– భారత ఫుట్‌బాల్ సమాఖ్య నిర్ణయం
న్యూఢిల్లీ : హైదరాబాద్ ఎఫ్‌సీ మాజీ చీఫ్ కోచ్, గోవా ఎఫ్‌సీ హెడ్ కోచ్ మనాలో మార్కెజ్ భారత ఫుట్‌బాల్‌లో సరికొత్త సవాల్‌కు సిద్ధమయ్యాడు. ఫిఫా ప్రపంచకప్ క్వాలిఫయర్స్ నుంచి భారత్ నిష్క్రమించగా.. ఇగర్ స్టిమాక్‌పై భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్) వేటు వేసిన సంగతి తెలిసిందే. 2023 నుంచి గోవా ఎఫీసీ హెడ్ కోచ్‌గా పని చేస్తున్న మార్కెజ్.. 2025 వరకు గోవా ఎఫ్‌సీతో పాటు భారత జట్టు చీఫ్ కోచ్ బాధ్యతలు సైతం చూసుకోనున్నాడు. ఈ మేరకు ఏఐఎఫ్‌ఎఫ్ శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. ఇండియన్ సాకర్ లీగ్ (ఐఎస్‌ఎల్)లో మార్కెజ్‌కు మంచి పేరుంది. హైదరాబాద్ ఎఫ్‌సీతో కలిసి మూడు సీజన్లు పని చేసిన మార్కెజ్ దక్కన్ టైగర్స్‌కు తొలి టైటిల్ అందించాడు. యువ ఆటగాళ్లను ప్రోత్సహిస్తాడనే పేరున్న మార్కెజ్‌పై భారత ఫుట్‌బాల్ అభిమానులు భారీ అంచనాలతో ఉన్నారు.