– ఇంట్రాడేలో సెన్సెక్స్ 1100 పాయింట్ల పతనం
– తుదకు 843 పాయింట్ల లాభం
న్యూఢిల్లీ: వారాంతం సెషన్‌లో దేశీయ స్టాక్ మార్కెట్లు అమాంతం పడిపోయి.. తుదకు లాభాల్లో ముగిశాయి. ఉదయం నష్టాలతో మొదలైన బీఎస్‌ఈ సెన్సెక్స్ ఇంట్రా ట్రేడింగ్‌లో 1129 పాయింట్లు క్షీణించి 81వేల దిగువకు జారింది. పీఎస్‌బీలు, లోహ, ఫైనాన్సియల్, ప్రయివేటు బ్యాంక్, ఆటో స్టాక్స్ అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. మధ్యాహ్నం తర్వాత సూచీలు అనుహ్యాంగా పుంజుకున్నాయి. దీంతో బీఎస్‌ఈ సెన్సెక్స్ 843 పాయింట్లు పెరిగి 82,133 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 80,083 కనిష్ట స్థాయిని తాకింది. ఈ క్రమంలో కనిష్ఠాల నుంచి దాదాపు 2 వేల పాయింట్లు పుంజుకున్నట్లయ్యింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 220 పాయింట్లు పెరిగి 24,768 వద్ద ముగిసింది. ముఖ్యంగా ఎయిర్‌టెల్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు ప్రధానంగా లాభాలకు మద్దతును అందించాయి. సెన్సెక్స్ 30 సూచీలో టాటా స్టీల్, ఇండస్ ఇండ్ బ్యాంక్, జెఎస్‌డబ్ల్యూ స్టీల్, బజాజ్ ఫిన్‌సర్వ్ తప్ప మిగిలిన అన్ని షేర్లూ లాభాల్లో ముగిశాయి.