పత్తి గోడౌన్‌లో భారీ అగ్ని ప్రమాదం

Massive fire in cotton godown– కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా సంస్థ పత్తిగా గుర్తింపు
– పూర్తిగా దగ్ధమైన గోదాం..
– సీసీఐకి దాదాపు రూ.52కోట్ల ఆస్తి నష్టం
నవతెలంగాణ- మేడ్చల్‌
మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలోని పత్తి గోదాంలో శనివారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా సంస్థకు చెందిన పత్తి దగ్ధమైంది. వివరాల్లోకెళ్తే.. మేడ్చల్‌ మండలం పూడూరు గ్రామ పరిధిలోని గోసాయిగూడలో మధ్యాహ్నం ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. గోదాం గేటుకు వెల్డర్‌ మరమ్మతులు చేస్తుండగా నిప్పు రవ్వలు ఎగిరి పత్తి గోదాంలో పడటంతో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న జిల్లా ఫైర్‌ సేఫ్టీ అధికారి జై.కృష్ణ ఆధ్వర్యంలో జీడిమెట్ల, తుర్కపల్లి, చర్లపల్లి, సనత్‌నగర్‌, మల్కాజిగిరి కేంద్రాల్లోని 8 ఫైర్‌ ఇంజిన్లు, 40మంది సిబ్బందితో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో గోదాం పూర్తిగా దగ్ధమై కూలిపోయింది. అందులో నిల్వ ఉంచిన పత్తి పూర్తిగా కాలిపోయింది.
కాలిపోయిన పత్తి కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆదిలాబాద్‌ బ్రాంచ్‌కు చెందినదిగా గోదాం నిర్వాహకులు తెలిపారు. సీసీఐకు దాదాపు రూ.52 కోట్ల ఆస్తి నష్టం జరిగినట్టు చెప్పారు. ఘటన స్థలాన్ని మేడ్చల్‌ సీఐ అద్దని సత్యనారాయణ పరిశీలించారు.
అగ్నిమాపక నియంత్రణ చర్యలు చేపట్టకపోవడం వల్లే. జిల్లా ఫైర్‌ సేఫ్టీ ఆఫీసర్‌ జై.కృష్ణ
గోదాం నిర్వాహకులు సరైన అగ్నిమాపక నియంత్రణ చర్యలు చేపట్టకపోవడం వల్లే అగ్ని ప్రమాదం సంభవించిందని జిల్లా ఫైర్‌ సేప్టీ ఆఫీసర్‌ జై.కృష్ణ తెలిపారు. ముందుగా శామీర్‌పేట ఫైర్‌ ఇంజిన్‌ వచ్చి మంటలను ఆర్పేలోపే గోదాం మొత్తం వ్యాపించి పూర్తిగా కూలిపోయిందన్నారు. గోదాం చుట్టు పక్కల మంటలు వ్యాపించకుండా చర్యలు తీసుకున్నామన్నారు. వెనుక వైపు ఉన్న సాల్వెంట్‌ కంపెనీ నిర్వాహకులను తక్షణంమే ఖాళీ చేయాలని సూచించినట్టు తెలిపారు. కంప్రెస్డ్‌ కాటన్‌ కావడం వల్ల వాటర్‌ పై లేయర్‌కు మాత్రమే వెళ్లి తిరిగి మంటలు చెలరేగాయని చెప్పారు.