గోదాంలో భారీ అగ్ని ప్రమాదం

– పరిస్థితి విషమించి తండ్రీ కూతురు మృతి
– మరో ఇద్దరి పరిస్థితి విషమం
– హైదరాబాద్‌ జియాగూడలో ఘటన
నవతెలంగాణ – ధూల్‌పేట్‌
హైదరాబాద్‌ జియాగూడలోని ఓ భవనంలోని గోదాములో మంగళవారం అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురికి తీవ్రగాయాలు కాగా.. వారిలో తండ్రీకూతురు పరిస్థితి విషమించి మృతిచెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన కూల్సుంపురా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. ధనంజయ అనే వ్యక్తి సోఫా ఫర్నీచర్‌ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. జియాగూడ వెంకటేశ్వనగర్‌లో 4 అంతస్తుల భవనంలో కింద గోడౌన్‌ ఉంది. అక్కడ సోఫా ఫర్నీచర్‌ తయారు చేసి నాంపల్లి ప్రాంతంలో ఉన్న దుకాణానికి తీసుకెళ్లి అమ్మేవాడు. ఈ తయారీ గోడౌన్‌లో పని చేస్తున్న శ్రీనివాస్‌(40), అతని భార్య నాగరాణి, 5వ తరగతి చదువుతున్న వారి కూతురు శివప్రియ(10), ఆరేండ్ల హరిణి అక్కడే గ్రౌండ్‌ ఫ్లోర్‌లోని ఒక రూంలో నివాసం ఉంటున్నారు. సోఫాలో ఉపయోగించే మేటీరియల్‌ను యజమాని వారి రూంలోనే పెట్టాడు. అయితే, మంగళవారం అర్ధరాత్రి అందరూ నిద్రలోకి జారుకున్నాక ఆ భవనం గ్రౌండ్‌ ప్లోర్‌లో ఉన్న గోదాంలో ఒక్కసారిగా ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగాయి. దాంతో వారు కేకలు వేశారు. స్థానికులు శ్రీనివాస్‌ కుటుంబాన్ని కాపాడారు. అయితే, నలుగురికీ తీవ్రగాయాలయ్యాయి. సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అపార్టుమెంట్‌ మొదటి, రెండో అంతస్తుల్లో ఉన్న 20 మందిని రక్షించారు. గాయాలైన నలుగురిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా తండ్రీకూతురు శ్రీనివాస్‌, శివప్రియ పరిస్థితి విషమించి మృతిచెందారు. తల్లి, చిన్న కూతురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.