మణిపూర్‌లో మహిళల భారీ నిరసన

ఇంఫాల్‌ : మణిపూర్‌లో మహిళలు భారీ ఎత్తున ఆందోళన నిర్వహించారు. ఉఖ్రుల్‌ జిల్లాలో తోవాయి గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున ముగ్గురు కుకీలు హత్యకు గురయ్యారు. ఈ ఘటనను నిరసిస్తూ కుకీ-జో కమ్యూనిటీ ఆధిపత్యం ఉన్న కాంగ్‌పోక్పి జిల్లాలో వందలాది మంది మహిళలు శుక్రవారం మధ్యాహ్నం నుంచి జాతీయ రహదారిపై ధర్నా చేపట్టారు. శనివారం కూడా వారి ఆందోళన కొనసాగింది. కుకీల హత్యపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని, రాష్ట్రంలో శాంతియుత వాతావరణం నెలకొనేలా చర్యలు చేపట్టాలని పెద్దపెట్టున నినదించారు. కొండ ప్రాంతాల్లో అస్సాం రైఫిల్స్‌ను మోహరించాలని వారు డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో కొండ జిల్లాల మాదిరిగానే మణిపూర్‌లోని అన్ని లోయ జిల్లాల్లో ఎఎఫ్‌ఎస్‌పిఎతో భద్రత కల్పించాలని గిరిజన ఐక్యత కమిటీ కేంద్రానికి విజ్ఞప్తి చేసింది.