– ఒలింపిక్ సెలక్షన్ ట్రయల్స్
న్యూఢిల్లీ : భారత స్టార్ షూటర్, ఒలింపియన్ మను భాకర్ కీలక సమయంలో భీకర ఫామ్‌లోకి వచ్చింది. మహిళల 25 మీటర్ల స్పోర్ట్స్ పిస్టల్ విభాగం ఫైనల్లో మను భాకర్ ప్రపంచ రికార్డు బద్దలు కొట్టింది. శనివారం డా.కర్ణిసింగ్ రేంజ్‌లో జరిగిన ఫైనల్లో మను భాకర్ 47/50 స్కోరు చేసింది. ఏడుసార్లు పర్‌ఫెక్ట్ 5, మూడు 4 స్కోరు చేసిన మను భాకర్.. ప్రపంచ రికార్డు కంటే ఆరు పాయింట్లు ఎక్కువ స్కోరు చేసింది. క్వాలిఫికేషన్‌లో 582 పాయింట్లు సాధించిన మను భాకర్.. ఫైనల్లో విజేతగా నిలువటంతో అర్హత స్కోరుకు 0.60 పాయింట్లను దక్కించుకోనుంది. తెలుగు తేజం ఇషా సింగ్ అర్హత రౌండ్‌లో 585 పాయింట్లతో టాప్ లేపగా.. రిథమ్ సంగ్వాన్ 574 పాయింట్లు స్కోరు చేసింది. మను భాకర్, రిథమ్ సంగ్వాన్, ఇషా సింగ్‌లు 25 మీటర్ల స్పోర్ట్ పిస్టల్‌తో పాటు 25 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలోనూ ఒలింపిక్ బెర్త్ కోసం పోటీపడుతున్నారు. నాలుగు రౌండ్ల సెలక్షన్ ట్రయల్స్‌లో షూటర్ల టాప్-3 స్కోర్లను పరిగణనలోకి తీసుకుంటారు.