మార్క్సిజం-లెనినిజం ప్రపంచానికి దారి దీపాలు

Marxism-Leninism The lights of the world– భారత్‌లో నిర్దిష్ట పరిస్థితులకు అన్వయించుకోవాలి
– దేశంలో మతోన్మాదాన్ని తిప్పికొట్టాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌ వీరయ్య
– హైదరాబాద్‌లో రెడ్‌బుక్‌ డే సందర్భంగా ‘లెనిన్‌ ఓ విప్లవాయుధం’ పుస్తకం సామూహిక పఠనం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
మార్క్సిజం-లెనినిజం ప్రపంచానికి మార్గం చూపుతాయని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌ వీరయ్య అన్నారు. భారత్‌లో నిర్దిష్ట పరిస్థితులకు అన్వయించుకోవాలని చెప్పారు. దేశంలో మతోన్మాదం విస్తరిస్తున్నదనీ, దాన్ని తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రెడ్‌ బుక్స్‌ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వీరయ్య మాట్లాడుతూ లెనిన్‌ ప్రతిపాదించిన సిద్ధాంతం, సాధించిన విజయాలకు ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతో ప్రాసంగికత ఉందన్నారు. దేశంలో పార్టీ పునాది చెదిరిపోతున్నదనీ, బలహీనపడుతున్నదని ఆవేదన చెందడం కంటే రష్యన్‌ పార్టీ చరిత్రను అధ్యయనం చేయడం మంచిదన్నారు. 1914లో రష్యాలో లెనిన్‌ కూడా ఒక దశలో ఒంటరివాడయ్యారని గుర్తు చేశారు. అయినా 1917 అక్టోబర్‌లో సోవియట్‌ యూనియన్‌ విప్లవాన్ని సాధించిందనీ, దానికి లెనిన్‌ నాయకత్వం వహించారని చెప్పారు. పార్టీ పునాది చెదిరినా, అననుకూల పరిస్థితులొచ్చినా ఆందోళన అవసరం లేదనీ, సోషలిజమే లక్ష్యంగా పనిచేయాలని అన్నారు. విప్లవ సిద్ధాంతం లేకుండా విప్లవం లేదంటూ లెనిన్‌ చెప్పారని గుర్తు చేశారు. నేడు దేశంలో మూడోసారి మోడీ అధికారంలోకి వస్తారన్న ప్రచారం జరుగుతున్నదని చెప్పారు. అయితే దేశం ఏమవుతుందోనని ప్రజాస్వామ్యవాదుల్లో ఆందోళన ఉందన్నారు. దేశంలో మతశక్తులు గెలవకూడదన్నా, మతోన్మాదం పోవాలన్నా లెనిన్‌ రచించిన ‘ఏం చేయాలి’అనే పుస్తకాన్ని చదవాలని సూచించారు. అది ఆచరణకు కరదీపిక అన్నారు. హిట్లర్‌ ఉన్న దేశంలో విప్లవం వచ్చిందనీ, ముస్సోలిని ఉన్న దేశంలో ప్రజాస్వామ్యం పునరుద్ధరించబడిందని అన్నారు. మోడీకీ అదే పరిస్థితి దాపురిస్తుందన్నారు. 1899లో రష్యాలో పెట్టుబడిదారీ విధానం అభివృద్ధి గురించి లెనిన్‌ గ్రంథం రాశారని వివరించారు. ఆ తర్వాతే ఇతర సమస్యలనూ అధ్యయనం చేశారని చెప్పారు. భారతదేశంలోనూ పెట్టుబడిదారీ విధానంతోపాటు కులం, ఇతర సమస్యలపై పోరాటం చేసిన యోధుల గురించి అధ్యయనం చేయాలని సూచించారు. దేశంలో విప్లవం సాధించాలన్నా, సోషలిజం సాధించాలన్నా నిర్దిష్ట పరిస్థితులను లోతుగా అధ్యయనం చేయాలని కోరారు. దేశంలో మతోన్మాదం విజృంభిస్తున్నదని వివరించారు. అయితే శ్రామికులకు మరణానంతర సుఖాల కోసం వేచి ఉండాలని మతం చెప్తుందన్నారు. బతికున్నపుడే సుఖాలు కావాలని కొట్లాడాలంటూ లెనిన్‌ చెప్పారని గుర్తు చేశారు. కానీ పెట్టుబడిదారులు మాత్రం బతికుండగానే సుఖాలు అనుభవిస్తారనీ, శ్రమదోపిడీ చేసి లాభాలు పొందుతారని చెప్పారు. అందులో కొంత డబ్బుతో కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌) ద్వారా ప్రజలకు సేవ చేస్తాయని వివరించారు. ప్రజాపోరాటాలు బలహీనంగా ఉన్నపుడు మతం చెప్పే దేవుడివైపే ప్రజలు ఆకర్షితులవుతారని అన్నారు. సరళీకృత ఆర్థిక విధానాల మీద పోరాడకుండా మతోన్మాదాన్ని తిప్పికొట్టలేమంటూ పార్టీ పలు సందర్భాల్లో చెప్పిందన్నారు. మతం మీద కాకుండా మతోన్మాదం మీద పోరాడాలని చెప్పారు. పెట్టుబడిదారీ దోపిడీ వ్యవస్థపై పోరాటం చేయాలన్నారు. లెనిన్‌ శతవర్ధంతి సందర్భంగా ఆయన రచనలను అధ్యయనం చేయాలని అన్నారు.
అధ్యయనం నిరంతరంగా ఉండాలి : బి వెంకట్‌
అధ్యయనం నిరంతరంగా ఉండాలని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు బి వెంకట్‌ చెప్పారు. మార్క్సిజం-లెనినిజం సిద్ధాంతాన్ని దేశంలోని నిర్దిష్ట పరిస్థితులకు అన్వయించాలని సూచించారు. కష్టాలు, బాధలు వచ్చినపుడు గొప్పవ్యక్తుల జీవిత చరిత్రలను చదివితే స్ఫూర్తిని పొందుతామని అన్నారు. లెనిన్‌, మార్క్స్‌, ఎంగెల్స్‌, మావో, స్టాలిన్‌, సుందరయ్య వంటి వారు వారి జీవిత భాగస్వాముల సహకారం లేకుంటే అంత గొప్ప వారు అయ్యేవారు కాదన్నారు. జెన్సీ మార్క్స్‌ లేకుంటే మార్క్స్‌ పెట్టుబడి గ్రంథం రాసేవారు కాదని చెప్పారు. కష్టకాలంలో పార్టీని ఎలా నడపాలో లెనిన్‌ చరిత్ర ద్వారా తెలుసుకోవచ్చని అన్నారు. బీజేపీ పాలనలో నిర్బంధాలు పెరుగుతున్నాయనీ, ఎలా పనిచేయాలో నేర్చుకోవాలని చెప్పారు. సాహిత్యాన్ని, సిద్ధాంతాన్ని, అధ్యయనాన్ని పార్టీ శ్రేణులకు అందించాలని వివరించారు. కమ్యూనిస్టులు అంతర్జాతీయ తత్వాన్ని కోల్పోకూడదనీ, సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించాలని కోరారు. అధ్యక్షత వహించిన నవతెలంగాణ ప్రచురణాలయ సంపాదకులు కె ఆనందాచారి మాట్లాడుతూ లెనిన్‌ అంటే ఓ చైతన్యమని అన్నారు. ఆయన ఆలోచనలు, సైద్ధాంతిక విషయాలు ఇప్పటికీ ఆచరణీయమని చెప్పారు. మార్క్స్‌, ఎంగెల్స్‌ సిద్ధాంతాన్ని నిర్దిష్ట పరిస్థితులకు అన్వయించిన మహనీయుడు లెనిన్‌ అని వివరించారు.