‘మార్చి-8 మహిళలకు స్ఫూర్తి కావాలి’

'మార్చి-8 మహిళలకు స్ఫూర్తి కావాలి'”76 ఏండ్ల అజాది అమృత్‌ మహోత్సవంలో ఆమె మరణించింది. అయినా ఆమె మానం నుండి రక్తం స్రవిస్తూనే ఉంది. కాశ్మీర్‌ నుండి కన్యాకుమారి దాకా…అత్యాచారాలకు గురైన శవాలు ఎందుకో ఈ మట్టిలో ఇంకటం లేదు…. మనువాదం, ఫాసిజం, పితృస్వామ్యం దేశంలో నలుదిశలూ ఊరేగుతున్నాయి. ఆమె మాన ప్రాణాలు ఉక్కు పాదాల కింద  నలుగుతూనే ఉన్నాయి”

”ముండ్లపొదల్లో ఓ ఆడశిశువు… చెత్త కుండీల్లో మరో ఆడ శిశువు.. ఇద్దరు అప్పుడే భూమ్మీద పడిన పసికూనలు” ఇలాంటి వార్తలు నిత్యం వస్తుంటాయి. 1910 నుంచి మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు వస్తున్నాయి… పోతు న్నాయి… కానీ మహిళల సామాజిక స్థితిగతుల్లో మార్పు రావటం లేదు. ఈ పరిస్థితిలో ఈ అజాదీ ఎవరిది? ఈ ఉత్సవాలు ఎవరివి? అన్న ప్రశ్న వస్తుంది. రోజురోజుకూ స్త్రీలపై హింస రకరకాల రూ పంలో పెరిగిపోతూ ఉంది. ఇలా ఎందుకు జరుగు తోంది..? ముందుతరాల వారికి హింసలేని సమా జాన్ని అందించలేమా? ఆకాశంలో సగమైన స్త్రీల శ్రమ ఉత్పత్తిలో సగానికి తక్కువేమి కాదు…కానీ కడుపులో బిడ్డను కనాలన్నా, తాను ఏమి చదవాలి, ఎంతవరకు చదువుకోవాలి, ఎలా జీవించాలనే విష యాలలో నిర్ణయించుకొనే స్వేచ్ఛ మాత్రం స్త్రీకి లేదు. స్త్రీ నడక, నడత చివరకు నవ్వుపై కూడా ఆంక్షలు విధించారు. ఇలా స్త్రీలంటే చిన్నచూపు, వివక్ష. స్త్రీ ఎప్పుడు మగవాడి కను సన్నల్లో జీవించాలి. చిన్నప్పుడు తండ్రి, పెళ్ళి తర్వాత భర్త, ముసలిత నంలో కొడుకుల ఆధీనంలో జీవించాలి. ఇలా స్త్రీని బందీని చేయటం ఈ సమాజం మొదటి నేరం. ఇక ఘనమైన మన చరిత్ర, సంస్కృతిలో కూడ ”కార్యేషుదాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, శయనేషు రంభా” అంటూ స్త్రీని పురు షునికి సొంత ఆస్తిగా మలిచారు. ఇలా భూస్వామ్య, పితృ స్వామిక సంస్కృతిని వ్యవస్థీకృతం చేశారు. ఈ పరిస్థితి మారాలి. స్త్రీని కనీసం మనిషిగా చూసి గౌరవించే ఒక మానవీయ సమాజాన్ని నిర్మించే కృషి అందరూ చేయాలి.
అమలుకు నోచుకోని చట్టాల కారణంగా స్త్రీలపై కుటుం బ, లైంగిక హింస, రాజ్యహింస రోజురోజుకూ పెరిగిపోతోంది. 1956, 1986 లలో చేయబడ్డ హిందూ వారసత్వ చట్టం ప్రకారం ఆడ, మగ తేడాలేకుండా ఆస్తిలో సమాన హక్కు ఇవ్వ బడింది. కానీ భూస్వామిక పితృస్వామ్య వ్యవస్థలో ఏ కుటుంబం మహిళలకు ఆస్తిలో సమానవాటా ఇవ్వటంలేదు. 1961 వర కట్న నిషేధచట్టం చేసినప్పటికీ, వరకట్నం గౌరవంగా అమలు చేయబడుతూ ఉంది. పెండ్లి పేరుతో జరిగే తంతూ ఫక్తు వ్యాపారంగా మారి మహిళల పట్ల శాపమైంది. ఈ దురాచారానికి ఎంతోమంది స్త్రీలు బలైపోతు న్నారు. ఈ దురాచారం కారణంగా ఆడశిశువుల భ్రూణ హత్యలు జరిగి, ఆడపిల్లలను గర్భంలోనే చంపుతున్నారు. ఫలితంగా దేశంలో స్త్రీల జనాభా తగ్గిపోయి, పెండ్లికాని ప్రసాద్‌లు పెరిగిపోతు న్నారు. ప్రకృతికి విరుద్ధమైన ఈ చర్యను నిలువ రించటానికి 1994 గర్భస్థ శిశువు పరీక్షల నియంత్రణ చట్టం చేయబడింది. అయిన భ్రూణ హత్యలు ఆగలేదు. ఏ డాక్టరు, తల్లిదండ్రులకు గాని శిక్షలు పడ్డ సందర్భమూ లేదు. కనీసం కేసులు కూడా రిజిస్టర్‌ కావటం లేదు. ఆడపిల్లలు లేకుండా కొత్త సహస్రాబ్దంలోకి మనం ఆడు గుపెట్టే సూచనలు కనిపిస్తున్నట్టు ఐక్యరాజ్య సమితి గణాం కాలు, విశ్లేణషణలు చెబుతున్నాయి. ఇది ప్రమాదకరం. ప్రకృతి సహజ న్యాయసూత్రాలకు విరుద్ధం. పరిస్థితి ఇలాగే కొన సాగితే రాబోయేతరం మూల్యం చెల్లించక తప్పదు. ప్రకృతిపరంగా మగపిల్లల కంటే ఆడపిల్లలు ఎక్కువ మంది బతుకుతారు, జన్యుపరంగా ఆడపిల్లలు బలంగా ఉండటమే దీనికి కారణం. భారతదేశంలో భ్రూణ హత్యల కారణంగా స్త్రీల జనాభా తగ్గిపోతూ ఉంది. అనేక దేశాలలో పురుషులకంటే స్త్రీల సంఖ్య అధికంగా ఉంది. చట్టాల అమలులో చిత్తశుద్ధి లేని కారణంగా ఆడపిండాలను గుర్తించి మొగ్గలోనే తుంచి వేస్తున్నారు. డయాగస్టిక్‌ పరీక్షాకేంద్రాలు మృత పంజరాలుగా మారాయి. దీనికితోడు 1991 నుంచి దేశంలో ప్రపంచీకరణ దశ మొదలై పాశ్చాత్య విష సంస్కృతి పెచ్చరిల్లి, స్త్రీ శరీరం సరుకుగా, అంగడిబొమ్మగా, విలాస వస్తువుగా మార్చబడింది. ఫలితంగా స్త్రీలపై లైంగిక హింస పెరిగిపోయింది. ఈ విషసంస్కృతి కారణంగా మన దేశంలో ప్రతి గంటకు ఐదు గురిపై అత్యాచారాలు జరుగుతున్నాయని గణాంకాలు చెబుతున్నాయి.
బహుళజాతి కంపెనీలు తమ వస్తువులను ప్రచారం చేసు కొని, అమ్ముకొని, సొమ్ము చేసుకోవటం కోసం బుల్లితెరలో వస్తున్న ప్రోగ్రామ్స్‌, సీరియల్స్‌ ఆడవారినే విలన్లుగా చూపిస్తు న్నారు. సినిమాల్లో హీరోయిన్ల పాత్ర అర్థనగంగా, ఆత్మగౌ రవం లేనిదిగా చిత్రీకరిస్తున్నారు. హీరోలైతే జులాయిలుగా, అమ్మాయిలను వెంటబడి, వేధించటమే ప్రేమగా చూపిస్తు న్నారు. చివరకు ఉపాధ్యాయులను కూడా వదలటం లేదు. దీని ప్రభావం నేటి యువతపై పడి మానవీయ సంబంధాలు దెబ్బతింటున్నాయి. పెరిగిన వస్తు వ్యామోహం, వినిమయం పాశ్చాత్య విష సంస్కృతి మూలంగా మొత్తం మానవ సంబం ధాలు మార్కెట్‌ సంబంధాలుగా మారిపోయాయి. రకరకాల నేరాలు పెరిగి తుదకు విలువలు లేని సమాజం ఏర్పడింది. ఈ పరిస్థితిని నిలువరించాల్సిన పాలకులు బహుళజాతి సంస్థ లకు, ధనికులకు అమ్ముడుపోయి బాధ్యతారహితంగా నడుచు కుంటున్నారు. మహిళల సమస్యలు చర్చించుకొని పరిష్కరిం చుకోటానికి చట్టసభలలో కనీసం స్త్రీలకు ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ఏనాడు పార్లమెంట్‌లో మహిళా ప్రతినిధులు 11 శాతానికి మించిలేరు. గత యూపీఏ ప్రభుత్వం చట్టసభలలో మహిళలకు 33శాతం రిజర్వేషన్‌ ఇస్తూమహిళా బిల్లు పార్ల మెంటులో ప్రవేశపెట్టింది. కానీ ఆమోదం మాత్రం పొందలేదు. ఒకవేళ పొందిన స్త్రీలు చట్టసభలకు ఎన్నికైతే పంచాయతీరాజ్‌ అనుభవమే పునరావృతం అవుతుంది. స్త్రీలు డమ్మీలుగా మిగిలిపోగలరు. స్త్రీలను ఇంటికే పరిమితంచేసే భూస్వామ్య భావజాలం నేడు రాజ్యమేలుతోంది. ఈ రకంగా మొదటి నుండి రాజకీయ పరమైన వివక్ష కొనసాగుతూనే ఉంది. తీవ్ర ప్రజా ఉద్యమం ఫలితంగా యూపీఏ ప్రభుత్వం ఆర్భాటంగా తీసు కొచ్చిన నిర్భయ చట్టం-2013 అమలులోకి వచ్చిన స్త్రీలమీద హింసారూపాలు అత్యాచారాలు పెరిగిపోతున్నాయే గాని తగ్గటం లేదు. పైపుచ్చు ఇప్పటీ బీజేపీ ప్రభుత్వం చర్యలు ఇందుకు వత్తాసు పలుకుతున్నాయి. బిల్కిస్‌బానో కేసులో శిక్షలు పడిన పదకొండుమంది ముద్దాయిలను ‘అమృతోత్సవం’ పేరిట వదిలివేయటం, ముద్దాయిలు హారతులందు కొని మరీ స్వాగత సత్కారాలు పొందటం జరిగింది. అలాగే యూపీలోని ‘హత్రాస్‌’ లో దళిత యువతిని సామూహికంగా అత్యాచారం చేసి తగుల పెట్టారు. కాశ్మీరులో ఆసిఫా అనే ముస్లిం పసి కూనను పవిత్ర దేవాలయంలో రోజుల తరబడి అత్యాచారం చేసి చంపిన ముద్దాయిలను అరెస్టు చేస్తే, అక్కడి బీజేపీ వారు నిందితులను విడుదల చేయాలని ఊరేగింపులు చేయటం లాంటి సంఘ టనలతో సభ్యసమాజం నివ్వెరపోయి సిగ్గుపడింది. ఈ సంఘ టనలు ‘బేటి బచావ్‌’ ప్రభుత్వ(బీజేపీ) అసలు రంగు బయటపెట్టింది.
సామాజిక పరిణామంలో మొదట స్త్రీలకు మంచి గౌరవం ఉండేది. మాతృస్వామిక వ్యవస్థే ఇందుకు ఉదాహరణ. ఆ తరు వాత వ్యక్తిగత ఆస్తి, వర్గ సమాజం ఏర్పడ్డాక స్త్రీలకు ఆస్తి హక్కు లేకుండా పోయింది. దీంతో స్త్రీలకు విలువ పోయి వంటింటి కుందేలు అయిపోయింది. ఇదే నేటివరకు కొనసా గుతూ ఉంది. సరిగ్గా వివక్ష ఇక్కడే మొదలైంది. స్త్రీలను రెండు రకాల బానిసలుగా మార్చి వేసింది వర్గ సమాజం. ఇంటి బయట జీతమొచ్చే బానిసగా, ఇంట్లో జీతం లేని బానిసగా చేసింది. స్త్రీలు శ్రమ చేయటం తప్ప వారికి ఆస్తిని కలిగి ఉండే హక్కు లేదు. ఇది స్త్రీలను పూర్తిగా బలహీనపరిచింది. అప్పటి నుండి నేటి వరకు స్త్రీలు అనేక రకాలుగా దోపిడీకి గురవుతు న్నారు, కాబట్టి స్త్రీల దోపీడీకి, వివక్షకు మూలం పెట్టుబడిదారీ మార్కెట్‌ ఉత్పత్తి విధానం.ఆర్థిక అసమానతలతో కూడిన ఈ విధానం నశించాలి. అందుకు మరో స్వాతంత్య్ర పోరాటం జర గాలి. సోషలిస్ట్‌ వ్యవస్థలు ఏర్పడాలి. సోషలిస్ట్‌ వ్యవస్థలో సామాజిక ఉత్పత్తిలో శ్రమ విముక్తి జరిగి స్త్రీల భాగస్వామ్యం పెరిగి వారి విముక్తికి దారి తీస్తుంది. ఇదే స్త్రీ విముక్తికి, అన్ని సామాజిక సమస్యల పరిష్కారానికి మార్గం.
(నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం)
అరుణ 9705450705