మరకుంభి పోరాటం- నేటి తరానికి స్ఫూర్తిదాయకం

Marakumbhi Struggle – An inspiration for today's generationకొన్ని ఘటనలు గుండెల్ని పిండేస్తాయి.. మరికొన్ని సన్నివేశాలు కండ్లముందే నిలుస్తాయి ఇంకొన్ని దృశ్యాలు అసలు నిద్రే లేకుండాచేస్తాయి.. వాటి గురించి చెప్పడానికి భావాలే తప్ప, భాష సరిపోదు. కన్నీళ్లే తప్ప వర్ణనా ఉండదు. అలాగని చెప్పకుండా ఉండలేం.. మాట్లాడకుండా తప్పించు కోలేం. పదేండ్ల కిందట జరిగిన ఘటన ఇది. అయితే దీన్ని చెప్పేకంటే ముందు మనం స్వతంత్ర భారతావనిలోనే ఉన్నామా? లేదంటే బానిస యుగంలో బతుకుతున్నామా? అనే సందేహం రాక మానదు. అంతులేని అంటరానితనం, ఏకధాటిగా కొనసాగిన కులవివక్ష, రెండుగ్లాసుల పద్ధతి, ఇది పెత్తందారుల దాష్టీకానికి నిదర్శనం. దీన్ని ప్రశ్నించినందుకు జరిగిన ఘోరం, దళితకాలనీ శ్మశానంగా మారడం. దీనిపై న్యాయపోరాటానికి నడుం బిగించిన సీపీఐ(ఎం), ఇన్నాళ్లకు దోషులకు శిక్షపడేలా చేసింది. ఈ ఘటన జరిగింది గ్రామమే కావచ్చు, కానీ అక్కడ జరిగిన స్ఫూర్తివంతమైన పోరాటం నేటితరానికి ఆదర్శం.
అది 2014వ సంవత్సరం. కర్నాటక రాష్ట్రం, కొప్పాల జిల్లా, గంగావతి తాలూకా మరకుంభి గ్రామంలో జరిగిన ఓ దారుణం. ఆధిపత్య కులాలకు చెందిన వందలాది మంది ఆ గ్రామంలోని దళిత కాలనీపై దాడి చేశారు. సినిమా థియేటర్లో జరిగిన ఓ ఘటనను ఆసరాగా చేసుకుని గ్రామ పెత్తందారులు, ఆధిపత్య భూస్వాములు రాళ్లు, కర్రలు , మారణాయుధాలతో దళిత కాలనీపై విరుచుకుపడ్డారు. దొరికిన వారిని దొరికినట్లు దారుణంగా కొట్టి తీవ్రంగా హింసించారు. మహిళలు, పిల్లలు అని తేడా చూడకుండా చితకబాదారు. ‘మాకు ఎదురు తిరిగితే మంటల్లో మాడి మసి కావాల్సిందే’ అంటూ దళితుల ఇండ్లకి నిప్పు పెట్టారు. వారికున్న కొద్దిపాటి ఆస్తులనూ ధ్వంసం చేశారు. కాలనీని మొత్తంగా శ్మశానంగా మార్చారు. ‘ఇప్పుడు ఇండ్లు మాత్రమే దహనమయ్యాయి, భవిష్యత్తులో మాకు ఎదురు తిరిగితే శవాల దిబ్బలు మిగులుతాయి’ అని హెచ్చరించారు.
అసలు కారణమేంటి?
ఈ ఘటన ఎందుకు జరిగింది? దీని వెనుకున్న అసలు కారణమేంటి? ఈ ఘోరం అకస్మాత్తుగా జరిగిందా? కానే కాదు, ఇది ప్రణాళికాబద్ధంగా దళితుల మీద జరిగిన హత్యాయత్నం. ఎన్నో ఏండ్ల నుండి గ్రామంలో పెద్ద ఎత్తున కులవివక్ష, అంటరానితనం కొనసాగుతూ వస్తున్నది. దళితులు క్షవరం చేయించుకోవడానికి అనుమతిలేదు. హోటళ్లలో కనీసం టీ తాగ డానికి కూడా అవకాశం లేదు. ఒకవేళ తాగాలన్నా రెండోగ్లాసులో మాత్రమే తాగి, వెంటనే ఆ గ్లాసును శుభ్రంగా కడగాలి. ఆధిపత్య కులాల వారు షాపులో ఉన్న సమయంలో కిరాణ సరుకులు కొనడానికి వీల్లేదు.వారితో కలిసి కూర్చొని ఆటోల్లో ప్రయాణించరాదు. దళిత మహిళలపైన ఒకవేళ అఘాయిత్యాల వంటి ఘటనలు జరిగితే పోలీసులకు ఫిర్యాదు చేయడం, అలాగే న్యాయస్థానాల్ని ఆశ్రయించడం కూడా నిషేధమే.అయితే, ఈ మారణ, దారుణాల వెనుక ఉన్న విస్తుగొలిపే విష యాలున్నాయి. తరతరాల నుంచి కొనసాగుతున్న కులవివక్ష, అంటరానితనానికి వ్యతిరేకంగా ఆ గ్రామంలో సీపీఐ(ఎం) పెద్దఎత్తున పోరాటాలు నిర్వహిస్తూ వస్తోంది. ప్రజా సంఘాలను నిర్మిస్తూ, ప్రజల్లో చైతన్యాన్ని కలిగిస్తూ, ఆధిపత్య కులాల్లోని అభ్యుదయ శక్తులను సైతం కలుపుకుంటూ ఉద్యమాలు నిర్వహిస్తూ వచ్చింది. రెండు గ్లాసుల పద్ధతికి వ్యతిరేకంగా పెద్దఎత్తున కార్యక్రమాలు చేపట్టింది. కులాంతర వివాహాలను ప్రోత్సహించింది. ఆటోల్లో, బస్సుల్లో దళితులు, ఆధిపత్య కులాల ప్రజలు కలిసి ప్రయాణం చేయడంలో తప్పులేదని, అందరూ మనుషులమేనంటూ, అంటరానితనానికి వ్యతిరేకంగా పార్టీ నికరంగా దీర్ఘకాల ఉద్యమాలను నడిపింది. దళితుల క్షవరంలో వివక్ష చూపించడం నేరమని ఎత్తిచూపింది. ఓ వైపు పెత్తందారుల దౌర్జన్యాలను అడ్డుకోవడం, మరోవైపు దళితుల్లో సామాజిక చైతన్యాన్ని పెంపొందించే కార్యకలాపాలను చేపట్టడాన్ని పెత్తందారులు జీర్ణించుకోలేదు.
గ్రామంలో సీపీఐ(ఎం) బలపడటం, దళితులు సంఘటిత మవ్వడం, ప్రశ్నించడం అతిపెద్ద నేరంగా చూశారు.దళితుల మీద విపరీతమైన ద్వేషాన్ని పెంచుకున్నారు. అప్పటినుంచి సీపీఐ(ఎం), దాని అనుబంధ ప్రజా సంఘాల్లో పనిచేస్తున్న కార్యకర్తలను శత్రువులుగా చూడటం మొదలుపెట్టారు. దళితుల్లో వస్తున్న సామాజిక చైతన్యాన్ని తట్టుకోలేకపోయారు. ఇది తమ ఆర్థిక, సామాజిక ప్రయోజనాలకు నష్టమని, గ్రామ రాజకీయాలపై తమ పట్టు సడలే అవకాశం ఉందనే అభిప్రాయానికి వచ్చారు. ఎలాగైనా తమ ఆధిపత్యాన్ని నిలుపుకోవాలనుకున్నారు.
పెత్తందారుల తీర్మానాలు, బహిష్కరణలు
దీంతో పెత్తందారులు దళితుల పైన మరింత ఒత్తిడిని పెంచారు. అనాధిగా వస్తున్న వివక్ష రూపాలు అలాగే కొనసాగుతాయని హెచ్చరించారు. తమ మాట విన్నవారు, తాము చెప్పినట్టుగా నడుచుకునే వారిని మాత్రమే వ్యవసాయ పనులకు పిలుస్తామని చాటింపులు వేయించారు. ఏదైనా ఆర్థిక అవసరాలు ఉన్నప్పుడు విధేయులుగా ఉండేవారికే అప్పులిస్తామని ప్రకటించారు. మాటవినని వారికి అప్పు పుట్టదని హెచ్చరించారు. తమ ఆదేశాల్ని పాటించకపోతే దళితులకు గ్రామబహిష్కరణ తప్పదని హెచ్చరించారు. అలా మాట్ణవినని దళిత కుటుంబాలను బహిష్కరించారు కూడా. ఆధిపత్య భూస్వాములు, పెత్తందారి కులపెద్దలు తమను ప్రశ్నించేవారిని, ఉద్యమాల్లో పాల్గొంటున్న వారిని ‘అధికార’ అండతో నిర్బంధించారు, కేసులు పెట్టి జైల్లోకి పంపే ప్రయత్నం చేశారు. అయితే వారు ఎంత ఒత్తిడి చేసినా సీపీఐ(ఎం)తో పాటు, ప్రజా సంఘాలు వెనుకడుగు వేయలేదు. కులవివక్ష వ్యతిరేక పోరాటాల్లో దళితులు పెద్ద ఎత్తున పాల్గొనటం మొదలుపెట్టారు. ఇది పెత్తందారులను మరింత అసహనానికి గురిచేసింది.అదను చూసి కసితీరా దళితులపైన దాడి చేయాలనుకున్నారు. భౌతికదాడులతో భయభ్రాంతులకు గురిచేసి పార్టీకి దూరం చేయాలనుకున్నారు.
ఆగస్టు 28న ఏం జరిగిందంటే?
28 ఆగస్టు 2014. గంగావతి సినిమా హాలులో జరిగిన ఓ చిన్న ఘటన. సినిమా టిక్కెట్లు తీసుకునే సందర్భంలో తమకే ముందు టిక్కెట్లు ఇవ్వాలని ఆధిపత్య కులానికి చెందిన మంజునాథ అనే వ్యక్తి కోరాడు. దీన్ని అదే మరకుంభి గ్రామనికి సంబంధించిన దళిత యువకుడు బీమ్‌ సే వ్యతిరేకించాడు. ఎవరైనా క్యూలో నిలబడి మాత్రమే టికెట్‌ తీసుకోవాలని వాదించాడు. దీన్ని సహించలేని మంజునాథ భీమ్‌ సేను కులం పేరుతో దూషించాడు. దీంతో చిన్నపాటి ఘర్షణ మొదలైంది. అక్కడ ఉన్న మరికొంత మంది దళిత యువకులు భీమ్‌ సేకు అండగా నిలబడ్డారు. మంజునాధను వెనక్కినెట్టారు. దీన్ని అవమానంగా భావించిన మంజునాథ మరకుంభి గ్రామానికి వెళ్లి తమ ఆధిపత్య కులపెద్దలను రెచ్చగొట్టాడు. అప్పటికే దళితుల మీద కసితో రగిలిపోతున్న పెత్తందారులు ఈ ఘటనను ఆసరాగా తీసుకుని మరుసటి రోజు తెల్లవారుజామునే నాలుగు గంటల ప్రాంతంలో దళిత కాలనీపై విరుచుకుపడ్డారు. కర్రలు, కత్తులు, ఇతర మారణాయుధాలతో దాడి చేశారు. అకస్మాత్తుగా నిద్రమత్తులో తమపై జరిగిన దాడిని దళితులు వెనక్కి కొట్టలేకపోయారు. తేరుకునే లోగానే జరగాల్సిందంతా జరిగిపోయింది. తీవ్రగాయాలతో దళితులంతా చెల్లాచెదురై పరుగులు పెట్టారు. చంటి పిల్లలను, వృద్ధులను కాపాడుకునే ప్రయత్నం చేశారు. మంటల్లో కాలి పోతున్న తమ ఇండ్లను చూస్తూ బోరున విలపించారు. పెత్తందారులకు ఎదురు తిరిగేంతా శక్తి అక్కడ లేకుండా పోయింది. గుండె ధైర్యాన్ని కోల్పోయారు. కాలిపోతున్న గుడిసెల్లో వారి ఆశలు మాడిపోతుంటే విగతజీవుల్లా నిలబడిపోయారు. తెల్లారేసరికే వారి జీవితాలు తెల్లారిపోయాయి.
సీపీఐ(ఎం) రాష్ట్ర వ్యాప్త ఉద్యమం
అయితే ఈ దుర్మార్గాన్ని సీపీఐ(ఎం) తీవ్రంగా నిరసించింది. ధైర్యం కోల్పోయిన దళితులకు గుండె ధైర్యాన్ని అందించింది. దళిత కాలనీపై కుల దురహంకారంతో దాడి చేసిన ఆధిపత్య కుల పెద్దలను , వారికి సహకరించిన వారందరికీ శిక్ష పడాల్సిందేనని పట్టుబట్టింది. వీధులు, కాలనీలు, గ్రామాల్లో మొదలైన ఉద్యమం ప్రజా సంఘాలతో కలిసి రాష్ట్రాన్ని కదిలించింది. ఈ సమస్యను సీపీఐ(ఎం) జాతీయ, కర్నాటక రాష్ట్ర కమిటీ తీవ్రంగా పరిగణించింది. గంగావతి తాలూకాలోని మరకుంభి గ్రామం నుంచి బెంగళూరు వరకు పాదయాత్ర చేపట్టింది. పోలీస్‌స్టేషన్ల ముందు బైఠాయించి దళితులకు న్యాయం చేయాలని నినందించింది. పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యులు ఎంఏ బేబీ , కేరళ పార్టీ ప్రస్తుత పార్లమెంటు సభ్యులు రాధాకృష్ణన్‌ తదితరులు పెద్ద ఎత్తున దళిత సంఘీభావ ఉద్యమాన్ని నడుపుతూనే దళితులపై దాష్టీకానికి పాల్పడ్డ నిందితులను శిక్షించాలని కోర్టులో న్యాయ పోరాటం చేశారు. అయితే బలమైన సాక్ష్యాలు లేకపోవడంతో పెత్తందారుల తమకు ఎదురే లేదనుకున్నారు. ఈ నేపథ్యంలో దళితుల పైన జరిగిన దాడిని ప్రత్యక్షంగా చూసిన సీపీఐ(ఎం) కార్యకర్త దొడ్డ వీరేశప్ప కోర్టులో సాక్ష్యం చెప్పేందుకు ముందుకొచ్చాడు. అయితే 2015లో కొప్పాల రైల్వే స్టేషన్‌ పరిధిలోని రైలు పట్టాలపై వీరేశప్ప శవమై కనిపించాడు. పోలీ సులు దీన్ని ఆత్మహత్యగా ప్రకటించారు. అయితే తమకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి ముందుకొచ్చిన వీరేశప్పను ఆధిపత్య కులాలే హత్యచేసి, రైలు పట్టాలపై పడేశారని సీపీఐ(ఎం) ఆందోళన వ్యక్తం చేసింది. హత్యను ఖండించి, అంతటితో ఆగకుండా ఉద్యమాన్ని మరింత బలంగా ముందుకు నడిపించింది. పదేండ్ల పాటు వీధి ఆందోళనలు, న్యాయ పోరాటాలు నిర్వహించింది. ఇది రాష్ట్రవ్యాప్త సమస్యగా పాలక, ప్రతిపక్ష పార్టీలపై ఒత్తిడి తెచ్చింది.
కోర్టు తీర్పు-98మందికి శిక్ష
ఈ క్రమంలో వారి పదేండ్ల పోరాటం ఫలించింది. పది రోజుల క్రితం కర్నాటక రాష్ట్రం కొప్పాల జిల్లా సెషన్స్‌ కోర్టు మరకుంభి కేసులో తీర్పునిచ్చింది. దళితులపైన విచక్షణారహితంగా దాడి చేసిన ఆధిపత్య కులాలకు చెందిన 98 మందికి కోర్టు జీవితకాల కఠిన కారాగార శిక్షను విధిస్తూ సంచలన తీర్పును వెల్లడించింది. మరో ముగ్గురికి ఐదేండ్ల సాధారణ జైలు శిక్షను విధించింది. కుల వివక్షతను ప్రోత్సహించే వారికి భవిష్యత్తులో సైతం ఇటువంటి శిక్షలే విధించబడతాయని న్యాయమూర్తి తీర్పులో పేర్కొనడం ఆహ్వానించదగిన అంశం. ఇంతకాలానికి నిందితులకు జీవితకాల శిక్షను విధిస్తూ, ఇచ్చిన తీర్పు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇది భారతదేశ న్యాయవ్యవస్థ ప్రస్థానంలోనే ఓ ప్రత్యేకమైన కేసుగా నిలబడుతుందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సీపీఐ(ఎం) చేసిన సుధీర్ఘ న్యాయ పోరాటాలను పలు దళిత సంఘాలు, సామా జిక ఉద్యమ నాయకులు అభినందిస్తున్నారు. ఈ సందర్భంగా మరకుంభి దళిత న్యాయ పోరాటంలో అసువులు బాసిన దొడ్డ వీరేశప్పకు ఈ సందర్భంగా విప్లవ జోహార్లు అర్పిద్దాం.దళితులపై జరిగిన దాష్టీకానికి వ్యతిరేకంగా సీపీఐ(ఎం) చేసిన పోరాటంలో కలిసొచ్చిన వారందరికీ విప్లవ జేజేలు తెలుపుదాం.
బండారు రమేష్‌
9490098251