మార్క్సిజం.. మానవత్వం

– ఎనిమిదేండ్లుగా హెల్త్‌ క్యాంపుల నిర్వహణ
– ట్రస్టుల సహకారంతో నిరుపేదలకు వైద్యం
– రూ.100కే నెలకు సరిపడా మందులు
– వేలాది మందికి లభిస్తున్న ఉచిత వైద్య సేవలు
– నేడు జాతీయ వైద్యుల దినోత్సవం
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
విద్యా వైద్యం ప్రభుత్వ ఆధీనంలో ఉండాలని.. ప్రతి ఒక్కరికీ ఇవి ఉచితంగా దక్కాలని మార్క్సిస్టులు అనేక ఏండ్లుగా పోరాటాలు చేస్తున్నారు. కొద్దిమంది నిరుపేదలకైనా మేలు చేయాలనే సంకల్పంతో ఖమ్మం జిల్లాలో ఎనిమిదేండ్ల నుంచి వైద్యశిబిరాలు నిర్వహిస్తున్నారు. మార్క్సిస్టు యోధులు యలమంచిలి రాధాకృష్ణమూర్తి, బోడేపూడి వెంకటేశ్వరరావు, తమ్మినేని సుబ్బయ్యల పేర్లతో జిల్లాలోని ఖమ్మం టూటౌన్‌, త్రీటౌన్‌, వైరా, వరంగల్‌ ఎక్స్‌ రోడ్‌, నేలకొండపల్లిలో నిర్వహిస్తున్న ఈ శిబిరాలకు వేలాది మంది పేద, మధ్యతరగతి ప్రజలు తరలివస్తున్నారు. ప్రతినెలా వారానికి ఓ చోట ఈ శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. రూ.100కే రూ.వెయ్యి విలువ చేసే దీర్ఘకాలిక వ్యాధుల మందులను అందిస్తున్నారు. కంటి పరీక్షలు సైతం నిరంతరం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా నల్లగొండ, వరంగల్‌, నిజామాబాద్‌, హైదరాబాద్‌, మెదక్‌, ఆదిలాబాద్‌, కరీంనగర్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ తదితర చోట్ల కూడా నేతల పేర్లతో వైద్యశిబిరాలు నడుస్తున్నాయి. శనివారం జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.
డాక్టర్ల సహకారం..
ఖమ్మంలో పలువురు డాక్టర్లు, రిటైర్డ్‌ ఉద్యోగులు, ప్రజాసంఘాల నాయకులు ఈ హెల్త్‌ క్యాంప్‌ల నిర్వహణకు సహకరిస్తున్నారు. నిరంతరాయంగా ఈ హెల్త్‌ క్యాంప్‌లను పర్యవేక్షిస్తున్న డాక్టర్లలో చీకటి భారవి, యలమంచిలి రవీంద్రనాథ్‌, రామకోటేశ్వరరావు, నాగమణి, రమాదేవి, కొల్లు అనుదీప్‌, గెట్ల రంగారావు, పిల్లలమర్రి సుబ్బారావు, ఏ ప్రవీణ్‌కుమార్‌, పి.వెంకటేశ్వర్లు, కేవీ.భాస్కర్‌రావుతో పాటు పలువురు ఇతర డాక్టర్లు కూడా వస్తుంటారు. హైదరాబాద్‌తో పాటు వివిధ ప్రాంతాల నుంచి స్పెషలిస్టు డాక్టర్లను సైతం రప్పించి వైద్య పరీక్షలు చేయిస్తున్నారు.

సుందరయ్య స్ఫూర్తితో వైద్యశిబిరాలు..
ప్రజలందరికీ వైద్యం అందుబాటులో ఉండాలని పోరాటాలు చేస్తున్నాం. అయినప్పటికీ ప్రభుత్వ వైద్యసేవలు మెరుగుపడట్లేదు. పుచ్చలపల్లి సుందరయ్య స్ఫూర్తితో మార్క్సిస్టు పార్టీ ఆధ్వర్యంలో వైద్యశిబిరాలు నిర్వహిస్తున్నాం. నెలకు సుమారు రూ.లక్షకు పైగా ఖర్చు వస్తున్నా రిటైర్డ్‌ ఉద్యోగులు, వామపక్ష అభిమానులు, ప్రభుత్వ, ప్రయివేటు ఉద్యోగులు, అన్నింటికీ మించి వామపక్ష భావజాలం ఉన్న డాక్టర్ల సహకారంతో ఈ శిబిరాలు కొనసాగుతున్నాయి. రూ.3వేల విలువ చేసే షుగర్‌, బీపీ మందులను కేవలం రూ.100కు ఇవ్వడంతో పాటు అల్పాహార సౌకర్యం కూడా కల్పిస్తున్నాం. స్పెషలిస్టు డాక్టర్లను పిలిపించి వేల విలువ చేసే టెస్టులు ఉచితంగా చేయిస్తున్నాం. మా పోరాట ఫలితంగా ఖమ్మానికి మెడికల్‌ కళాశాల మంజూరైంది. నిమ్స్‌ తరహాలో దీన్ని అభివృద్ధి చేస్తానని గతంలో కేసీఆర్‌ హామీ ఇచ్చారు. ఆ హామీని నిలబెట్టుకోవాలని కోరుతున్నాం. ఈ హెల్త్‌ క్యాంపుల నిర్వహణకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. వైద్యులకు డాక్టర్స్‌ డే శుభాకాంక్షలు.
– నున్నా నాగేశ్వరరావు,
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి