మన్యం వీరులు

Manyam heroes– కడవరకు నమ్మిన సిద్ధాంతానికే కట్టుబాటు
– మచ్చలేని నిస్వార్థ ప్రజా సేవకులు కుంజా బొజ్జి, సున్నం రాజయ్య

ఒక్కసారి ఎమ్మెల్యేగా అవకాశం వస్తేనే వందల కోట్లు సంపాదించి ప్రజా క్షేమం కంటే వ్యక్తిగత స్వార్థానికే మొదటి ప్రాధాన్యత ఇచ్చే రాజకీయ నాయకులు ఉన్న ఈ రోజుల్లో.. కడవరకు ప్రజల పక్షాన నిలబడి ప్రజా పోరాటాలే ఆయుధంగా మలిచి ప్రజాసేవకే తమ జీవితాలను అంకితం చేసిన నాయకులు చాలా అరుదు. అలాంటి వారిలో కుంజా బొజ్జి, సున్నం రాజయ్య మొదటి వరుసలో ఉంటారు. వారు జీవితాంతం జనం కోసమే పాటుపడ్డారు. ఎర్రజెండానే ప్రజలకు ఒక ఆయుధం అని చూపారు.

ఆణిముత్యాలు
నవతెలంగాణ- భద్రాచల రూరల్‌
కుంజా బొజ్జి పోరాట వారసుడిగా ఉద్యమంలోకొచ్చిన సున్నం రాజయ్య సైతం మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఏ అవినీతి మచ్చ లేకుండా చివరి వరకు తన జీవితం ప్రజాసేవకే అంకితం చేశారు. అధికారం ఉన్నా.. లేకున్నా.. నిత్యం ప్రజల్లోనే ఉన్నారు. నిరాడంబరతకు నిలువుటద్దం ఆయన. ప్రతిపక్ష నేతలు సైతం ఆయన వ్యక్తిత్వాన్ని మెచ్చుకోవడం తప్ప వేలెత్తి చూపే పరిస్థితి లేకుండా నాయకునిగా జీవించారు. పాలకపక్ష నేతలకు ఆదర్శంగా నిలిచిన ప్రజా నాయకుడు. 1999, 2004, 2014 ఎన్నికల్లో మూడుసార్లు ఆయన భద్రాచలం ఎమ్మెల్యేగా పనిచేశారు. 2009లో స్వల్ప తేడాతో ఓడిపోయారు. 2014లో తెలంగాణ తొలి అసెంబ్లీకి భద్రాచలం నుంచి శాసనసభ్యులుగా ప్రాతినిధ్యం వహించిన సమయంలో.. ఎమ్మెల్యేల వేతనాలు పెంచాలని చర్చిస్తూ అసెంబ్లీలో పెట్టిన తీర్మానాన్ని నిరసించారు. కార్మికుల వేతనాలు పెంచిన తర్వాతే ఎమ్మెల్యేల వేతనాల గురించి ఆలోచించాలని అసెంబ్లీ సమావేశాలను బైకాట్‌ చేశారు. తన వ్యక్తిగత గౌరవ వేతనం కంటే కార్మికుల జీవన ఉపాధి ముఖ్యమని చాటి చెప్పారు. జిల్లాల ఏర్పాటులోనూ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వివక్షను వ్యతిరేకిస్తూ ఆయన నిరాహార దీక్ష చేశారు. భద్రాచలం అభివృద్ధి కోసం సీఎం ప్రకటించిన రూ.100 కోట్లు విడుదల చేయాలని పదేపదే అసెంబ్లీలో గళమెత్తారు. రామాలయంతోపాటు భద్రాచలం నియోజకవర్గ అభివృద్ధికి రూ.500 కోట్లు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. ఎమ్మెల్యేల పనితీరుపై కేసీఆర్‌ చేయించిన సర్వేలో ఎక్కువ మార్కులు సాధించింది సున్నం రాజయ్యే. స్వయంగా కేసీఆర్‌ ఈ విషయం సభలో చెప్పారు. ఏనాడూ ఆయన ప్రలోభాలకు లోనుకాలేదు. ఏజెన్సీ వాసులు ఆయన్ని ‘మా గిరిజన ముద్దుబిడ్డ’ అని గర్వంగా చెప్పుకుంటారు. తన సొంత ఊరు విఆర్‌ పురం మండలం సున్నవారిగూడెంలో ప్రభుత్వ ఆశ్రమ పాఠశాల, ఊరి చెరువుతోపాటు నివాస గృహాలు నిర్మించేందుకు తన 10 ఎకరాల భూమిని ప్రభుత్వానికి ఉచితంగా ఇచ్చేశారు. అధికారం, పదవి ఉంటే వందల ఎకరాలు కబ్జా చేయొచ్చు అన్న రాజకీయ నాయకుల ఆలోచనలకు భిన్నంగా సున్నం రాజయ్య తన సొంత భూమిని ప్రజల కోసం దానంగా ఇచ్చి వారి గుండెలో చిరస్థాయిగా నిలిచారు. రాష్ట్ర విభజన సమయంలో భద్రాచలం నియోజవర్గానికి జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ నిరవధిక నిరాహార దీక్ష చేశారు. ప్రాణాన్ని సైతం లెక్క చేయలేదు. భద్రాచలం నియోజకవర్గంలో విద్య, వైద్యంతో పాటు తాగు, సాగు నీరును అందించడం కోసం కుంజా బొజ్జి, సున్నం రాజయ్య చేసిన పోరాటం ఈ ప్రాంత ప్రజల మదిలో ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ఆడంబరాలకు పోకుండా సాధారణ జీవితాన్ని గడుపుతూ అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎమ్మెల్యే అంటే ఒక ప్రజా సేవకుడుగానే గుర్తింపు పొందిన సున్నం రాజయ్య కరోనాకాలంలో సైతం ప్రజల మధ్యనే ఉన్నారు. తన ప్రాణాల కన్నా ప్రజా శ్రేయస్సు ముఖ్యమని భావించి కరోనా కాటుకు బలయ్యారు. ఓట్లు వేసి గెలిపించిన ప్రజల అభివృద్ధే తమ అభివృద్ధని పరితపించి.. భద్రాచలం నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి చివరి వరకు పోరాడారు. సుదీర్ఘకాలం ఎమ్మెల్యేలుగా ఉన్నా కడదాకా సాధారణ జీవితాన్ని గడిపిన సున్నం రాజయ్య, కుంజా బొజ్జి వంటి నిస్వార్థ రాజకీయ నాయకులు ఇప్పుడు ఎంతైనా అవసరం ఉంది. ప్రజల కోసం నిత్యం పని చేస్తున్న నాయకులనే ఓటర్లు అసెంబ్లీకి పంపించాలి.
వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యే…
1985 నుంచి 1994 వరకు వరుసగా మూడుసార్లు భద్రాచలం నియోజకవర్గం ఎమ్మెల్యేగా కుంజా బొజ్జి ఉన్నారు. శ్వాస విడిచే వరకు నమ్ముకున్న సిద్ధాంతానికే కట్టుబడి ఆదర్శవంతమైన రాజకీయ నేతగా నిలిచారు. 1982 ఆగస్టు 26న చింతూరు మండలం కొల్లూరు గ్రామంలో కాంగ్రెస్‌ నాయకుల కుట్రతో జరిగిన ఘర్షణతో మొదటిసారిగా నెల రోజులపాటు జైలుకెళ్లారు. గిరిజనులకు భూమి కోసం, భుక్తి కోసం చేసిన పోరాటాల్లో ఆయనపై దాదాపు 73 కేసులు నమోదుకాగా చాలాసార్లు జైలుకెళ్లారు. 1984 డిసెంబర్‌ 12న పుచ్చలపల్లి సుందరయ్య స్వయంగా బొజ్జిని భద్రాచలం ఎమ్మెల్యే స్థానానికి నిలబెట్టాలని ప్రతిపాదన చేశారు. మొదటిసారి 1985లో ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన తదుపరి వరుసగా.. 1989, 1995లో కూడా గెలిచారు. కుంజా బొజ్జి నిజాయితీకి మారుపేరుగా నియోజకవర్గ ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని శాసన సభ్యులందరికీ హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో ఇండ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ సమయంలో భద్రాచలం నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్న కుంజా బొజ్జి ప్రజల ఓట్లతో గెలిచిన తాను ఆ ప్రజల్లోనే ఉండాలి తప్ప హైదరాబాదులో ఇల్లు నాకెందుకు అని సున్నితంగా తిరస్కరించారు. ఆ రోజుల్లోనే లక్షలు విలువ చేసే ఇంటి స్థలాన్ని తిరస్కరించి చివరి రోజుల్లో సొంత ఇల్లు కూడా లేకుండా కూతురి ఇంటి వద్దే చనిపోయిన నిస్వార్ధ ప్రజా సేవకుడు కుంజా బొజ్జి.