న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకీ అమ్మకాల్లో పతనాన్ని చవిచూసింది. 2024 మేలో 2 శాతం తగ్గుదలతో 1,74,551 యూనిట్లను విక్రయించింది. గతేడాది ఇదే నెలలో 1,78,083 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. చిన్న కార్లలో ఆల్టో, ఎస్ ప్రెసో విక్రయాలు 9,902 యూనిట్లకు తగ్గాయి. 2023 ఇదే నెలలో 12,236 యూనిట్లను సరఫరా చేసింది. కాంపాక్ట్ కార్లలో బలెనో, సెలిరియో, డిజైర్, స్విప్ట్, టూర్ ఎస్, వాగన్‌ఆర్ అమ్మకాలు 71,419 నుంచి 68,206 యూనిట్లకు తగ్గాయి.
పెరిగిన టాటా మోటార్స్ అమ్మకాలు
దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్ 2024మేలో 2 శాతం వృద్థితో 75,173 యూనిట్ల అమ్మకాలు చేసింది. ఇంతక్రితం ఏడాది ఇదే నెలలో 73,448 యూనిట్ల విక్రయాలు చేసింది. వాణిజ్య వాహన అమ్మకాలు 2 శాతం పెరిగి 29,691 యూనిట్లుగా, ప్యాసింజర్ వాహన అమ్మకాలు 47,075 యూనిట్లుగా నమోదయ్యాయి.
హ్యూందారు విక్రయాలు 7శాతం వృద్ధి
హ్యుందారు మోటార్ ఇండియా (హెచ్‌ఎంఐఎల్) గడిచిన మేలో 7 శాతం వృద్ధితో 63,551 యూనిట్ల అమ్మకాలు చేసింది. 2023 మేలో 59,601 యూనిట్ల విక్రయాలు చేసింది. గత నెల ఎగుమతుల్లో 31 శాతం పెరిగి 14,400గా నమోదయ్యినట్లు ఆ కంపెనీ పేర్కొంది.
దూసుకెళ్లిన టొయాటా
గడిచిన మేలో టొయాటా కిర్లోస్కర్ మోటార్ (టికెఎం) అమ్మకాలు భారీగా పెరిగాయి. 2024 మేలో 24 శాతం వృద్ధితో 25,273 యూనిట్ల విక్రయాలు చేసింది. 2023 మేలో 20,410 యూనిట్ల అమ్మకాలు చేసింది.
ఎంజీ మోటార్ 4,769 యూనిట్ల అమ్మకాలు
ఎంజీ మోటార్ ఇండియా 2024 మేలో 5 శాతం తగ్గుదలతో 4,769 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. 2023 ఇదే మాసంలో 5,006 యూనిట్ల విక్రయాలు చేసింది. కాగా విద్యుత్ వాహన అమ్మకాల్లో మెరుగైన ప్రగతిని కనబర్చినట్లు ఆ సంస్థ పేర్కొంది.
ఎంఅండ్‌ఎం 17 శాతం వృద్ధి
మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్‌ఎం) గడిచిన మేలో మొత్తం ఆటో అమ్మకాల్లో 17 శాతం వృద్ధితో 71,682 యూనిట్లుగా నమోదు చేసినట్లు పేర్కొంది. 2023 ఇదే నెలలో 61,415 యూనిట్ల విక్రయాలు చేసింది. ఇదే సమయంలో 32,886 యూనిట్ల ప్యాసింజర్ వాహన అమ్మకాలు చేయగా.. గడిచిన మేలో 31 శాతం వృద్ధితో 43,218 యూనిట్లను విక్రయించింది.