బాన్సువాడలో ఆశా కార్యకర్తల భారీ ర్యాలీ

Massive rally of Asha activists in Bansuwada– ఎమ్మెల్యే పోచారం ఇంటి ముందు ధర్నా

– వినతి పత్రం అందజేత
నవతెలంగాణ – బాన్సువాడ, నసూరుల్లాబాద్ 
వైద్య ఆరోగ్య శాఖలో సేవలందిస్తున్న అశా కార్యకర్తలకు ప్రతి నెల ఒకటవ తేదీన వేతనం, ఎన్నికల మ్యానిఫెస్టో మేరకు రూ.18 వేల స్థిర వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలంటూ సీఐటీయూ ఆధ్వర్యంలో బాన్సువాడ డివిజన్ పరిధిలో ఉన్న స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటి ముందు ఆశా కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. గురువారం బాన్సువాడ పట్టణంలో డివిజన్ పరిధిలో వివిధ మండలాల్లో ఉన్న ఆశా కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. అంబేద్కర్ చౌరస్తా నుండి బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం ఇంటి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఉద్యోగ భద్రత ఒకటో తారీ కూన వేతనం, 18 వేల వేతనం ఇవ్వాలంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఆశ కార్యకర్తలు ఎమ్మెల్యే ఇంటి ముందు రావడంతో పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆశ కార్యకర్తలను సీఐటీయూ నాయకులను ఆహ్వానించారు. ఆశ కార్యకర్తల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కొన్ని డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని స్థానిక ఎమ్మెల్యేకు అందజేశారు. ఆశ కార్యకర్తల సమస్యలను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దృష్టికి తీసుకెళ్తానని ఆశ కార్యకర్తలకు పోచారం హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సీఐటీయూ నిజామాబాద్ జిల్లా కార్యదర్శి నన్నే సాబ్ మాట్లాడుతూ. కాంగ్రెస్ సర్కారు వచ్చాక జీతాలు ఎప్పుడొస్తాయో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. దీంతో పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన ఆశా కార్యకర్తలు ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారని. అర్హులైన వారి సర్వీసులు క్రమబద్ధీకరించాలని, పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. వైద్యారోగ్య శాఖ ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని విజయవంతం చేయడంలో కీలకపాత్ర పోషిస్తున్నా ఆశ కార్యకర్తలకు తగిన గుర్తింపు దక్కడం లేదన్నారు. చాలీచాలని జీతంతో ఆశాలు అనేక కష్టాలు పడుతున్నారని, పనిభారం తగ్గించి పెరిగిన రేట్లకు అనుగుణంగా వేతనాలు పెంచాలన్నారు. అలాగే పెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కరించాలన్నారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించే వరకు ఉద్యమిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు ఆసియా, భాగ్యలక్ష్మి, విజయ, వాణి, భూలక్ష్మి, రాణి, లక్ష్మి సావిత్రి తదితరులు పాల్గొన్నారు.