నీరటి రవి ఆత్మహత్య కేసులో పలువురి అరెస్టు

Neerati Ravi in ​​suicide case Many arrested– ఒత్తిడి, బెదిరింపులతోనే ఆత్మహత్య
– డబ్బులు ఎగ్గొట్టిన జీఎస్‌ఎన్‌ ఫౌండేషన్‌
– బెదిరింపులకు పాల్పడిన విలేకరులు
– చేసేదేమీ లేక పిల్లలను చంపి, ఆత్మహత్య చేసుకున్న రవి
– మీడియాకు వివరాలు వెల్లడించిన.. రాజేంద్రనగర్‌ డీసీపీ చింతమనేని శ్రీనివాస్‌
నవతెలంగాణ-గండిపేట్‌
రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం టంగుటూరులో చిట్టీల పేరుతో మోసపోయి పిల్లలను చంపి, తండ్రి ఆత్మహత్య చేసుకున్న ఘటనలో అసలు కారకులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులకు సంబంధించిన వివరాలను నార్సింగి ఏసీపీ కార్యాలయంలో రాజేంద్రనగర్‌ డీసీపీ చింతమనేని శ్రీనివాస్‌ మీడియాకు వెల్లడించారు. శంకర్‌పల్లి మండలం టంగుటూరు గ్రామానికి చెందిన నీరటి రవి 2022లో టంగుటూరుకి చెందిన తిరుపతిరావు అనే వ్యక్తి ద్వారా విజయనగరంకు చెందిన జీఎస్‌ఎల్‌ ఫౌండేషన్‌ మనీ సర్క్యులేషన్‌కి చెందిన దాంట్లో సభ్యునిగా చేరారు. జీఎస్‌ఎన్‌ ఫౌండేషన్‌లో ముందుగా రూ.2వేలు కడితే 45 రోజుల తర్వాత కట్టిన డబ్బులు మొత్తం తిరిగి ఇచ్చి ప్రతి నెలా రూ.1000 చొప్పున ఆరు నెలలు ఇచ్చేవారు. రవి తన ఊర్లో ఉన్న వారితో జీఎస్‌ఎన్‌ ఫౌండేషన్‌లో పెద్ద ఎత్తున డబ్బులు కట్టించారు. రవి సేకరించిన డబ్బు తిరుపతి రావుకు పంపగా తిరుపతిరావు ప్రతినెలా రవికి, సభ్యులకు తిరిగి డబ్బులు చెల్లించేవాడు. అయితే మూడు నెలల నుంచి ఫౌండేషన్‌ తరపున తిరుపతిరావు డబ్బులు చెల్లించకపోవడంతో రవిని గ్రామస్తులు, చుట్టుపక్కల గ్రామాల సభ్యులు డబ్బుల గురించి అడిగారు. ఈ విషయం బయట తెలియడంతో శంకర్‌పల్లి మండలానికి చెందిన ప్రధాన పత్రికలు, చిన్న పత్రికల విలేకరుల సైతం వార్తలు రాస్తామని రవిని బెదిరించారు. తమకు రూ.20లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రవి తన భార్య పుస్తల తాడు తాకట్టు పెట్టి రూ.2.50 లక్షలు తెచ్చి విలేకరులకు ఇచ్చాడు. శంకర్‌పల్లి గ్రామానికి చెందిన హౌంగార్డు నాగరాజు భార్య మణి కూడా రవి ద్వారా డబ్బులు పెట్టింది. వారు కూడా డబ్బుల కోసం రవిని ఒత్తిడి చేశారు. దాంతో వారికి కొంత డబ్బు చెల్లించాడు. మిగతా డబ్బుల గురించి రవిని ఒత్తిడి చేశారు. వారి బాధలు తట్టుకోలేక రవి తన ముగ్గురు పిల్లలను చంపి, అతనూ ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు కేసుతో సంబంధం ఉన్న విలేకరులు శ్రీనివాస్‌రెడ్డి, ప్రవీణ్‌కుమార్‌, హౌం గార్డు అల్లూరి రాజు అలియాస్‌ నాగరాజును అరెస్టు చేశారు. జీఎస్‌ఎన్‌ ఫౌండేషన్‌ తిరుపతిరావు, శ్రీనివాస్‌, శ్రీనివాస్‌, వడ్డే మహేష్‌, మనీలా రామకృష్ణ పరారీలో ఉన్నారు.