– ”ఎన్‌ఆర్‌ఈజీఏ”ను నీరుగారుస్తున్న కేంద్రం
– తెలంగాణపై మరింత వివక్ష
– జాబ్‌కార్డుల జారీలో 8 శాతం తగ్గుదల
– ఏడాదిలో ఏడు లక్షల మంది కార్మికులు దూరం
– 17.3 లక్షల మంది కార్మికుల తొలగింపు
– 17.9 శాతం మేర తగ్గిన పనిదినాలు
– 2021-22తో పోలిస్తే 29.3 శాతం తగ్గుదల
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఉపాధి హామీ చట్టాన్ని కేంద్రం నీరుగారుస్తున్నది. బడుగు, బలహీన వర్గాలకు ఇతోధికంగా దోహదపడుతున్న ఆ చట్టం నిర్వీర్యానికి కంకణం కట్టుకుని ముందుకు సాగుతున్నది. తెలంగాణ విషయంలో మరింత కక్షపూరితంగా వ్యవహరిస్తున్నది. రెండేండ్లలో 30 శాతం మేర పనిదినాలు తగ్గడమే దానికి సాక్షీభూతంగా నిలుస్తున్నది. పొమ్మనకుండా పొగపెడుతూ కార్మికులను పనులకు దూరం చేస్తున్నది. ఏ సామాజిక తరగతుల్లో ఆర్థిక పరిస్థితులను మెరుగుపర్చాలని చట్టం తీసుకొచ్చారో ఆ లక్ష్యంగా క్రమంగా నీరుగారిపోతున్నది. కేంద్రం తీరు వల్ల ఎక్కువగా నష్టపోతున్నది ఎస్సీ, ఎస్టీ సామాజిక తరగతుల వారే కావడం ఆందోళనకు గురిచేస్తున్నది. ప్రభుత్వ గణాంకాలు, క్షేత్రస్థాయి అధ్యయనం ఆధారంగా లిబ్‌టెక్ ఇండియా సంస్థ రూపొందించిన రిపోర్టు చట్టం నిర్వీర్యం అవుతున్న తీరును ఎత్తిచూపింది.
తెలంగాణలో ఉపాధి హామీ చట్టం 32 జిల్లాల్లోని 540 మండలాల్లో అమలవుతున్నది. ఒక్కో కుటుంబానికి రాష్ట్రంలో సగటున 37.56 రోజుల పనిదినాలే దక్కుతున్నాయి. ఇది జాతీయ స్థాయి సగటు కంటే తక్కువ. జాతీయ స్థాయిలో సగటున 38.43 రోజుల పనిదొరుకుతున్నది. వంద రోజుల పని పూర్తి చేసిన కుటుంబాల సంఖ్య దేశ వ్యాప్తంగా 6.79 లక్షల కుటుంబాలు కాగా, తెలంగాణలో ఆ సంఖ్య కేవలం 0.14 లక్షలు మాత్రమే ఉంది. జాతీయస్థాయిలో ఒక వ్యక్తికి సగటు వేతనం రోజుకు రూ.237.65 దక్కుతుండగా
అది తెలంగాణలో రూ.179 మాత్రమే.
జాబ్ కార్డుల్లో కోత
రాష్ట్రమంతటా 2022-23 ఆర్థిక సంవత్సరంలో 57.5 లక్షల జాబుకార్డులుండగా 2023-24కు వచ్చేసరికి అదికాస్తా 52.92 లక్షలకు పడిపోయింది. అందులో క్రియాశీలక జాబ్‌కార్డులు 35.28 లక్షలు మాత్రమే. క్రియాశీల కార్మికులు 2022 అక్టోబర్ నాటికి 67.3 లక్షల మంది ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 60.77 లక్షలకు తగ్గింది. అంటే క్రియాశీలక కార్మికుల సంఖ్య 9.7 శాతం, జాబ్ కార్డుల సంఖ్య 8 శాతం మేర తగ్గాయి. జాతీయ స్థాయిలో ఇది 12.3 శాతముంది.
జాతీయస్థాయిలో పెరుగుదల..రాష్ట్రంలో తగ్గుదల తెలంగాణలో ఎంజీఎన్‌ఆర్‌ఐఈజీఏ కార్మికులకు ఈ ఏడాది 8.14 కోట్ల పనిదినాలే కల్పించబడ్డాయి. మునుపటి సంవత్సరం 9.92 కోట్ల పనిదినాలు నమోదయ్యాయి. పనిదినాల కల్పనలో గతేడాదితో పోల్చి చూస్తే 17.9 శాతం క్షీణత ఉంది. అదే 2021-22 ఆర్థిక సంవత్సరంతో పోల్చి చూస్తే పనిదినాల్లో కోత 29.3 శాతం మేర ఉంది. అంటే రెండేండ్ల వ్యవధిలో మూడింట ఒకొంతు మేర పనిదినాల సంఖ్య కుదించబడింది. అదే జాతీయ స్థాయిలోనూ ఇదే క్రమం కొనసాగుతున్నా గతేడాదితో పోల్చి చూస్తే మాత్రం పనిదినాల కల్పన మెరుగైంది. 2021-23 పోల్చి చూస్తే ఉపాధి పొందిన కుటుంబాల సంఖ్య 13.5 శాతం పెరిగింది. అదే తెలంగాణలో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు కేవలం మూడు జిల్లాల్లో మినహా (జగిత్యాల, నల్లగొండ, సంగారెడ్డి) మిగతా 29 జిల్లాల్లో క్షీణత ఉంది. ములుగు జిల్లాలో అత్యధికంగా 51.2 శాతం, మేడ్చల్ జిల్లాలో 51.1 శాతం, కామారెడ్డి జిల్లాలో 47.5 శాతం మేర పనిదినాల్లో కోత పడింది.
కార్మికుల తొలగింపు
2022-23 ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా జాబ్‌కార్డుల నుంచి కార్మికులు గణనీయ సంఖ్యలో తొలగించబడ్డారు. దేశ వ్యాప్తంగా 2022-23లో 5.2 కోట్ల మంది ఉపాధి కార్మికులను జాబ్‌కార్డుల నుంచి తొలగించినట్టు లోక్‌సభకు గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ నివేదిక అందజేసింది. తెలంగాణలో 17.3 లక్షల మంది కార్మికులు తొలగింపునకు గురయ్యారు. ఈ తొలగింపులు పారదర్శకంగా జరగలేదనే విమర్శ బలంగా ఉంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకూ (ఏప్రిల్ నుంచి సెప్టెంబర్) ఉపాధి హామీ చట్టంలో కొత్తగా 1,34,487 మంది కార్మికులు చేరారు. అయితే, గత ఆరు నెలల్లో 1,20,281 మంది కార్మికులు తొలగించబడ్డారు. దీంతో కొత్తగా చేరిన కార్మికుల సంఖ్య 14,206 మాత్రమే. దీంతో గతేడాది తొలగించిన కార్మికుల్లో నిజమైన కార్మికులందరి భవితవ్యం చిక్కుల్లో పడింది.
వివిధ సామాజిక తరగతుల భాగస్వామ్యం ఇలా
సకాలంలో వేతనాలు అందకపోవడం, కేంద్రం రోజుకో కొత్తరకం ఆంక్షలు తెస్తుండటంతో ఆయా సామాజిక తరగతుల వారు ఉపాధి :హామీ పనులకు క్రమంగా దూరమవుతున్నారనే విషయం లిబ్‌టెక్ రిపోర్టు ఆధారంగా స్పష్టంగా అర్ధమవుతున్నది. గతేడాదితో పోలిస్తే ఈసారి ఎస్సీ సామాజిక తరగతికి చెందిన వారు 16.5 శాతం, ఎస్టీలు 16.6 శాతం మేర పని దినాలను కోల్పోయారు. ఇతర సామాజిక తరగతుల్లో పనిదినాల సంఖ్య తగ్గుదల 18.9 శాతం తగ్గుదల ఉంది. మొత్తంగా తెలంగాణలో 17.9 శాతం మేర పనిదినాలు తగ్గాయి.
బడ్జెట్‌లోనూ కోత
ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేయడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఏటేటా నిధులను తగ్గిస్తూ పోతున్నది. కేంద్రం ఈసారి బడ్జెట్‌లో కేవలం రూ.60 వేల కోట్లను మాత్రమే కేటాయించింది. దీనివల్ల తెలంగాణకు అందే నిధుల్లో భారీగా కోతపడుతున్నది. వాస్తవానికి దేశవ్యాప్తంగా ఉపాధి :హామీ చట్టం ద్వారా ఎక్కువ పనులు చేస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటిగా ఉంది. కేంద్రం తీరు వల్ల రాష్ట్ర ప్రజలు నష్టపోతున్నారు. డిమాండ్ రీత్యా తెలంగాణకు 12 కోట్ల పనిదినాలు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం ఓ పక్క కోరుతుండగా కేంద్రం మాత్రం నిధులను తగ్గిస్తూ పోతున్నది. 2020-21లో తెలంగాణకు రూ.4,163 కోట్లను కేంద్రం కేటాయించింది. 2022-23కు వచ్చే సరికి దాదాపు సగానికి కుదించింది. సుమారుగా 2,600 కోట్లు మాత్రమే విదిల్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023-24)లో ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఉపాధి కూలీల కోసం రూ.1459 కోట్లను మాత్రమే విడుదల చేసింది.