– కంటతడి పెట్టిన ఆదిలాబాద్ అధ్యక్షుడు సాజిద్‌ఖాన్
– ఇండిపెండెంట్‌గా పోటీకి సిద్ధం
– చెన్నూర్‌లో పార్టీని వీడిన బోడ జనార్ధన్, డాక్టర్ రాజారమేష్
నవతెలంగాణ-ఆదిలాబాద్‌టౌన్,జైపూర్
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి మంటలు చల్లారడం లేదు. ఆదిలాబాద్, చెన్నూర్ నియోజకవర్గాల్లో ఆ పార్టీ సీనియర్ నాయకులు పార్టీకి రాజీనామా చేశారు. ఆదిలాబాద్ పార్టీ జిల్లా అధ్యక్షులు సాజిద్‌ఖాన్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత, మాజీ మార్కెట్ కమిటీ చైర్మెన్ సంజీవ్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడారు. ఈ సందర్భంగా సోమవారం మాజీ మంత్రి రాంచంద్రారెడ్డి నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. మా ముగ్గురిలో ఎవరికి టికెట్ ఇచ్చినా కలిసి పని చేస్తామని అధిష్టానానికి మొదటి నుంచి చెబుతూ వచ్చామని, కానీ అధిష్టానం తమని కాదని కంది శ్రీనివాస్‌రెడ్డికి టికెట్ ఖరారు చేయడంతో రాజీనామా చేశామని తెలిపారు. వీరితో పాటు ఓబీసీ జిల్లా అధ్యక్షులు, కౌన్సిలర్ అంబకంటి అశోక్, కేఆర్కే కౌన్సిలర్ రేష్మ ముబారక్, ఆదిలాబాద్ మండల బీసీ సెల్ అధ్యక్షులు వెంకటి, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు సుమారుగా 30 నుంచి 35 మంది వరకు మూకుమ్మడి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ పార్టీ జిల్లా అధ్యక్షులు సాజిద్‌ఖాన్ మాట్లాడుతూ.. జీవితం మొత్తం పార్టీకి అంకితం చేశానని, కాంగ్రెస్ పార్టీతో తనకున్న 20ఏండ్ల అను బంధాన్ని తెంచుకుం టున్నానని చెప్పడానికి కూడా నోరు రావడం లేదంటూ కంటతడి పెట్టుకున్నారు. ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతాన్ని నమ్ముతానని చెప్పిన వ్యక్తికి టికెట్ కేటాయిం చడం సరికాదని ఆగహ్రం వ్యక్తం చేశారు. టికెట్ రాకున్నా ఇండిపెండెంట్‌గా బరిలో ఉండి గెలిచాక మళ్లీ కాంగ్రెస్‌లో చేరుతామని తెలిపారు. కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా సంజీవ్‌రెడ్డిని నిలపాలని నిర్ణయం తీసుకున్నామన్నారు.
బీఆర్‌ఎస్‌లో చేరనున్న కాంగ్రెస్ సీనియర్ నాయకులు బోడ జనార్ధన్
చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నాయకులు బోడ జనార్ధన్ పార్టీని వీడి బీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్టు ప్రకటించారు. పార్టీ బలోపేతం కోసం శ్రమించిన స్థానికులను కాదని స్థానికేతరులు, కార్పొరేట్ వ్యాపారస్తులు వివేక్ వెంకటస్వామికి టికెట్ కేటాయిం చినందుకు నిరసనగా పార్టీ సభ్యత్వానికి రాజీనామ చేస్తున్నట్టు తెలిపారు. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి పంపిస్తున్నట్టు చెప్పారు. మందమర్రి పర్యటనకు వస్తున్న పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సమక్షంలో బీఆర్‌ఎస్ పార్టీలో చేరడంతో పాటు చెన్నూర్ బీఆర్‌ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ గెలుపునకు కృషి చేస్తానని తెలిపారు.