– డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
సామూహిక వివాహాలు సామాజిక, సమానత్వ విలువలకు తార్కాణంగా నిలుస్తాయని డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. కేరళలోని అలప్పుజలో కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ నియోజకవర్గంలో బుధవారం 400 మందికి సామూహిక వివాహాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి హాజరయ్యారు. సాంప్రదాయాల్లో కేరళ, తెలంగాణ మధ్య సారూప్యత ఉన్నదని చెప్పారు. ఓచిర పరబ్రహ్మ దేవాలయంలో కొన్నేండ్లుగా సామూహిక వివాహాలు జరిపిస్తూ, సమాజంలో సమానత్వం కోసం జరిగిన అనేక ఉద్యమాలను గుర్తుకు తెస్తున్నారని తెలిపారు. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాలకు గౌరవప్రదంగా వివాహాలు చేసుకొనే అవకాశాన్ని కల్పిస్తున్నారని చెప్పారు. సాయుధ రైతాంగ పోరాటాల నుంచి సామాజిక సంస్కరణల దాకా తెలంగాణ ప్రస్థానం అడుగడుగునా స్ఫూర్తిదాయకమైందని అన్నారు. కార్యక్రమంలో కేరళ రెవెన్యూ శాఖ మంత్రి కె రాజన్, పశుసంవర్ధక శాఖ మంత్రి మణి, ఎమ్మెల్యే రమేష్ చెన్నితల తదితరులు పాల్గొన్నారు.