మనుస్మృతి నిండా ద్వేషమే..

మనుస్మృతి నిండా ద్వేషమే..– రాజ్యాంగ రక్షణకోసం ఉద్యమాలు
–  మనుస్మృతి ప్రతుల దహన కార్యక్రమంలో స్కైలాబ్‌బాబు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
మనుస్మృతి నిండా ద్వేషభావమే నిండి ఉందని కేవీపీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్‌బాబు తెలిపారు. మనుషుల మధ్య ద్వేషాన్ని నింపి, వైషమ్యాలు సృష్టంచటమే దాని పనని ఆయన విమర్శించారు. సోమవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం(కేవీపీఎస్‌) ఆధ్వర్యంలో మనుస్మృతి ప్రతులను దహనం చేశారు. ఈ సందర్భంగా స్క్లైలాబ్‌ మాట్లాడుతూ ఆర్‌ఎస్‌ఎస్‌ రిమోట్‌ కంట్రోల్‌ తో పనిచేస్తున్న కేంద్ర బీజేపీ సర్కార్‌ రాజ్యాంగం రద్దుకు కుట్రలు చేస్తున్నదని విమర్శించారు. సామాజిక అసమానతలకు, వివక్షతలకు మను ‘అధర్మ’ శాస్త్రమే మూలమని తెలిపారు. దీన్ని నిషేధించాల్సిన అవసరముందన్నారు. నూటికి 90శాతం మందికి అది చదువును, సంపదలను దూరం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. మనువాదానికి పాతరేస్తేనే సమాజ అభివృద్ధి సాద్యమవుతుం దని తెలిపారు. బ్రాహ్మణాధిపత్యాన్ని కాపాడటానికి, దోపిడివ్యవస్థ రక్షణ కోసం పుట్టిందే మనువాదమని చెప్పారు. కార్యక్రమంలో డీవైఎఫ్‌ ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్‌ , కెేవీపీఎస్‌ నాయకులు ఎన్‌ బాలపీరు తదితరులు పాల్గొన్నారు
రాష్ట్ర వ్యాప్తంగా
రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం మనుధర్మ శాస్త్ర పత్రులను దహనం చేశారు. ఓయూ ఏఎస్‌ఏ ఆధ్వర్యంలో, అలాగే బీఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కన్వీనర్‌ బోరెల్లి సురేష్‌ ఆధ్వర్యంలో ఓయూ ఆర్ట్స్‌ కళాశాల ఎదుట వేర్వేరుగా మనుస్మృతి ప్రతులను కాల్చేశారు. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా ఈసీఐఎల్‌ చౌరస్తాలోని అంబేద్కర్‌ విగ్రహం సమీపంలో మనుస్మృతి ప్రతులను తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం, స్ఫూర్తి గ్రూప్‌ ఆధ్వర్యంలో దహనం చేశారు.కరీంనగర్‌లోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద మనుస్మృతి ప్రతులను కేవీపీఎస్‌, బహుజన సంక్షేమ సంఘం, ఎస్‌ఎఫ్‌ఐ, దళిత లిబరేషన్‌ ఫ్రంట్‌ ఆధ్వర్యంలో దహనం చేశారు. వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌ పట్టణంలోని అంబేద్కర్‌ చౌరస్తాలో అంబేద్కర్‌ యువజన సంఘాల ఆధ్వర్యంలో మనుస్మృతి పత్రాలను దహనం చేశారు.ఖమ్మం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్‌ విగ్రహం ఎదుట మాలమహానాడు ఆధ్వర్యంలో మనుస్మృతి పత్రాలను దహనం చేశారు. కేవీపీఎస్‌ ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలోని చర్మకారుల అడ్డా వద్ద, పాల్వంచ అంబేద్కర్‌ సెంటర్లో బహుజన ఐక్య వేదిక ఆధ్వర్యంలో మనుధర్మ శాస్త్ర ప్రతులను కాల్చేశారు