పురుషాహంకార భాష ఇంకానా?

‘ఆడది తిరిగి చెడింది-మగాడు తిరగక చెడ్డాడు’ ఈ సామెత స్త్రీలను కట్టిపడేసే బంధి ఖానాగానూ, మగవానికి అపరిమిత స్వేచ్ఛని చ్చేదిగాను బోధిస్తుంది. అంతేకాదు, తిరుగు బోతుతనాన్ని స్త్రీకైతే నీచమైనదిగాను, మగవా నికైతే రాచకార్యంగానూ విపరీతార్థంలో నొక్కి చెబుతుంది. స్త్రీ పురుషులిద్దరూ సమానమైన ప్పుడు ఈ సామెత లేమిటి? అందులోని భాషా భావం మాటేమిటి? ఇలాంటి వాటిని ఎక్కడ బడితే అక్కడ ఎలాబడితే అలా వాడి పురుషా హంకారాన్ని పెంచవచ్చునా? స్త్రీలను న్యూనత భారంలోకి నెట్టవచ్చునా? అనేది విజ్ఞులే కాదు ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం. అందుకే సుప్రీం ధర్మాసనం ఇటీవల కంబాటింగ్‌ జెండర్‌ స్టీరియో టైప్స్‌ (మూస ధోరణి లైంగిక భావాలను ఎదుర్కొవడం) అను కరదీపికను విడుదల చేసింది.
పండిత పామరులు ఎవరెవరో ఏదేదో తెలిసీ తెలియక అహంకారంతోనో, స్వార్థంతోనో అలాంటి వక్రభాషను ఉపయోగించడం వేరు. విచక్షణ, విజ్ఞత చూపవలసిన న్యాయమూర్తులు న్యాయవాదులు ఉపయోగించడం వేరు. ఎందు కంటే వారు సామాజిక ప్రవర్తనకు దిక్సూచి వంటివారు కదా!చట్టం దృష్టిలో అందరూ సమా నులే. నిస్పక్షపాతంగా, నిర్భయంగా ఎలాంటి చెడు తలంపులేకుండా, ప్రభావం గుర్తెరిగి న్యాయం అందిస్తామని చేసే ప్రమా ణానికి జెండర్‌ మూసధోరణి అడ్డంకిగా నిలుస్తున్నట్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్‌ తెలిపారు. న్యాయ వృత్తికి సంబంధించిన భాషల్లో, తీర్పుల్లో, అంతర్గతంగా పురుషాధిక్య భావ జాలం ద్యోతకమవుతున్నట్టు తెలపడం మహిళా ఉద్యమం సాధించిన గొప్ప విజయంగా పరిగ ణించాలని ఆయన ఉద్ఘాటించారు. ఈ 21వ శతాబ్దంలో కూడా ఇంకనూ అలాంటి వివక్షా పద్ధతుల్లోనే కేసులు వాదించడం, తీర్పులు చెప్పడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
అసలు మనుధర్మ శాస్త్రమే స్త్రీ స్వేచ్ఛ స్వాతంత్య్రాలను కాలరాస్తూ శ్లోకాలను ఉటంకిం చింది. పితారక్షిత కౌమారే, భర్తారక్షిత యవ్వనే, పుత్రా రక్షిత వార్ధక్యే… నస్త్రీ స్వాతంత్య్ర మర్హత్ణి అని తెలిపింది. తండ్రి రక్షణలో కౌమార బాలిక, భర్త రక్షణలో యవ్వన వంతురాలైన భార్య, పుత్రుని రక్షణలో వార్థక్య తల్లి ఉంటారు గనుక స్త్రీ స్వాతంత్య్రానికి అర్హురాలు కాదు అనేది తాత్పర్యం. అంటే స్త్రీ ఏ వయసులోనైనా పురు షుని సన్నిధిలోనే, పరాధీనంగానే బతకాలని మనుధర్మశాస్త్రం వక్కాణిస్తున్నది. కనుకనే ప్రవ చనకారులు చాలామంది పతిసేవయే సతిధర్మం అన్నట్టుగానే బోధిస్తున్నారు. కానీ స్త్రీలు తనకు లభిస్తున్న పరిమితి స్వేచ్ఛా స్వాతంత్య్రాలతోనే ఆటంకాలను అధిగమించి, అన్ని రంగాల్లో పురుషునితో సమానంగా అభివృద్ధి పథాన ముందుంటున్న వాస్తవాన్ని అలాంటివారు జీర్ణించుకోలేక పోతున్నారు. వారి పురుషాహం కారమే వారికి అడ్డొస్తున్నది.అందుకే తీర్పు ఇచ్చే సమయంలో మీ విధేయురాలైన భార్య, మీ విశ్వ సనీయమైన భార్య అన్న పదాలు కాకుండా కేవలం భార్య అని మాత్రమే రాస్తే సరిపోతుం దని ఆ కరదీపిక తెలిపింది. అలాగే ఆటపట్టెం చడం, వేధించడం అని కాకుండా, ఘటన తీవ్రమైనప్పుడు లైంగిక బహి రంగ దాడి అని, ఇల్లాలు స్థానంలో గృహనిర్మాత, పతిత స్థానంలో సెక్స్‌ వర్కర్‌, పెళ్ళికాని తల్లి అని కాకుండా తల్లి అని మొదలైన సూచనలు ఆ కరదీపికలో చోటు చేసుకున్నాయి.
అలాగే మహిళల విషయంలో కొనసాగు తున్న అనుచిత ధోరణిని (మిత్‌-భ్రమ) కరదీపిక నిరసించింది. ఆడది కోరుకునే వరాలు రెండే రెండు. చల్లని సం సారం, చక్కని సంతానం అనే పాటలు మాటలు మనకు కోకొల్లలు. స్త్రీల కోర్కెలను, ఆలోచన లను నియంత్రించడం అంటే ఇదే. పరిమితం గానే ఆలోచించాలని చెప్పడం, మరల వాటినే తిరిగి వరంగా భావించాలనే ధోరణి ఇది. స్త్రీ ఎదురు మాట్లాడకూడదు. లేదంటే స్త్రీ బుద్ది ప్రళయాంత అని మనుధర్మశాస్త్రం ఘోషిస్తుంది. స్త్రీలు పెద్దపెద్ద నిర్ణయాలు తీసుకోలేరు. పురు షులకన్నా తక్కువ సామర్థ్యం కలిగి ఉంటారు. ఈ భావనలతోనే స్త్రీలను అబలగా తీర్మాని స్తారు. తదనుగుణంగానే సాహిత్యాన్ని, సినిమా లను ఉత్పత్తి చేస్తారు. ఎప్పటికైనా స్త్రీలను పురు షులే రక్షించాలి. స్త్రీలను బలహీనం గాను, సుకుమారంగానూ, పురుషులను హీరోలుగా నూ, కండల వీరుడుగానూ చూపిస్తారు. ఇదం తా వాస్తవ జీవితానికి విరుద్దమే. స్త్రీలు ఎప్పటికీ పురుషులకు అణగిమణిగి ఉండాలని పరోక్షంగా చెప్పడమే ఇది. స్త్రీలు వారు కోరుకునే సంప్ర దాయ దుస్తులే ధరించాలని, లేదంటే బరితెగిం చిందని, పురుషులను రెచ్చగొట్టిందని నిందలు వేస్తారు. ఇలాంటి అక్రమాలకు చెక్‌పెట్టేలా ఈ కరదీ పిక ఉన్నదని పలువురి అభిప్రాయం. ఇలాంటి పుస్తకాలు వ్యక్తిగత స్థాయిలో కాకుండా, సామూహికం గా ప్రజానీకంను ప్రభావితం చేసేలా, వ్యవస్థలోనే పెద్ద మార్పు తీసుకువచ్చేలా పాఠ్యపుస్తకాలు రావల్సి ఉన్నది. చాలామందికి సెక్స్‌- జండర్‌కు తేడానే తెలియకున్నది. సెక్స్‌ అంటే పుట్టుకతో వచ్చేది లింగత్వం. మార్చ లేనిది. జండర్‌ అంటే ఒక రకమైన దృష్టి కోణం. స్త్రీలు ఇలానే ఉండాలి. పురుషులు ఇలా ఉండా లని భావించడం. ఈ భావనలు -భాష – వేష ధారణ ప్రాంతం ప్రాంతానికి, కాలం కాలానికి మారుతూ ఉంటాయనే శాస్త్రీయ స్పృహ అందరం కలిగి ఉండాలి. ఇప్పటికే చాలా తిట్లు లం.. తో సంబోధిస్తూ స్త్రీలను కించపరిచే విధం గానే ఉంటాయి. సభల్లో స్త్రీలు ఉన్నారన్న విష యాన్ని మరిచి ప్రజాప్రతినిధులు సైతం ప్రత్యర్థు లను ఆ విధంగా తిట్టడం మనం చూస్తూనే ఉన్నాం. ఇది ఎటువంటి భాషా సంస్కృతి?
వాడు మగాడ్రా! ఏది నీ మగతనం చూపించు? లేదా నా మగతనం చూస్తావా? అంటూ రంకెలేయడం ఇక్కడెవడూ గాజులు తొడిగించుకున్నోడు లేడు. మగవారిని అవమా నించడానికి పసుపు కుంకాలు పంపడం – ఇలా ఎన్నో సంకేతాలు పురుషులను శౌర్యవంతులు గానూ, స్త్రీలను నీచంగానూ చూపడం మనం గమనిస్తూనే ఉన్నాం. చాలా సినిమాల్లో స్త్రీలను ఒసేరు, ఏమే, రావే, పోవే అని పిలవడమే ఉంటుంది. ఎందుకిలా? అని ఎవరైనా అడిగితే పురుషాధిక్య సమాజంలో ఇలానే ఉంటుంది కదా అనే సమర్థింపు జవాబులొస్తాయి. అంటే స్త్రీ-పురుష సమానత్వం, సమాన గౌరవం ఎప్పటికీ సాధించలేని ఆశయంగానే మిగిలిపో తుందన్న సత్యాన్ని గ్రహించరు.ఉత్తమ ఇల్లాలు, పతివ్రత లేదంటే అబల, కాదంటే పతిత తప్ప ఓ సాధారణ మహిళకు ఈ సమాజం ఇచ్చే నిర్వ చనం ఏమిటి? అని ఆక్రో శంతో ప్రశ్నించే మహిళా లోకానికి ఈ కరదీపిక ఇప్పుడు ఓ గొప్ప ఊరట. ఆరేండ్ల క్రితం రాజధాని ఢిల్లీలో ఫెమి నిస్ట్‌ ప్రాజెక్ట్‌ పేరున ఓ జాతీయ సదస్సు జరి గింది. స్త్రీల విషయాల్లో పురుష న్యాయమూర్తు లు వెల్లడించిన ముప్ఫై తీర్పులను, వాడిన భాషను ఆ సదస్సు చర్చించింది. వాటిని స్త్రీవాద దృక్పథం నుండి తిరగ రాస్తే ఆ తీర్పులు ఎలా ఉంటాయో కూడా తెలిపింది. అప్పుడు ఆ సదస్సుకు చంద్రచూడ్‌ హాజరయ్యారు. మారిటల్‌ రేప్‌ (దాంపత్య బలాత్కారం) కూడా నేరంగా భావించాలని ఆ సదస్సు దృఢం గా భావించడం పెద్ద సంచలనం. రేప్‌లో హింసా పార్శ్వాన్ని గమనించకపోతే ఒకరు ఎప్పుడూ హింసపెట్టేవారు గాను, మరొక హింస అనుభవించేవారు గాను మిగిలిపోతారు. అప్పు డది గౌరవప్రదమైన సహజీవనం ఎలా అవు తుందని ప్రశ్నించారు. అలాగే స్త్రీలను ఇబ్బంది పెట్టే అనుచిత పదాలను ఎట్టి పరిస్థితుల్లో ఉప యోగించరాదని, ఆంగ్ల పదాలకు సరైన అర్థాలు స్పురించే ప్రాంతీయ భాషా పదాలు వెతకవలసి ఉందని అభిప్రాయ పడ్డారు. ఈ కరదీపికలో కొన్ని తీర్పులను ఉల్లే ఖించారు. ఆ సందర్భాల్లో ఏ పదాల వెనుక ఏ భావాన్ని న్యాయమూర్తులు వ్యక్తీకరించారో సులభంగానే అర్థమవు తుంది. ఎందుకంటే అవి పురుషాధిక్య మూసపోసిన ధోరణిలోనే ఉన్నాయి గనుక. నిస్పక్షపాత తీర్పులు ఇవ్వ వలసిన న్యాయమూర్తులు ఇలా పక్షపాతులుగా వ్యవహరించడం సరికాదు కదా? అనేది కర దీపిక సారాంశం.
– కె. శాంతారావు
సెల్‌ : 9959745723