సామ్‌సంగ్‌లో కార్మికుల భారీ సమ్మె

సామ్‌సంగ్‌లో కార్మికుల భారీ సమ్మె– వేతనాల పెంపునకు ఆందోళన
సియోల్‌ : గ్లోబల్‌ ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తుల కంపెనీ సామ్‌సంగ్‌లో కార్మికులు భారీ సమ్మెకు దిగారు. మెరుగైన వేతనం కోసం సోమవారం మూడు రోజుల సమ్మెను ప్రారంభించారు. సామ్‌సంగ్‌ ప్రధాన కార్యాలయం సమీపంలో వర్షంలోనూ 3,000 మంది పైగా సిబ్బంది ర్యాలీకి హాజరయ్యారు. ఉద్యోగుల వేతన పెంపు, బోనసుల విధానంలో మార్పులు, సెలవుల విషయంలో ఆ కంపెనీలోని అతిపెద్ద యూనియన్‌ గత కొన్ని వారాలుగా ఆందోళనలు చేస్తోంది. కాగా.. సామ్‌సంగ్‌ 55 ఏళ్ల చరిత్రలోనే తొలిసారిగా గత నెల జూన్‌లో ఒక్క రోజు సమ్మె జరిగింది. దక్షిణ కొరియాలోని సియోల్‌కు 38 కిలోమీటర్ల దూరంలోని హ్వాసియోంగ్‌ లోని సామ్‌సంగ్‌ సెమీకండక్టర్‌ ప్లాంట్‌ల వెలుపల తాజాగా వేలాది మంది కార్మికులు నిరసనలో పాల్గొన్నారు. ఆ కంపెనీ యూనియన్లలో దాదాపు 30వేల మందికి పైగా కార్మికులతో నేషనల్‌ సామ్‌సంగ్‌ ఎలక్ట్రానిక్స్‌ యూనియన్‌ అతిపెద్దది.
భారీ సమ్మెతో కంపెనీకి చెందిన అత్యాధునిక చిప్‌ ప్లాంట్లలో ఉత్పత్తికి అంతరాయం కలిగింది. ఉత్పత్తికి అంతరాయం కలిగించడం ద్వారా యాజమాన్యానికి తమ డిమాండ్‌లను చేర్చడానికి ఈ వాకౌట్‌ను చేపట్టామని యూనియన్‌ ప్రెసిడెంట్‌ సన్‌ వూ మోక్‌ తెలిపారు. సంస్థలోని మొత్తం ఉద్యోగులకు మూల వేతనంలో 3 శాతం పెంపు, అదనపు సెలవులు కోరుతున్నామన్నారు. బోనస్‌ విధానంలో తాము సమానత్వాన్ని కోరుకుంటున్నామన్నారు. సంఘటిత కార్మికులకు వార్షిక సెలవులతో పాటు బోనస్‌ విధానంలోనూ మార్పులు తేవాలని డిమాండ్‌ చేస్తున్నారు. జులై 10 వరకు ఆందోళనలు కొనసాగించనున్నట్లు యూనియన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ లీ హ్యూన్‌ తెలిపారు. సామ్‌సంగ్‌ యాజమాన్యం తమ ప్రతిపాదనలను పరిష్కరించకపోతే మరిన్ని సమ్మెలు చేస్తామని ఆయన హెచ్చరించారు.