– జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ ఎదుట
– సీనియర్ జర్నలిస్ట్ వేణుగోపాలరావు వాదనలు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఛత్తీస్‌గఢ్ ఒప్పందం, యాదాద్రి, భద్రాద్రి థర్మల్ కేంద్రాల నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్ ఎల్ నర్సింహారెడ్డి కమిషన్ ఎదుట సీనియర్ జర్నలిస్ట్, సెంటర్ ఫర్ పవర్ స్టడీస్ కన్వీనర్ ఎమ్ వేణుగోపాలరావు తమ వాదనలు వినిపించారు. ఛత్తీస్‌గఢ్ ఒప్పందం ఏకపక్ష నిర్ణయమనీ, రాష్ట్రంలోని స్టేక్‌హెల్డర్లను ఎవర్నీ సంప్రదించకుండా ప్రభుత్వం తీసుకున్నదని కమిషన్ ఎదుట వివరించారు. వెయ్యి మెగావాట్ల కోసం ఒప్పందం ప్రకారం ఏనాడు ఛత్తీస్‌గఢ్ నుంచి కరెంటు సరఫరా కాలేదనీ, అది చాలదన్నట్టు మరో వెయ్యి మెగావాట్ల కోసం మళ్లీ ఒప్పందం చేసుకుని ప్రజాసొమ్మును దుర్వినియోగం చేశారని తెలిపారు. పీజీసీఎల్‌కు దాదాపు రూ. 670 కోట్లు నష్టపరిహారంగా చెల్లించాల్సి వచ్చిందని వివరించారు. ఛత్తీసగఢ్ నుంచి ఒప్పందం ప్రకారం కరెంటు రాకపోయినా, వెయ్యి మెగావాట్లకు సొమ్మును మాత్రం చెల్లించారనీ, అదే సమయంలో బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు కరెంటు కొనుగోళ్లు చేశారని చెప్పారు. భద్రాద్రి, యాదాద్రి థర్మల్ కేంద్రాల నిర్మాణం కూడా పూర్తి లోపభూయిష్టమని అన్నారు. ముంపు ప్రాంతాల్లో ఈ ప్రాజెక్టులు నిర్మించారన్నారు. భద్రాద్రి థర్మల్ కేంద్రం నిర్మాణంలో భారీ అవకతవకలు జరిగాయని ఉదహరించారు. ఇండియాబుల్స్ సంస్థ కోసం తయారుచేసిన బీహెచ్‌ఈఎల్ తయారు చేసిన ఔట్‌డేటెడ్ సబ్‌క్రిటికల్ టెక్నాలజీని ఇక్కడ వినియోగించారని చెప్పారు.ఈ టెక్నాలజీని అప్పటికే కేంద్ర ప్రభుత్వం నిషేధించిందనీ, అయినా పట్టించుకోకుండా నిర్మాణం చేశారన్నారు. వివిధ కారణాలతో ప్రాజెక్టుల నిర్మాణాలు ఆలస్యం అవడం వల్ల నిర్మాణ వ్యయం భారీగా పెరిగిపోయాయనీ, అవన్నీ అంతిమంగా విద్యుత్ వినియోగదారులపైనే పడతాయని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన పలు అంశాలను గణాంకాలు, గత ఈఆర్సీ ఉత్తర్వులు, ఉదాహరణలతో కమిషన్ ఎదుట వివరించారు.