మనువాదాన్ని ఇంకెన్నాళ్లు రుద్దుతారు

Manuvada will be rubbed for years– రాజ్యాంగ హక్కుల అమలుకు ఐక్యఉద్యమం : దళిత్‌ సోషన్‌ ముక్తిమంచ్‌ జాతీయ ఉపాధ్యక్షులు స్కైలాబ్‌ బాబు
ఎమ్మిగనూరు : మనువాదాన్ని మా నెత్తిన ఇంకెంత కాలం రుద్దుతారని, నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ కలిగిన భారతదేశంలో సాంఘిక అసమానతలు, అంటరా నితనం రాజ్యమేలుతుంటే హిందువులంతా బంధువులమంటూ ఎవరిని మోసం చేయడానికి మాట్లాడుతున్నారని కేంద్ర ప్రభుత్వాన్ని దళిత్‌ సోషన్‌ ముక్తిమంచ్‌ జాతీయ ఉపాధ్యక్షులు టి.స్కైలాబ్‌ బాబు ప్రశ్నించారు. ‘రాజ్యాంగం-మనువాదం’ అనే అంశంపై కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు తేరుబజార్‌ వద్ద పద్మశాలి కమ్యూనిటీ హాల్లో కెవిపిఎస్‌ ఆధ్వర్యంలో ఆదివారం సదస్సు నిర్వహించారు. కెవిపిఎస్‌ జిల్లా అధ్యక్షులు ఎస్‌.దేవసహాయం అధ్యక్షతన జరిగిన సదస్సునుద్దేశించి టి.స్కైలాబ్‌బాబు మాట్లాడుతూ.. సమాజంలో ఉన్న అందరికీ రాజ్యాంగం సమాన హక్కులు కల్పిస్తే, మనువాదం కులాధారంగా హక్కులు, గౌరవాన్ని కల్పిస్తోందన్నారు. మాయ మాటలు చెబుతూ మనువాదాన్ని మా నెత్తిన్న ఇంకెన్నాళ్లు రుద్దుతారని, డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ అందించిన చైతన్యమే పరమావధిగా గ్రామ గ్రామాన చర్చ పెట్టాలన్నారు. మనువాదమే గనక రాజ్యాధికార స్వరమైతే.. అందులో మొదట నలిగేది బహుజనులేనని గుర్తించాలన్నారు. బహుజన కులాలు దళితులకు శత్రువులు కాదని, దాడులు చేసే వ్యక్తులు మాత్రమే శత్రువులని తెలిపారు. కులంతో సంబంధం లేకుండా అల్పసంఖ్యాక వర్గాల హక్కుల కోసం పోరాడిన మహత్మ జ్యోతిబాఫూలే, పుచ్చలపల్లి సుందరయ్య, పెరియార్‌ రామస్వామి లాంటి వారెందరో మనకు ఆదర్శంగా నిలుస్తారని తెలిపారు. అందులో భాగంగానే కలిసొచ్చే సంఘాలన్నింటినీ కలుపుకొని డిసెంబర్‌ నాలుగన పార్లమెంటు ముందు మహాధర్నా నిర్వహిస్తున్నామని, జయప్రదం చేయాలని కోరారు. సదస్సులో కెవిపిఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి.ఆనంద్‌బాబు తదితరులు మాట్లాడారు.