– ప్రభుత్వ పాఠశాలలకు రాజస్థాన్ ప్రభుత్వ ఆదేశం
– ప్రపంచ రికార్డు కోసం తాపత్రయం
జైపూర్: రథసప్తమి పండుగ సందర్భంగా వచ్చే నెల 15వ తేదీన రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సామూహికంగా సూర్య నమస్కారాలు చేయించాలని రాజస్థాన్‌లోని బీజేపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది, తల్లిదం డ్రులు, స్థానిక గ్రామస్థులు భాగస్వాము లయ్యేలా చూడాలని సూచించింది. ఈ కార్యక్రమానికి సన్నాహకంగా ఇకపై ప్రతి రోజూ పాఠశాలల్లో ప్రార్థన సమయంలో సూర్య నమస్కారాలు అభ్యాసం చేయించాలని జిల్లా విద్యా శాఖ అధికారులకు పంపిన ఆదేశాలలో రాష్ట్ర సెకండరీ విద్యా శాఖ తెలియజేసింది. సూర్య నమస్కారాలు చేయించడం ద్వారా ప్రపంచ రికార్డు సృష్టించాలని రాజస్థాన్ ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో కార్యక్రమంలో పాల్గొనే వారి వివరాలు సేకరించాలని ఆదేశించింది.
‘విద్యార్థులు ఇప్పుడు సూర్య నమస్కారాలు ప్రాక్టీస్ చేయాలి. శరీర ఆరోగ్యానికి సూర్యకాంతి ఎంతో కీలకం. ఇది డి-విటమిన్‌ను అందిస్తుంది. సూర్య నమస్కారం ఓ ఎక్సరసైజ్ వంటిది. దీనిని ఫిబ్రవరి 15వ తేదీ వరకూ కొనసాగించాలి. ఆ తర్వాత ఏం చేయాలనే దానిపై నిర్ణయం తీసుకుంటాం’ అని రాజస్థాన్ సెకండరీ విద్యా శాఖ డైరెక్టర్ అశిష్ మోడీ చెప్పారు. అంతకుముందు రాష్ట్ర పాఠశాల విద్యా మంత్రి మదన్ దిలావర్ విలేకరులతో మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో రథసప్తమిని పెద్ద ఎత్తున నిర్వహిస్తామని తెలిపారు. దేశంలోనే దీనిని అతి పెద్ద కార్యక్రమంగా మార్చేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. ఇందుకోసం ప్రజలందరి సహకారం తీసుకుంటామని అన్నారు. పాఠశాలల్లో ప్రార్థనలు చేసే సమయంలో విద్యార్థులు ప్రతి రోజూ కనీసం పదిహేను నిమిషాల పాటు సూర్య నమస్కారాలు ప్రాక్టీస్ చేస్తారని తెలిపారు. సూర్యకాంతితో అనేక పనులు జరుగుతాయని, అందుకే ఆయన్ని భగవంతుడిగా భావిస్తామని దిలావర్ అన్నారు.
ఎవరీ దిలావర్ ?
రాష్ట్రంలో ఫైర్‌బ్రాండ్ హిందూత్వ వాదులుగా ముద్ర పడిన బీజేపీ నేతల్లో దిలావర్ ఒకరు. 64 సంవత్సరాల దిలావర్‌కు భజన్‌లాల్ శర్మ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంలో కీలక శాఖ దక్కింది. ఆయన తరచూ తన ప్రకటనల ద్వారా వార్తల్లోకి ఎక్కుతుంటారు. అయోధ్యలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం పూర్తయిన తర్వాత దిలావర్ ఆనందంతో నృత్యం చేసిన దృశ్యాల వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ అయింది. రామ మందిర నిర్మాణం పూర్తయ్యే వరకూ పూల దండలు ధరించబోనని 1990లో ఆయన ప్రతిజ్ఞ చేశారు. ఇప్పుడు శ్రీకృష్ణుని జన్మస్థల మైన మథురలో కృష్ణ దేవాలయానికి ప్రాణ ప్రతిష్ట జరిగే వరకూ ఒంటి పూట భోజనం చేస్తానని చెప్పారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో షాహీ ఈద్గా మసీదు ఉన్న విషయం తెలిసిందే. వసుంధర రాజె ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దిలావర్‌ను పక్కన పెట్టారు. 2018 నుండి ఆయనకు మళ్లీ పూర్వ వైభవం వచ్చింది ఆయనతో పాటు వసుంధర రాజె వ్యతిరేకులందరికీ పార్టీలో ప్రాధాన్యత పెరిగింది. దిలావర్ తరచూ వివాదాస్పద ప్రకటనలు చేస్తుంటారు. 2021లో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశంలో రైతులు ఉద్యమించినప్పుడు దానిని ఓ కుట్రగా అభివర్ణించారు. బర్డ్ ఫ్లూను వ్యాపింపజేసేందుకు కుట్ర జరుగుతోందని, రైతులుగా చెప్పుకుంటున్న వారు నిరసన ప్రదేశంలో చికెన్ బిర్యానీ, డ్రై ఫ్రూట్లు తింటూ ఎంజారు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.