పెళ్లి – నీతి

పెళ్లి - నీతి”నారాయణ నారాయణ!” అంటూ వైకుంఠంలోకి ప్రవేశించాడు నారదుడు. అక్కడి దృశ్యం యధావిధిగానే ఉంది! శ్రీహరి నిద్రలో ఉండగా మహాలక్ష్మి ఆయన పాదములు ఒత్తుతూనే ఉన్నది.
”తల్లీ వందనాలు!” అంటూ లక్ష్మిదేవికి నారదుడు నమస్కరించాడు. లక్ష్మీదేవి నారదుడిని కుశల ప్రశ్నలు వేసింది.
”స్వామివారు, యోగనిద్రలో నుండి ఎప్పుడు మేల్కొంటారు తల్లీ!” అని నారదుడు అడిగాడు. ఇంతలో శ్రీహరి మేల్కొన్నాడు.
”ఏమి నారదా! ఏమి విశేషాలు? అంతా కుశలమేనా? బహుకాలము తర్వాత తీరిక దొరికినది!” అంటూ ప్రశ్నలు వేశాడు శ్రీహరి.
”స్వామీ! ఈ మధ్య తరచూ మీ దర్శనార్థం వైకుంఠానికి వస్తూనే ఉన్నాను. కాని మీకు నిద్రాభంగం కల్గించటం ఇష్టం లేక తిరిగి వెళ్లిపోతున్నాను. మా నాయనమ్మే ఇందుకు సాక్ష్యం!” అన్నాడు నారదుడు.
”అవును నారదా! కొత్తగా అవతారములు దాల్చవలసిన అవసరమేమీ లేదు కదా! అందుకే నిద్ర పోవుచుంటిని!” అన్నాడు శ్రీహరి.
”కల్కి అవతారము మిగిలియున్నది కదా! ఆ అవతారము ఎపుడు దాల్చెదరు స్వామీ?” ఆసక్తిగా అడిగాడు నారదుడు.
”మరికొన్ని లక్షల సం||లు గడిచిన పిమ్మటనే కల్కి అవతారమును దాల్చవలసి యున్నది! అందలకు చాలాకాలము ఉన్నది కదా! ఆ చర్చ ఇప్పుడెందులకు?. భూలోక విశేషాలు ఏమిటో తెల్పుము?” అన్నాడు శ్రీహరి.
”భూలోకమునందు మొత్తం ఒకే ఒక విశేషము కలదు స్వామి! అదే అనంత్‌, రాధికల వివాహవేడుక!” అన్నాడు నారదుడు.
”ముఖేష్‌ అంబానీ కుమారుడైన అనంత్‌ వివాహ వేడుకేనా నారదా!” అడిగింది లక్ష్మీదేవి.
”అవును తల్లీ! మీ కృపాకటాక్షములు మెండుగా పొందిన అంబానీ ఇంట, జరిగిన వివాహమే అతి పెద్ద విశేషము!” అన్నాడు నారదుడు.
లక్ష్మీదేవి మొహంలో కోపం అయిష్టత కనపడ్డాయి!
”వివాహం అంటే అదే అన్న విధంగా జరిగింది! నభూతో, నభవిష్యత్‌ కూడా! అలాంటి వివాహం ఏడేడు పద్నాలుగు లోకాల్లో ఇంకా ఈ మధ్యంతరంలోనే జరగలేదంటే అతిశయోక్తి లేదు!” అన్నాడు నారదుడు.
”మా రామావతారంలో జరిగిన పెండ్లికన్నా వైభవంగా జరిగిందా!” అన్నది లక్ష్మీదేవి.
”నిస్సందేహంగా, మీ సీతారాముల వివాహ వైభవం కన్నా అనంత్‌, రాధిక వివాహ వైభవం చాలా గొప్పది!” అన్నాడు నారదుడు.
”ఏమిటి నాదరా! మరీ గొప్పలు చెబుతున్నావు! శ్రీ వేంకటేశ్వర కల్యాణం కన్నా గొప్ప కల్యాణమా అది!” అన్నది లక్ష్మీదేవి కోపంగా.
”అనుమానం ఏమీ లేదు తల్లీ!” అన్నాడు నారదుడు నింపాదిగా.
”ఆపు నారదా! దేవతల పెళ్లితో ఒక మానవుడి పెళ్లిని పోల్చి గొప్ప చేస్తావా? ఏమి నీ తుంటరి తనం!” అన్నది లక్ష్మీదేవి చిరుకోపంతో.
”తల్లీ! ఇప్పుడు నేను చెప్పిన మాటలు నావి కావు! భూలోక వాసులు అనుకుంటున్నవే! మచ్చుకి ఒకటి, రెండు చెబుతాను, మీ పెళ్లిళ్లకి, అమెరికా, బ్రిటన్‌ లాంటి దేశాల నుండి ఎవరైనా వచ్చారా! ఎంతసేపూ అంగ, వంగ, కళింగ అంటూ బుడ్డ రాజ్యాల రాజులే వచ్చారు! కాని అంబానీ పెళ్లికి అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌ లాంటి పాశ్చాత్య దేశాధినేతలు కూడా వచ్చారు!” అన్నాడు నారదుడు.
”మరొకటి కూడా వివరించుము నారదా!” అన్నాడు శ్రీహరి నవ్వుతూ.
”మీ పెళ్లిళ్లలో చుట్టాలు, బంధువులు నృత్యాలు చేసినట్లు నేనైతే చూడలేదు కాని అంబానీ పెళ్లిలో ఏ మాత్రం డాన్సు రాని రజనీకాంత్‌ కూడా స్టెప్పులేశాడు! కాదర్శన్‌ సిస్టర్స్‌ కూడా వచ్చారు! డాన్సులు చేశారు!” అన్నాడు నారదుడు.
”కాదర్శన్‌ సిస్టర్స్‌ ఎవరు?” అడిగింది లక్ష్మీదేవి ఆసక్తిగా.
”వారు పాశ్చాత్య దేశాలకు రంభా, ఊర్వశి లాంటి వారు!” అన్నాడు నారదుడు.
”నారదా! మొత్తం విశేషాలన్ని ఒకేసారి వివరింపుము!” అన్నాడు శ్రీహరి.
”వివాహ పత్రికను ఆరున్నర లక్షలు ఖర్చు పెట్టి చేయించారు! రెండు వేల రకాలు వంటలు చేయించారు. బంగారు తాంబులాలు ఇచ్చారు. ముందే చెప్పినట్లు భూలోకమునందలి ప్రముఖులంతా వచ్చారు. వారంతా వధూవరులకు కోట్లాది రూ|| విలువైన బహుమతులు ఇచ్చారు. అంబానీ వారు కూడా ఆహుతులకు రెండు కోట్ల విలువైన గడియారాలు రిటర్న్‌గిఫ్ట్‌ ఇచ్చారు! వివాహ వేడుకల్నీ సనాతన ధర్మం ప్రకారమే నిర్వహించారు! చివర్లో ముఖేష్‌ అంబానీ, నీతూ అంబానీ సనాతన ధర్మం గురించి ఉపన్యసించారు. ఈ వివాహంపై అనుకూల, వ్యతిరేక చర్చలు పత్రికల్లో, సోషల్‌ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి! అయితే సోషల్‌ మీడియాలోనే వ్యతిరేక చర్చలు జరుగుతున్నాయి! అన్ని, పత్రికలు, టీవీ ఛానళ్లలో ఈ పెళ్లిని ఆదర్శంగా, అతిగొప్పగా వర్ణించుతున్నాయి!” అన్నాడు నారదుడు.
”సోషల్‌ మీడియాలో చర్చను కూడా వివరించు నారదా!” అన్నాడు శ్రీహరి.
”ఇటీవల జియో నెట్‌వర్క్‌ ఛార్జీలు పెంచటం. ఈ పెళ్లి కోసమేనని చాలామంది మీమ్స్‌ చేస్తున్నారు! తమ రెక్కల కష్టంతో వధూవరులకు బంగారు జలతారు వస్త్రాలు చేయించుకున్నారని విమర్శిస్తున్నారు!” అన్నాడు నారదుడు.
శ్రీహరి చిరునవ్వు నవ్వాడు.
”మరి కొందరు, అంబానీ సంపాదించిన డబ్బుతో కొడుకు పెళ్లి ఘనంగా చేసుకుంటే ఓర్వలేని వారు కారుకూతలు కూస్తున్నారని, అంబానీ పెళ్లిలో పెట్టిన ఐదు వేల కోట్ల ఖర్చు వల్ల కొన్ని లక్షల మందికి ఉపాధి దొరికి కడుపు నిండా భోజనం చేశారని, వివాహ వేడుకల సందర్భంగా రోజు తొమ్మిది వేల మందికి అన్నదానం చేసిన అంబానీ అభినందనీయుడని, అంబానీ లేకపోతే దేశం ఆగమై పొయ్యేదని సనాతన ధర్మాన్ని తమ పెళ్లి ద్వారా ఆచరించి చూపిన మహాత్ముడని కొనియాడుతున్నారు!” వివరించాడు నారదుడు.
లక్ష్మీదేవి ఆసక్తిగా ఆలకిస్తున్నది. అంతలోనే ఆమెకు సందేహం కలిగింది!
”మరి ప్రధాని నరేంద్రమోడీ పెళ్లికి వెళ్లలేదా!” అడిగింది.
”మోడీ కూడా వెళ్లారు! సుమారు రెండు గంటల సేపు అక్కడ గడిపారు. వధూవరులను మనస్ఫూర్తిగా ఆశీర్వదించి ప్రత్యేక కానుకల పేటిక బహుకరించారు!” అన్నాడు నారదుడు.
”అదెలా సాధ్యం! మొన్న ఎన్నికల్లో కోట్లాది నల్లధనాన్ని మెటాడోర్‌ వ్యాన్లలో రాహుల్‌గాంధీకి అంబానీ పంపించారని చెప్పిన మోడీ, ఆ పెళ్లికి ఎలా వెళ్లగలరు! వెళ్లెను పో! కానుకల పేటిక ఏల బహుకరించవలె? ఇదేమి చోద్యము? నోటితో మాట్లాడి నొసటితో వెక్కిరించినట్లు ఉన్నది!” అన్నది మహాలక్ష్మి.
”అవును తల్లీ నిజమే!” అన్నాడు నారదుడు.
”నల్లధనాన్ని అక్రమంగా దాచిపెట్టుకోవటమే కాక ఒక రాజకీయపార్టీకి విరాళంగా పంపు తున్నారని, అంబానీని విమర్శించింది సాక్షాత్తూ ప్రధాని హోదాలోనే! ఎన్నికల తర్వాత గెలిచి తానే తిరిగి ప్రధాని అయ్యాడు! ఇప్పటికి నెల రోజుల పైగా గడిచిపోయింది! ఇప్పటి వరకు అంబానీపై ఎలాంటి చర్యలు తీసుకునలేదు! రూ.ఐదువేల కోట్లు ఖర్చు పెట్టి అంగరంగ వైభవంగా పెళ్లి చేస్తున్న వారి ఇంటికి ఈడి అధికారులను పంపకుండా తగుదునమ్మా అంటూ తానే వెళ్లి కానుకలు ఇచ్చి వస్తాడా? ఇదేమి పద్ధతి! పాత నెట్‌వర్క్‌ ఛార్జీలతోనే ఇరవై వేల కోట్ల రూ|| లాభాలను పొందినా ఇంకా సరిపోదని దాదాపు యాభైశాతం ఛార్జీలు పెంచారు! భారత ప్రజల ఆస్తియైన స్పెక్ట్రమ్‌ను ఆయాచితంగా వాడు కుంటూ, ప్రజలపై భారాలు మోపుతున్న ఆంబానీపై విచారణ చేపట్టవలసిన ప్రధాని వెళ్లి పెళ్లి కానుకలు ఇవ్వటమా! హవ్వ ఇంతకన్నా సిగ్గు చేటైన సంగతి ఏమున్నది? ఓట్లేసి తనకు మూడవసారి అధికారాన్ని కట్టబెట్టిన ప్రజలకు మోడీ ఏం సందేశం ఇస్తున్నారో స్పష్టమవుతూనే ఉన్నది! ఓట్లేసే ఒక్క నిమిషమే ప్రజలు ఆత్మబంధువులు! ఓటేసిన మరుక్షణం ప్రజలు పరాయివారు! అంబానీలు,ఆదానీలు ఆత్మ బంధు వులై పోతారు! అంబానీ ఇంట జరిగిన పెళ్లిలో నేర్చుకోవల్సిన నీతి ఇదే!” అంటూ ముగించింది లక్ష్మీదేవి.