– తెలంగాణకు సరఫరా చేస్తున్న ముఠా
– డ్రగ్ కంట్రోల్ అధికారుల దాడిలో వెల్లడి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో కల్తీ పెద్ద సమస్యగా మారింది. ఆహార వస్తువులు మొదలుకుని మందుల వరకు ప్రతి దాన్నీ కల్తీ చేసేందుకు వెనుకాడటం లేదు. ఇక్కడ సరఫరా అవుతున్న కల్తీ మందుల కూపీ లాగితే ఉత్తర్ ప్రదేశ్‌లో తయారీ కేంద్రం తతంగం బయటపడింది. ఎలాంటి అనుమతులు లేకుండా మందులను తయారు చేసి సరఫరా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (టీడీసీఏ) అధికారులు అదుపులోకి తసుకున్నారు. గత నెల 27న మలక్‌పేటలోని పలు డ్రగ్స్ కంపెనీలపై అధికారులు దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే, అక్కడ లభించిన ఆధారాల మేరకు అధికారులు ఉత్తర ప్రదేశ్‌లోని కోట్ద్వారలో తనిఖీ లో చేపట్టారు. ‘ఆపరేషన్ జై’ పేరుతో టాస్క్ ఫోర్స్, మలక్ పేట పోలీసుల సహకారంతో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు రకాల నకిలీ మందులు, మిషనరీని స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణతో పాటు పలు రాష్ట్రాలకు ఇక్కడి నుంచే మందులు సరఫరా అవుతున్నాయని అధికారులు గుర్తించారు. ఈ మేరకు యూపీకి చెందిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు.