ప్రభుత్వ పురుషాధిక్యచూపు

Masculinity of government”చరిత్రలో ఎన్నో కథలు కాగితాల మీద కనపడవు. ఎందుకంటే, అవి స్త్రీల శరీరాల మీద, మనసు మీద రాయబడతాయి” అంటారు ప్రముఖ రచయిత్రి అమృతా ప్రీతం. ఆడపిల్లగా పుట్టినందుకు వివిధ దశలన్నీ కలిపి వంద మార్కులు వేసే పురుషాధిక్య సమాజం మనది. తరతరాలుగా స్త్రీల శరీరాలు, మనసులు ఇలా ఉండాలి అలా ఉండాలి అంటూ తెరలు కట్టి, హద్దులు గీసి, వారి స్వేచ్ఛకు, హక్కులకు కట్టుబాట్లనే శృంఖలాలు వేసిందీ సమాజం. భార్య అనుమతి లేకుండా భర్త ఆమెతో శారీరక సంబంధం పెట్టుకోవడాన్ని క్రిమినల్‌ నేరంగా పరిగణించాలన్న వినతిని కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకించింది. దాన్ని కూడా లైంగికదాడిగా గుర్తించి అందుకు అనుగుణంగా శిక్ష వేస్తే అది అత్యంత తీవ్రమైన చర్య అవుతుందని తెలిపింది. ఈ మేరకు ఈనెల 3న సుప్రీంకోర్టుకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ 49 పేజీల అఫిడవిట్‌ను అందించింది. దానిపై సర్వత్రా విమర్శలూ వస్తు న్నాయి. ముఖ్యంగా, మహిళా లోకం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. కేంద్రం వాదనలను మహిళా న్యాయ వాదులు, మహిళా సంఘాల నాయకులు, హక్కుల కార్యకర్తలు తీవ్రంగా తప్పుబడు తున్నారు.
నారీ శక్తి, బేటీ బచావో- బేటీ పఢావో…లాంటి నినాదాలు ప్రధాని నుంచి కమలం పార్టీ చిన్నా చితకా నేత వరకూ అలవోకగా జాలువారుతూనే ఉంటాయి. భారతమాత పుత్రికల కన్నీళ్లను తుడవడంలో, వారి మాన ప్రాణాలనూ, గౌరవాన్ని కాపాడటం మాత్రం తమ పని కాదంటూ తాజా అఫిడవిట్‌ సమర్పించడంతో తమ పని అయిపోయినట్టు మోడీ సర్కారు చేతులు దులిపేసుకుంది. అంతే కాదు వైవాహిక లైంగికదాడి సామాజిక సమస్య అని, చట్టపరమైన అంశం కాదని కూడా పేర్కొంది. ఒకవేళ దీన్ని క్రిమినల్‌ నేరంగా గుర్తిస్తే అది సమాజంపై ప్రభావం చూపిస్తుందని తెలిపింది. భార్యకు ఇష్టంలేని శృంగారాన్ని నేరంగా పరిగణిస్తే భర్తల మీదకు అనవసరమైన కేసులు వచ్చిపడతాయని కొందరు వాదిస్తున్నారు.
‘అసహజమైన సెక్స్‌’తో లైంగికదాడికి పాల్పడినట్టు ఒక మహిళ, తన భర్తపై ఆరోపణలు చేసింది. ”భారతీయ చట్టం వైవాహిక లైంగికదాడి గుర్తించనందున ఆ వ్యక్తి అసహజ సెక్స్‌ పద్ధతులు ప్రయత్నించినప్పటికీ ఆయన్ను నేరస్తుడిగా పరిగణించి తీవ్రమైన శిక్షలు విధించలేం” అని ఛత్తీస్‌గఢ్‌ హైకోర్టు తన నిస్సహా యతను వ్యక్తం చేస్తూ తీర్పు ఇచ్చింది. ”న్యాయస్థానాలు ఇంకెప్పుడు మహిళల కోణం నుంచి సమస్యను పరిగణిస్తాయి?” అని ఆ తీర్పుపై సోషల్‌ మీడియాలో తీవ్ర వ్యతిరేకత ఎదురైంది.
”సెక్స్‌ విషయంలో భార్య ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా భర్త తనకు అన్నిటికీ అనుమతి ఉన్నట్టుగా వ్యవహరించి తన శారీరకవాంఛ తీర్చు కుంటే అది వైవాహిక లైంగికదాడే అవుతుంది. అలాంటి ప్రవర్తనకు శిక్ష విధించలేనప్పటికీ అది శారీరక, మానసిక క్రూరత్వం కిందకే వస్తుంది” అని కేరళ హైకోర్టు తీర్పునిచ్చింది. భార్య శరీరం తనదేనని భర్త భావించడమే ఈ దారణాలకు కారణమవుతోందన్న కోర్టు…ఆధునిక సామాజిక న్యాయశాస్త్రంలో ఇలాంటి భావనకు చోటు లేదు అని స్పష్టం చేసింది.
లైంగిక చర్యకు భార్య సమ్మతి ఉండాలని వివాహ బంధం సూచిస్తుంది. భర్త కోరికలను భార్య తిరస్కరించరాదంటూ సమాజంలో పాతుకుపోయిన నమ్మకం ఉండడంతో వైవాహిక లైంగికదాడి అనేది సాధారణంగా మారిపోయింది. కానీ చాలా ఏండ్లుగా, ప్రపంచవ్యాప్తంగా ఈ అంశాన్ని సవాలు చేస్తున్నారు.100కు పైగా దేశాలు దీన్ని చట్టవిరుద్ధం చేశాయి. దీనిపై సుదీర్ఘ కాలంగా ఉద్యమాలు జరుగుతున్నప్పటికీ, 36 దేశాల్లో ఇది కేవలం చట్టంగానే మిగిలిపోయింది. అందులో భారత్‌ కూడా ఉంది. 31 శాతం మంది వివాహితలు అంటే కనీసం ముగ్గురిలో ఒకరు… తమ భర్తల కారణంగా శారీరక, మానసిక హింసలకు గురవుతున్నట్టు ఓ సర్వేలో తేలింది.
మహిళలపై లైంగికదాడులు, దారుణాలకు పాల్పడుతున్నట్టు అభియోగాలు ఎదుర్కొంటున్న వారు చట్టసభలకు ఎన్నిక వడం సిగ్గుచేటు. ఇలాంటివారు ప్రజాస్వామ్యానికే తలవంపు. కాబట్టే ఇలాంటి అఫిడవిట్‌లను నిస్సిగ్గుగా, నిర్లజ్జగా న్యాయస్థానాలకు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. అందుకే వ్యవస్థలపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లింది. స్త్రీలు ఇలాగే ఉండాలని చెప్పే పురుషాధిక్య కట్టుబాట్ల సంకెళ్లను తెంచుకొని తమ ఆత్మ గౌరవాన్ని నిలుపుకోవాలి. తమ ఇష్టాలకు బిగించిన కంచెలను, కంచుకోటలను తుత్తునియలు చేయాలి. ఆ దిశగా మహిళ అడుగులేయాలి. సమాజంలోని అభ్యుదయ శక్తులు అటువంటి వారితో భుజం భుజం కలపాలి. స్త్రీ, పురుష సమానత్వం అన్నింటా వెలుగొందాలి. అప్పుడే సమాజం పురోగమిస్తుంది.
ఈ దేశంలో ఆడపిల్లగా పుట్టకూడదని శోకించేంతగా మారుతున్న పరిస్థితులకు కారణం ఎవ్వరు? లైంగికదాడి జరిగితే నిందితులను శిక్షించాల్సిన ప్రభుత్వమే విభజన రేఖలు గీస్తూ…అవి వాటికిందకు రావు.. ఇవి వీటి కిందకు రావు అంటూ సర్వోన్నత న్యాయస్థానాలకు తెలియజేస్తూంటే ఈ దేశంలో ఆడబిడ్డల జీవితాలకు రక్షణ ఎక్కడిది? ఇలాంటి పరిస్థితుల్లో దేశం ఉండటం సిగ్గుచేటు. ఇప్పటికైనా ప్రభుత్వం తన వాదనను వెనక్కితీసుకోవాలి.