
మండలంలో పలు గ్రామాల్లోని ప్రజలతో మంథని ఎమ్మెల్యే అభ్యర్థి బంధారపు మల్లయ్య అలియాస్ చంద్రన్న కార్నర్ సమావేశాలు శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కొయ్యుర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు తాను మంథని నియోజకవర్గంలో గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న పరిణామలపై కలత చెంది, మీ అందరి ఆశీర్వాదంతో రాజకీయాల్లోకి రావడానికి నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ఓటర్లకు మద్యం, డబ్బు, మాంసం, విందులతో గాలం వేయడానికి నాయకులు సిద్ధంగా ఉన్నారని అన్నారు. నాయకుల అభివృద్ధి మాత్రమే జరిగింది తప్ప, ప్రజలు మాత్రం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నారన్నారు. ఎన్నికలప్పుడు మాత్రమే ప్రజలు గుర్తుకు వచ్చే నాయకుడు ఒకరైతే, మంథని నియోజకవర్గాన్ని తాకట్టు పెట్టి వేల కోట్లు దోచుకున్న నాయకుడు ఇంకొకరన్నారు. చిన్న కాళేశ్వరం ప్రాజెక్ట్, వళ్ళేంకుంట ఎత్తిపోతల పథకాలను సంవత్సరాలనుండి ఆలస్యం చేస్తున్నారు తప్ప పూర్తి చేసింది లేదన్నారు. ఓసిపిలో స్థానిక యువతకు ఉపాది కల్పించాలన్నారు. డేంజర్ జోన్లో ఉన్న ఇండ్లను, భూములను తీసుకోకుండా, వాటికీ నష్ట పరిహారం, ఆర్అండ్ఆర్ ప్యాకేజీ చెల్లించకుండ, నాయకులు మాత్రం తమ జేబులు నింపుకుంటున్నారన్నారు. మంథని నియోజకవర్గాన్ని మాత్రం ఒక వైపు వరద ముంపు ప్రాంతంగా, మరోవైపు నీళ్లు లేక కరువు ప్రాంతంగా చేసారని తెలిపారు. నిత్యం వందల లారీల్లో వేల కోట్ల ఇసుకను తరలిస్తూ, రోడ్లను ద్వంసం చేస్తూ, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుకుంటున్నారన్నారు. రైతులు ఆరుగాలం కష్టపడి పంట పండిస్తే వాటిని అమ్మే దగ్గర నుండి పైసలు అకౌంట్ లో పడే వరకు నానా అవస్తలకు, ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. సంక్షేమ పథకాల పేరుతో ప్రజలను నిలువు దోపిడీ చేస్త్గున్నారని, జనం కోసం ఆనాడు జంగల్ లో పోరాడిన, నేడు జనం మధ్యలో మీ కోసం పోరాడడానికి మీ ముందుకు వస్తున్న, ఆశీర్వదించి అక్కున చేర్చుకొవాలని, యువత, నిరుద్యోగులు, రైతులు ఆలోచించి సరైన నాయకుడి కోసం ముందుకు రావాలని కోరుకుంటున్నానని తెలిపారు . ఈ కార్యక్రమంలో దళిత లిబెరేషన్ ప్రంట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మర్వాడి సుదర్శన్, ఎరుకల సంఘము రాష్ట్ర అధ్యక్షులు రెవేల్లి శంకర్,రామగుండం నియోజకవర్గం ఎన్ సీ పి ఇంచార్జి బుర్ర శివ, బొమ్మ బాపు రెడ్డి, యదండ్ల గట్టయ్య, అడుప శంకరయ్య, సయెందర్, బండం సత్తయ్య, ఐత సమ్మి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.