– విలువ తక్కువ చేసి ఎడా పెడా రిజిస్ట్రేషన్లు
– 1,456 దస్తావేజుల్లో 375 వాటిల్లో చేతివాటం
– రూ.3.44 కోట్ల మేర తక్కువ లెక్క కట్టిన అధికారులు
– రాష్ట్ర వ్యాప్తంగా ఏటా సగటున 10 లక్షల దస్తావేజులు
– రూ.4 నుంచి 5 వేల కోట్ల నష్టం జరిగినట్టు నిపుణుల అంచనా
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో అవినీతి రాజ్యమేలుతోంది. రెండు రూపాయల కోర్టు ఫీజు స్టాంపు నుంచి మొదలుకుని వందల కోట్ల విలువజేసే ఆస్తుల రిజిస్ట్రేషన్ల వరకు అడుగడుగునా అధికారులు తమ చేతి వాటాన్ని ప్రదర్శిస్తున్నారు. సొంత జేబులు నింపుకుంటూ సర్కార్ ఖజానాకు గండి కొడుతున్నారు. గతేడాది 1,456 దస్తావేజుల్లో 375 వాటిల్లో విలువ తగ్గించి రిజిస్ట్రేషన్లు చేసినట్టు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక బట్టబయలు చేసింది. ఫలితంగా రాష్ట్రానికి దాదాపు రూ.4 నుంచి రూ.5 వేల కోట్ల మేర నష్టం జరిగినట్టు నిపుణులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో 142 సబ్ రిజిస్ట్రార్, 33 జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాలున్నాయి. వీటి ద్వారా ఏటా దాదాపు 10 లక్షల దస్తావేజులు రిజిస్టర్ అవుతున్నాయి. రాష్ట్రంలో ఎక్సైజ్ శాఖ తర్వాత అత్యధిక ఆదాయం వచ్చే శాఖ ఇది. అయితే కింది స్థాయి నుంచి ఉన్నతాధికారుల వరకు చేస్తున్న అవినీతి వల్ల సర్కార్ ఖజానాకు ఏటా వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతోంది. ఇదే విషయాన్నికంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక బయట పెట్టింది.
గతేడాది జరిగిన రిజిస్ట్రేషన్లకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 1,456 దస్తావేజులను పరిశీలించగా 375 దస్తావేజుల్లో రూ.3.44 కోట్ల మేర తక్కువ లెక్కలు కట్టినట్టు తేల్చింది. కాగ్ పరిశీలించి తేల్చిన లెక్కల ప్రకారం చూస్తే మొత్తం దస్తావేజుల్లో సగటున దాదాపు 2.30 లక్షల దరఖాస్లుల్లో అవినీతి జరిగిందని తేలింది. రిజిస్ట్రేషన్ అయిన ఆస్తుల సగటు విలువ ప్రకారం చూస్తె దాదాపు రూ. 4 నుంచి రూ. 5 వేల కోట్ల వరకు ఖజానాకు పెద్ద ఎత్తున నష్టం జరిగినట్టు నిపుణులు అంచనా వేస్తున్నారు. అధికారుల అవినీతి వల్లనే భారీ మొత్తంలో ఆదాయాన్ని కోల్పోయిందని తేలింది.
స్టాంప్ డ్యూటీ
తెలంగాణలో రిజిస్ట్రేన్లకు సంబంధించి స్టాంప్ డ్యూటీ విధించడంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒకే విధానాన్ని అవలంబిస్తున్నారు. ఏ ఆస్తికైనా స్టాంప్ డ్యూటీ కింద 5.5 శాతం, రిజిస్ట్రేషన్ ఫీజు కింద 0.5 శాతం, ట్రాన్స్‌ఫర్ చార్జీల కింద 1.5 శాతం, మ్యూటేషన్ చార్జీల కింద 0.1 శాతం సుంకం విధిస్తారు. మొత్తంగా చూస్తే ప్రభుత్వం నిర్ణయించిన ఆస్తుల విలువలో 7.6 శాతం సుంకం వసూలు చేస్తారు. అయితే ఈ ఆస్తులను వెలకట్టడలో మాన్యువల్ విధానం అవలంబించడం వల్ల అనేక అవకతవకలు జరగుతున్నాయని 2013లో కార్డ్ సెంట్రల్ ఆర్కిటెక్చర్ (సీసీఏ) అనే డిజిటల్ విధానం తీసుకొచ్చారు. అందులో సైతం అనేక లోపాలుండటంతో అస్తులకు విలువ కట్టడంలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. ఇదే విషయాన్ని కాగ్ తన నివేదికలో ఎత్తి చూపింది.
కాగ్ బయట పెట్టిన అవినీతి
మార్కెట్ విలువను తగ్గించి ఎడాపెడా రిజిస్ట్రేషన్లు చేశారని కాగ్ పరిశీలనలో వెల్లడైంది. రాష్ట్ర వ్యాప్తంగా 1,456 దస్తావేజులను పరిశీలించగా 375 దస్తావేజుల్లో రూ.3.44 కోట్ల మేర తక్కువ లెక్కలు కట్టినట్టు తేల్చింది. ఒకే కంపెనీ తమ ఆస్తులను తనఖా పెట్టి ఒకటి కంటే ఎక్కువ అర్థిక సంస్థలనుంచి రుణాలు తీసుకుంది. తీసుకున్న రుణం రూ.673.46 కోట్లపై 0.5 శాతం కాకుండా ఒక్కొక్క దానిపై రూ.10,000 ఫీజును మాత్రమే వసూలు చేసినట్టు గుర్తించారు. దీని వల్ల మూడు కేసుల్లో రూ.3.36 కోట్లు తక్కువగా ఫీజు వసూలైనట్టు పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా 11 రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో చేసిన తనిఖీల్లో 28 దస్తావేజుల్లో రూ.1.46 కోట్ల తక్కువ సుంకం విధించినట్టు గుర్తించారు. 19 సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో లావాదేవీలు తప్పుగా వర్గీకరించడం వల్ల 37 రిజిస్ట్రేషన్లలో రూ.1.36 కోట్ల మేర స్టాంప్ డ్యూటీ తక్కువగా విధించారు. ఇలాంటి అనేక ఘటనలు చోటు చేసుకున్నాయని నివేదికలో పేర్కొన్నారు.
తెలంగాణ ఆవిర్భావం నుంచి రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం
2015-16 రూ.3,786
2016-17 రూ.4,249
2017-18 రూ.5,177
2018-19 రూ.6,612
2019-20 రూ.7,061
2020-21 రూ.5,260
2021-22 రూ.12,364