పెబ్బేరులో భారీ అగ్ని ప్రమాదం

పెబ్బేరులో భారీ అగ్ని ప్రమాదం– వ్యవసాయ మార్కెట్‌ గోడౌన్‌లో చెలరేగిన మంటలు
– రూ.10 కోట్ల విలువగల గన్నీ బ్యాగులు దగ్ధం
– ఫైరింజిన్లు, వాటర్‌ ట్యాంకులతో అదుపులోకి మంటలు
– సందర్శించిన జాయింట్‌ కలెక్టర్‌ నాగేష్‌ గౌడ్‌, సివిల్‌ సప్లై అధికారులు
నవతెలంగాణ- పెబ్బేరు
వనపర్తి జిల్లా పెబ్బేరు మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులో సోమవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డు గోదాముల్లో మంటలు చెలరేగాయి. సోమవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఒక్కసారిగా పొగలు కమ్ముకొని భారీగా మంటలు చెలరేగాయి. విషయం తెలుసుకున్న మార్కెట్‌ అధికారులు, రెవెన్యూ, మున్సిపాలిటీ అధికారులు ఫైర్‌ ఇంజిన్లకు సమాచారం అందించారు. వనపర్తి నుంచి వచ్చిన మూడు ఫైరింజిన్లు, వాటర్‌ ట్యాంకులు కలిసి మంటలను అదుపు చేసినప్పటికీ గోడౌన్‌లో ఉన్న గన్నీ బ్యాగులు పూర్తిగా కాలిపోయాయి. గోదాముల పైకప్పు పూర్తిగా దగ్ధమైంది. గోడలు సైతం భారీగా దెబ్బతిన్నాయి. రైస్‌ మిల్లర్లకు సంబంధించిన సుమారు రూ.ఐదు కోట్ల విలువైన సీఎంఆర్‌ ధాన్యం బస్తాలకు సైతం మంటలంటుకున్నాయి. ధాన్యం కాలిపోకుండా అధికారులు ఫైరింజన్లతో మంటలను అదుపు చేశారు. మూడు ఫైర్‌ ఇంజిన్‌లతోపాటు మున్సిపాలిటీ వాటర్‌ ట్యాంకులు, ఏబిడి ఆల్కహాల్‌ కంపెనీకి సంబంధించిన వాటర్‌ ట్యాంకర్లు తెప్పించి మంటలను అదుపు చేశారు. సుమారు రూ. 10 కోట్ల విలువగల గన్నీ బ్యాగులు పూర్తిగా కాలిపోయాయి. గోడౌన్‌కు కరెంటు లేదని, షార్ట్‌ సర్క్యూట్‌ జరిగే అవకాశం లేదని మార్కెట్‌ అధికారులు చెప్పారు.
ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్‌ యార్డులో కోట్లాది రూపాయల విలువైన వరి ధాన్యం బస్తాలు నిల్వ ఉంటాయి. కానీ సీసీ కెమెరాలు లేకపోవడం పట్ల ప్రజలు విచారం వ్యక్తం చేస్తున్నారు.జాయింట్‌ కలెక్టర్‌ నాగేష్‌ గౌడ్‌ సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదాన్ని నివారించే ఏర్పాట్లు చేశారు. సివిల్‌ సప్లై ఏడి స్వరణ్‌ సింగ్‌, ఆర్డీఓ పద్మావతి, తహసీల్దార్‌ లక్ష్మి, మున్సిపల్‌ కమిషనర్‌ ఆదిశేషు, ఎస్‌ఐ హరి ప్రసాద్‌ రెడ్డి, ప్రజా ప్రతినిధులు పరిశీలించారు.
ఈ సందర్భంగా జెయింట్‌ కలెక్టర్‌ నాగేష్‌ గౌడ్‌ మాట్లాడుతూ.. ఇటీవల ధాన్యం కొనుగోలు కోసం 12 లక్షలా 80 వేల గన్నీ బ్యాగులు తెప్పించి నిల్వ చేసినట్టు తెలిపారు. దాదాపు రూ.పది కోట్ల విలువగల గన్నీ బ్యాగులు పూర్తిగా కాలిపోయాయన్నారు. మిల్లర్లకు సంబంధించిన వరి బ్యాగులు ఉన్నాయని వాటికి మంటలు అంటుకోకుండా మంటలను అదుపు చేసినట్టు చెప్పారు. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకుంటామన్నారు. గోడౌన్లకు సమీపంలో ఉన్న నివాస గృహాల ప్రజలను ఖాళీ చేయించామని చెప్పారు.