– పంజాబ్‌లో కదం తొక్కిన దళిత కూలీలు
– గ్రామగ్రామానికీ మార్చ్
చండీగఢ్ : పంజాబ్‌లోని రైతులు ‘ఢిల్లీ చలో’ మార్చ్‌లో ఉన్నారు. ఇదే సమయంలో రాష్ట్రంలో భూమి లేని దళిత కూలీలు తమ హక్కుల కోసం కదం తొక్కారు. రాష్ట్రంలోని భూనిర్వాసిత కార్మికులు ‘మజ్దూర్ పైడల్ జోడో యాత్ర’ నిరసనను ప్రారంభించారు. డిమాండ్ల సాధనకు మద్దతు కూడగట్టడానికి కాలినడకన, సైకిళ్లతో ఒక గ్రామం నుంచి మరొక గ్రామానికి వెళ్తూ మద్దతు కూడగట్టారు. మహిళలు, భూమిలేని రైతులు, రోజువారీ కూలీలు ఈ యాత్రకు నాయకత్వం వహిస్తున్నారు. వీరిలో ఎక్కువగా దళిత సమాజానికి చెందినవారు ఉన్నారు. భూమి యాజమాన్య హక్కులు, రుణమాఫీ, గౌరవప్రదమైన వేతనాలు, కుల ఆధారిత వివక్షను అంతం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పెండు మజ్దూర్ యూనియన్, పంజాబ్, జమీన్ ప్రాప్తి సంఘర్ష్ కమిటీ మొదలైన సంఘాలు ఇందులో ఉన్నాయి. ఈ యాత్ర ప్రస్తుతం జలంధర్, హౌషియార్‌పూర్, మోగా వంటి జిల్లాల్లో కొనసాగుతున్నది. మరోవైపు మార్చి 11న రాష్ట్రవ్యాప్తంగా ‘రైల్ రోకో’ నిర్వహించనున్నట్టు కార్మిక సంఘాలు ప్రకటించాయి.