అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ మితవాద ప్రభుత్వాన్ని నియమించడంపై శనివారంనాడు ఫ్రాన్స్ అంతటా పెద్దఎత్తున నిరసన ప్రదర్శనలు జరిగాయి. జూలైలో జరిగిన పార్లమెంటరీ ఎన్నికల ఫలితాలను వారు విస్మరించారని ఆరోపిస్తూ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, అతని కొత్త సంప్రదాయవాద ప్రధాన మంత్రి మిచెల్ బార్నియర్ లను ఖండిస్తూ పారిస్‌లో వేలాది మంది కదం తొక్కారు. లెఫ్ట్-వింగ్ న్యూ పాపులర్ ఫ్రంట్ (ఎన్ ఎఫ్ పి) కూటమి, మాక్రాన్ పునరుజ్జీవనోద్యమ పార్టీ నేతత్వంలోని కేంద్రం, మితవాద జాతీయ ర్యాలీ – మూడు సమానమైన కూటములతో ఏర్పడిన హంగ్ పార్లమెంటు ఫ్రాన్స్‌ను ప్రతిష్టంభనకు గురిచేసింది. ఏ పార్టీకి మెజారిటీ రానప్పటికీ, ఎన్ ఎఫ్ పి సంకీర్ణం అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంది. ఈ కారణం చేతనే ఎన్ ఎఫ్ పి ప్రధానమంత్రి పదవిని ఆశించింది.
అయినప్పటికీ, మాక్రాన్ ఎన్ ఎఫ్ పి నుంచి ఎంపికైన లూసీ కాస్టెట్స్‌ను ప్రధానమంత్రిగా నియమించడానికి నిరాకరించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశాడు. ఈ నెల ప్రారంభంలో, మాక్రాన్ సెంటర్-రైట్ రిపబ్లికన్ పార్టీ నుంచి బార్నియర్‌ను ప్రధానమంత్రి పోస్ట్ కోసం నామినేట్ చేశాడు. బార్నియర్ వేగంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో విఫలమయ్యాడు. అంతిమంగా అతను శనివారం కొత్త క్యాబినెట్‌ను ప్రకటించినప్పుడు, న్యాయ మంత్రిగా ఒక వామపక్ష రాజకీయ నాయకుడు డిడియర్ మిగౌడ్ మాత్రమే ఉన్నాడు. మిగిలిన వారిలో ఎక్కువగా మధ్యవాదులు, మితవాదులు ఉన్నారు. శనివారం వీధుల్లో కనిపించిన అనేక ప్లకార్డుల ప్రకారం వామపక్ష కూటమి ఎన్నికల విజయాన్ని అపహాస్యం చేసి మొత్తం ప్రజాస్వామ్యాన్ని ”అగౌరవ పరిచిన” చర్యగా నిరసనకారులు భావించారు. ”ఈడియట్స్ పాలన”, ”మాక్రాన్‌ను అభిశంసించండి” అంటూ నినదిస్తూ అధ్యక్షుడి రాజీనామాకు పిలుపునిచ్చారు. బార్నియర్ నియామకంతో ”తిరుగుబాటు” చేయడం ద్వారా ఫ్రెంచ్ అధ్యక్షుడు ”చక్రవర్తి” కావడానికి ప్రయత్నిస్తున్నాడని ఆరోపిస్తూ కొందరు మాక్రాన్ ముసుగులు ధరించారు.”మేము ఎప్పటికీ లొంగబోమని, రిపబ్లిక్ అధ్యక్షుడి ప్రజాస్వామ్య వ్యతిరేక అధికారాన్ని ఎప్పటికీ అంగీకరించ బోమని పునరుద్ఘాటించడానికి మేము ఇక్కడ ఉన్నాము” అని ఒక ప్రదర్శనకారుడు పేర్కొన్నాడు. ”మాక్రాన్ అధికారంలో చట్టబద్ధత లేదు… ఫ్రెంచ్ ప్రజలు ఓటు వేశారు. ఎన్ ఎఫ్ పి ఆధిక్యంలో ఉందని స్పష్టమైనప్పటికీ మాక్రాన్ తక్కువ ఓట్లు పొందిన కూటమికి చెందిన వ్యక్తిని ప్రధాన మంత్రిగా నియమించాడు” అని మరొక నిరసనకారుడు వివరించాడు. శనివారంనాడు పారిస్‌లో జరిగిన అతిపెద్ద ప్రదర్శనలో 40,000 మంది వరకు పాల్గొన్నారని నిర్వాహకులు పేర్కొన్నారు. లియోన్, నాంటెస్, మార్సెయిల్, బోర్డియక్స్, అంగోలేమ్, స్ట్రాస్‌బర్గ్‌ల్లో కూడా నిరసనలు జరిగాయి.ప్రజల్లో చెలరేగిన అసంతప్తితో పాటు, ఫ్రాన్స్ కొత్త ప్రభుత్వం పన్ను విధానాన్ని క్రమబద్ధీకరించడం నుంచి బడ్జెట్ సంక్షోభాన్ని పరిష్కరించడం వరకు అనేక సమస్యలను ఎదుర్కొంటుంది. మూడు కూటములుగా విడిపోయిన పార్లమెంటు ద్వారా చట్టాలను అమలు చేయడం పెద్ద సవాలుగా మారనుందని చాలా మంది నిపుణులు హెచ్చరిస్తున్నారు.