేనిపోని ముద్రలేస్తుంటారు. రాజ్యాంగేతర శక్తులపాత్రగా నిందిస్తారు, ఆరెస్సెస్‌కు అన్నివేళలా విధేయంగా వుంటూ ఆదేశాలు తీసుకునే బీజేపీని ఏమనాలి? మన్మోహన్‌ను కేవలం, సోనియా విధేయుడుగా మాత్రమే కొందరు మాట్లాడటం ఎంత పాక్షికమో దీన్ని బట్టే తెలుస్తుంది. ఆయన దేశ సమగ్రతకూ, మానవీయ లౌకిక విలువలకూ విధేయుడే. సోనియాగాంధీనే గాక ఒక ముఖ్యమంత్రిగా వున్న వైఎస్ రాజశేఖరరెడ్డినీ అమితంగా గౌరవించేవారట. ‘వైఎస్ అక్కడ (ఉమ్మడి ఏపీలో) వున్నారు గనకే నేను ఇక్కడ వున్నాను’ అని ప్రధాని తనతో ఎప్పుడూ చెప్పేవారని సంజరు బారు ఇటీవల కూడా వెల్లడించారు. 2005లో ప్రజాశక్తి రజతోత్సవ వేడుకలకు ముఖ్య అతిధిగా విచ్చేసిన మన్మోహన్ సీపీఐ(ఎం) నేత సీతారాం ఏచూరిని భారత రాజకీయాల్లో ప్రకాశవంతమైన తారగా అభివర్ణించారు. వామపక్షాలు అణుఒప్పందంపై మద్దతు ఉపసంహరించుకునే తరుణంలో కూడా వాటిపై తనకు కోపం లేదనీ, మిత్రులుగా కలసి పనిచేస్తామని ప్రకటించారు. తీవ్ర ఉద్రిక్తతలు వైరుధ్యాల మధ్య తెలంగాణ విభజన చట్టాన్ని ఆమోదించడం ద్వారా తెలంగాణకు, ప్రత్యేక హోదా ప్రకటించడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు ఆయన ఇష్టుడయ్యారు. ఇవన్నీ ఆయన పరిపక్వతను చెబుతాయి.
గౌరవంగా వీడ్కోలు
2002 గుజరాత్ ఘటనల తర్వాత మోడీవైపు మొగ్గిన కార్పొరేట్ శక్తులు ఆయనను ప్రధాని అభ్యర్థిగా ముందుకు తెచ్చినప్పుడు మన్మోహన్ తీవ్రంగానే ఢకొీన్నారు. కాంగ్రెస్ 1984లో సిక్కులపై హత్యాకాండతో కళంకం ఆపాదించుకున్నప్పటికీ ఆ పార్టీ తరపున దేశానికే తొలి సిక్కు ప్రధానిగా ఆయన భారత దేశ బహుళతాన్ని చాటారు. మతసామరస్యం, లౌకిక తత్వం కోసం గట్టిగా నిలబడ్డారే గాని మతపరమైన పాచికలకు పాల్పడలేదు. ఇన్ని చెప్పే మోడీ దర్యాప్తు సంస్థలు 2015లో ఆయనకు నోటీసులు పంపించాయి. అయినా తగ్గకుండా నిలబడ్డారు. నోట్లరద్దును చారిత్రక ఘోరతప్పిదం అని సంచలన విమర్శలు చేశారు. చక్రాల కుర్చీలోవచ్చి మరీ సభలో ఓటేశారు. అనారోగ్యంలోనూ మొన్నటి ఏప్రిల్ దాకా రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యుడుగా వున్నారేగానీ వూగిసలాడలేదు. అందువల్ల బీజేపీ అపహాస్యం చేసినట్టు ఆయన మౌనమునిగా లేరు. వాస్తవానికి నోట్ల రద్దు నుంచి అదానీ వ్యవహారం వరకూ చాలా విషయాల్లో మోడీయే సభలో సమాధానమివ్వకుండా మౌనం పాటించారు. మీడియా సమావేశాలను మోడీ దూరం పెట్టారేగాని మన్మోహన్ మాట్లాడుతూనే వచ్చారు. ఆయననూ గాంధీ కుటుంబాన్ని ప్రత్యర్థులుగా చూపడానికి బీజేపీ ఎంత రెచ్చగొట్టినా మరోవైపు ఆయన విదేశాల్లో వున్నప్పుడు రాహుల్‌గాంధీ కేంద్ర ఉత్తర్వును చించి వేసి ఆధిక్యత చూపించినా నాటి ప్రధాని సంయమనం వీడలేదు. సంఫ్‌ు పరివార్ హిందూత్వ రాజకీయ ప్రతినిధులైన వాజ్‌పేయి వంటి దిగ్గజానికి మోడీ వంటి నిగూఢ నేతకూ మధ్యలో ఏకైక సిక్కు ప్రధానిగా తన స్థానం నిలబెట్టుకోగలిగారు. కనుకనే మన్మోహన్ ఒకసారి కోరినట్టు దేశం, చరిత్ర ఆయన పట్ల నిర్దయగా గాక గౌరవంగానే వ్యవహరిస్తున్నాయి.
అయితే మన్మోహన్ సింగ్‌పై ఎంతో గౌరవం ఒలకబోస్తూనే ఆయన అంత్యక్రియల ప్రదేశం, స్మతి చిహ్నం నిర్మాణం మోడీ సర్కారు వివాదాస్పదం చేసింది. కాంగ్రెస్ నాయకత్వం నెహ్రూ కుటుంబ నేతల స్మారక కేంద్రమైన శక్తి స్థల్‌ను ప్రతిపాదించింది. దానికి సమ్మతి చెప్పకుండా మరోచోటును ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై కాంగ్రెస్ నేతలు విమర్శలు చేశాక ముందు అంతిమ సంస్కారాలు పూర్తయ్యాక స్మారక నిర్మాణంపై నిర్ణయం చేస్తామన్నది. పివి నరసింహారావుకు రాజధానిలో గాక హైదరాబాద్‌లో అంత్యక్రియలు చేయడంపై బీజేపీ వివాదం మళ్ళీ తీసుకొచ్చింది. ప్రణబ్ ముఖర్జీ కూతురు శర్మిష్ట తన తండ్రి మరణం తర్వాత కాంగ్రెస్ సరిగా వ్యవహ రించలేదని చేసిన ఆరోపణను కూడా ప్రయోగించింది. ఏమైనా గౌరవ నివాళి అంటూనే రాజకీయ వివాదం చేయడం మోడీ సర్కారు చిత్తశుద్ధి లేమిని అర్ధమనస్కతనూ బయట పెట్టుకుంది. పదేళ్ల పాటు పాలించిన మూడో ప్రధాని సింగ్ మాత్రమే గనక ఈ విషయంలో వివాదమే అవసరంలేదు. కానీ తొలి ప్రధాని నెహ్రూను, హత్యకు గురైన ప్రధాని ఇందిరా గాంధీనే ఆమోదించలేని బీజేపీ ఇలా చేయడం పెద్ద ఆశ్చర్యం కాదు.
– తెలకపల్లి రవి