ముగ్గురు గుజ్జర్ల కస్టడీ మృతిపై మిన్నంటిన నిరసనలు

Massive protests over the custody death of three Gujjars–  కేంద్రం ఉక్కుపాదం
–  ఇంటర్నెట్‌ కనెక్టివిటీ నిలిపివేత
జమ్ము: రాజౌరి, పూంచ్‌ సెక్టార్‌ పరిధిలో ముగ్గురు అమాయక గిరిజన పౌరులను విచారణ పేరుతో హింసించి చంపిన తాజా సైనిక చర్యపై జమ్మూ కాశ్మీర్‌లో నిరసనలు మిన్నంటాయి. వీటిపై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. నిరసనలపై ఆంక్షల కొరడా ఝుళిపించింది. ముందసస్తు అరెస్టులు, ఇంటర్నెట్‌ కనెక్టివిటి నిలిపివేయడం వంటి చర్యలు చేపట్టింది. జమ్మూ కాశ్మీర్‌ కేంద్ర పాలిత ప్రాంతమైనందున ఈ ప్రాంత పాలనా నిర్వహణ అంతా లెఫ్టినెంట్‌ గవర్నరు ద్వారా కేంద్ర ప్రభుత్వమే నియంత్రిస్తుంది. జమ్మూలోని పీర్‌ పంజాల్‌ ప్రాంతంలో సైనిక వాహనంపై ఉగ్రవాదులు జరిపిన మెరుపు దాడిలో నలుగురు సైనికులు చనిపోయిన మరుసటి రోజే ముగ్గురు గుజ్జర్లను కస్టడీలోకి తీసుకుని హింసించి చంపినట్లు ఆర్మీ ఆరోపణలు ఎదుర్కొంటోంది. మరణించినవారి బంధువలకు ఉద్యోగాలు, పరిహారం ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇది నేరం అంగీకరించినట్టేనని పలువురు భావిస్తున్నారు. ఆర్మీపై తీవ్ర విమర్శలు రావడంతో పౌర మరణాలపై జరిగే విచారణకు తాము సహకరిస్తామని ఒక ప్రకటన విడుదల జేసింది. తోపా మస్తాందార గ్రామానికి చెందిన ఎనిమిది మంది వ్యక్తులతో సహా గత కొన్ని రోజులుగా అనేక మంది వ్యక్తులను సైన్యం తీసుకెళ్లి ఇంటరాగేట్‌ చేస్తోందని స్థానికులు తెలిపారు. వీరిలో ముగ్గురు చనిపోగా, మిగతావారు మృత్యువు తో పోరాడుతున్నారని గ్రామస్థులు పేర్కొన్నారు.
చనిపోయిన ముగ్గురు గుజ్జర్లను సఫీర్‌ హుస్సేన్‌ (37), షౌకత్‌ హుస్సేన్‌ (26), షబీర్‌ అహ్మద్‌ (32)గా గుర్తించారు. రెండు దశాబ్దాల క్రితం ఈ ప్రాంతం నుండి తీవ్రవాదాన్ని తుద ముట్టించడంలో ముస్లిం గుజ్జర్లు కీలక పాత్ర పోషించారు. 2020లో షోఫియాన్‌లో బూటకపు ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు రాజౌరి ప్రాంత పౌరులను, గుజ్జర్లను చంపివేసిన ఆర్మీ కెప్టెన్‌కు సాయుధ దళాల ట్రిబ్యునల్‌ జీవిత ఖైదు విధించింది. ఆ తరువాత నెల రోజులకే ముగ్గురు గుజ్జర్ల కస్టడీ మరణాలు చోటు చేసుకున్నాయి. కస్టడీలో చిత్ర హింసలకు గురి చేసిన దృశ్యాలతో కూడిన వీడియో క్లిప్‌లు వైరల్‌ అయ్యాయి. ఆ వీడియో వాస్తవికతను తోపా మస్తాందర గ్రామ సర్పంచ్‌ మొహమ్మూద్‌ అహ్మద్‌ ధ్రువీకరించారు. ఆర్మీ ఎత్తుకెళ్లిన ఎనిమిది మంది ఒకరికొకరు సంబంధమున్నవారని అహ్మద్‌ తెలిపారు. ఈ రోజు తెల్లవారు జామున అంత్యక్రియల కోసం ముగ్గురు పౌరుల మృతదేహాలను తమకు అప్పగించారని, అయితే ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇవ్వడంతో వాటిని పూడ్చి పెట్టామని సర్పంచ్‌ చెప్పారు. ఈ హత్యలకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ జమ్మూ కాశ్మీర్‌లోని రాజకీయ పార్టీలు నిరసనలు చేపట్టాయి. పిడిపి నాయకురాలు, మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ మాట్లాడుతూ, ఈ ప్రాంత ప్రజలు శాంతి ప్రేమికులు. ఉగ్రవాదానికి ఎన్నడూ మద్దతివ్వని ప్రాంతంలో ఈ భయానకమైన ఘటన జరిగిందని అన్నారు. జమ్మూ కాశ్మీర్‌ ప్రత్యేక హౌదా కల్పించే ఆర్టికల్‌ 370 రద్దు, రక్షణలు ఉపసంహరణ, రాస్ట్రాన్ని రెండు ముక్కలు చేసి కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చిన తరువాత ఈ ప్రాంతంలో అంతా బాగానే ఉందని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం చిలుక పలుకులు పలుకుతోంది. నిజానికి జమ్మూ కాశ్మీర్‌ ను ఒక బహిరంగ జైలుగా మారిపోయింది. సామాన్యులకు భద్రత లేని పరిస్థితి సంపన్న కాశ్మీర్‌ అంటే ఇదేనా? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.