– పశ్చిమ దేశాలు మౌనం
టెహ్రాన్ : ఇరాన్‌పై ఇజ్రాయిల్ దురాక్రమణపూరిత దాడిని పలు దేశాలు ఖండించాయి.పశ్చిమ దేశాలు మాత్రం మౌనం వహించాయి. ఫ్రాన్స్ వంటి దేశం స్పందించినా ఇజ్రాయిల్ దాడిని నేరుగా ఖండించలేదు.శనివారం వేకువ జామున ఇరాన్ రాజధాని టెహ్రాన్ నైరుతి ప్రాంతంపై ఇజ్రాయిల్ జరిపిన వైమానిక దాడిని సౌదీ అరేబియా, యుఎఇ, కువైట్, ఖతార్, ఈజిప్టు, యెమెన్,మలేసియా, సిరియా, జోర్డాన్, లెబనాన్ తదితర దేశాలు తీవ్రంగా ఖండించాయి. సౌదీ అరేబియా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన చేస్తూ, ఇజ్రాయిల్ దాడి ఇరాన్ సార్వభౌమత్వాన్ని,అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేనని పేర్కొంది. ఇజ్రాయిల్ చర్యను ఇరాన్ సార్వభౌమత్వంపై దాడిగానే పరిగణించాలని ఖతార్ వ్యాఖ్యానించింది. ఇజ్రాయిల్ అంతర్జాతీయ చట్టాలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తోందని ఖతార్ విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ ప్రాంత భద్రత, సుస్థిరతను సవాల్ చేసే ఏ చర్యను అంగీకరించబోమని ఈజిప్టు స్పష్టం చేసింది.
ఇరాన్‌పై దాడి చేయడం ద్వారా ఇజ్రాయిల్ ఈ ప్రాంతాన్ని పూర్తి స్థాయి యుద్ధంలోకి లాగుతున్నదని టర్కీ పేర్కొంది. ఇరు పక్షాలు సంయమనం పాటించాలని రష్యా కోరింది.జర్మనీ చాన్సలర్ ఒలాఫ్ షుల్జ్ పరిస్థితిని మరింత క్లిష్టతరం చేయకుండా చూడాలని ఇరాన్‌ను కోరారు. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ కూడా ఇదే విధంగా స్పందించారు. వివాదాన్ని నివారించడానికి ఇరు పక్షాలు ప్రయత్నించాలని ఫ్రాన్స్ హితవు పలికింది.
ఇజ్రాయిల్‌కు బుద్ధి చెబుతాం: ఇరాన్
ప్రతీకార దాడి చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఇజ్రాయిల్‌ను ఇదివరకే హెచ్చరించిన ఇరాన్ శనివారం నాటి దాడికి తగు రీతిలో సమాధానమిచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని పేర్కొంది. టెహ్రాన్ నైరుతి, పశ్చిమ ప్రాంతాల్లోని వైమానిక, సైనిక స్థావరాలపై ఇజ్రాయిల్ చేసిన దురాక్రమణ పూరిత దాడిని తమ దళాలు చాలా వరకు నిర్వీర్యం చేశాయని , దాడి ప్రభావం చాలా పరిమితమని ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ ఆరాగ్జి తెలిపారు. తమ ప్రాదేశిక సమగ్రతను కాపాడుకు నేందుకు ఇరాన్ తీసుకునే చర్యలకు హద్దంటూ ఏమీ ఉండదని ఆయన అన్నారు. ఈ దాడి తరువాత కూడా తమ చమురు, విద్యుత్ గ్రిడ్‌లు మామూలుగానే పనిచేసుకుంటున్నాయని ఆయన తెలిపారు. పశ్చిమ దేశాలు, వాటి ఆధ్వర్యంలోని మీడియా ఇరాన్ కోలుకోలేని విధంగా దెబ్బతినిపోయిదని అసత్య ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. ఇజ్రాయిల్‌లో నెతన్యాహు ప్రభుత్వం అంతర్గతం, బాహ్యంగా ఎదుర్కొంటు న్న సమస్యల నుంచి దృష్టి మళ్లించేందును నిర్వహించిన పబ్లిక్ స్టంట్‌గా ఆయన పేర్కొన్నారు.
యుద్ధ విస్తరణను నిలిపివేయాలి : ఐరాస
పశ్చిమ దేశాలలో పెరుగుతున్న ఉద్రిక్తతలపై ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ఆందోళన వ్యక్తం చేశారు. యుద్ధ విస్తరణ కార్యకలాపాలను వెంటనే నిలిపివేయాలని ఆయన కోరారు. పశ్చిమాసియా అంతటికీ యుద్ధం విస్తరించకుండా నిరోధించాలని ఆయన అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చారు.