– చంద్రయాన్ విజయంలో శాస్త్రవేత్తల కృషి గొప్పది
– ప్రభుత్వం మరిన్ని నిధులివ్వాలి
– అంతరిక్ష జ్ఞానంపై విద్యార్థులను తల్లిదండ్రులు ప్రోత్సహించాలి : ఎస్వీకే వెబినార్‌లో రఘునందన్ కుమార్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
అంతరిక్షంలో ప్రయోగిస్తున్న ఉపగ్రహాలతో ఎన్నో ఉపయోగాలున్నాయని ప్లానిటరీ సొసైటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ ఎన్.రఘునందన్ కుమార్ తెలిపారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం మేనేజింగ్ కమిటీ కార్యదర్శి ఎస్.వినయకుమార్ సమన్వయంతో చంద్రయాన్ విజయం-శాస్త్రవేత్తల కృషి అనే అంశంపై నిర్వహించిన ఫేస్ బుక్ వెబినార్‌లో ఆయన మాట్లాడారు. తుఫాన్ తదితర ప్రకృతి వైపరీత్యాల రాకను ముందే పసిగట్టి ప్రాణ నష్టాన్ని నివారించడంతో పాటు కమ్యూనికేషన్, వైద్యం, దేశ భద్రత తదితర వాటికి ఆ సాంకేతిక విరివిగా వినియోగిస్తున్నారని తెలిపారు. ఉదాహరణకు 1999లో వచ్చిన తుఫాన్‌లో 10 వేల మంది చనిపోతే, ఇటీవల అలాంటి తుఫాన్ వస్తే ముందే హెచ్చరికలతో ప్రాణ నష్టం జరగకుండా నివారించగలిగారన్నారు. కారడవుల నుంచి కూడా ప్రత్యక్ష ప్రసారం ఇవ్వగలిగిన స్థితికి చేరుకున్నామన్నారు. దీనికంతటికీ శాస్త్రవేత్తలు చేసిన కృషి గొప్పదనీ, ప్రభుత్వాలు మరిన్ని నిధులను ఇచ్చి వారిని ప్రోత్సహించాలని కోరారు. విద్యార్థులు అంతరిక్ష జ్ఞానం పొందేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని సూచించారు. రష్యా, అమెరికా పోటాపోటీగా అంతిరక్ష ప్రయోగాలు చేయడం, ఒక దశలో అంతరిక్షాన్ని సైనికీకరణ చేయాలని చేసిన ప్రయత్నాలను ఐక్యరాజ్య సమితి అడ్డుకుందని గుర్తుచేశారు. ఖగోళ వస్తువులను అందరి సొత్తుగా ప్రకటించిందని చెప్పారు భూమి చుట్టు బాహ్య వలయంలో, అంతరిక్షంలో చేసే ప్రతి ప్రయోగం శాంతిపూర్వక కార్యక్రమంగా ఉండాలని నిర్దేశించిందని తెలిపారు. ప్రపంచం 1957 నుంచి స్పేస్ యుగంగా భావిస్తుండగా, అదే సమంయలో కొంత మంది శాస్త్రవేత్తలు మన దేశాభివృద్ధికి ఖగోళ ప్రయోగాలు అవసరమని గుర్తించారని తెలిపారు. చంద్రయాన్ 1, చంద్రయాన్ 2ల నేపథ్యం, అనుభవాలను వివరిస్తూ చంద్రయాన్ 3 విజయవంతానికి వాటిని శాస్త్రవేత్తలు ఉపయోగించుకున్నారని తెలిపారు. చంద్రయాన్ 2 పూర్తిగా వైఫల్యం చెందిందని చెప్పలేమన్నారు. అది పంపించిన డాటా విశ్లేషణకు ఏండ్ల తరబడి సమయం పడుతుందన్నారు. చంద్రయాన్ 3 విషయంలో సాఫ్ట్ ల్యాండింగ్‌తో పాటు భారత శాస్త్రవేత్తలు మరో ప్రయోగాన్ని చేశారనీ, దానితో చంద్రమండలంపైకి వ్యోమగామిని పంపించేందుకు అవకాశాలపై ఆశలు చిగురించాయని తెలిపారు.
భవిష్యత్ సైంటిస్టులకు ప్రోత్సాహం
భవిష్యత్ సైంటిస్టులను ప్రోత్సహించేందుకు ఇస్రో ఎనిమిది, తొమ్మిదో తరగతి చదివే విద్యార్థులను ప్రోత్సహిస్తున్నదని రఘునందన్ తెలిపారు. ప్రతి ఏడాది మార్చిలో నోటిఫికేషన్ ఇచ్చి 330 మంది విద్యార్థులను క్విజ్ ద్వారా ఎంపిక చేస్తుందన్నారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు విద్యార్థులను ప్రోత్సహించాలని ఆయన సూచించారు. అంతిరక్ష జ్ఞానంపై అవగాహన కల్పించే కృషిని ప్లానిటరీ సొసైటీ ఆఫ్ ఇండియా గత 20 ఏండ్లుగా కొనసాగిస్తున్నదనీ, రాబోయే కాలంలోనూ ఇదే విధంగా కృషి చేస్తామని తెలిపారు. 2040 కల్లా వ్యోమగామిని చంద్రునిపైకి పంపించాలని ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటించిన నేపథ్యంలో మరో 17 ఏండ్లపాటు తమ ముందు మరింత బాధ్యత మిగిలి ఉందని తెలిపారు.
జ్యోతిష్యుల వక్రభాష్యాలు
నిర్దిష్ట కాలవ్యవధిలో భూమికి, ఇతర గ్రహాలు దగ్గరగా వస్తుంటాయనీ, అలాంటి సందర్భాలను ఉపయోగించుకుని కొంత మంది జ్యోతిష్యులు వక్రభాష్యాలు చెబుతుంటారని ఖండించారు. ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఇది సహజమైందని తెలిపారు.