– అత్యధికంగా గజ్వేల్‌లో 72 నామినేషన్లు వాపస్
– మేడ్చల్‌లో తప్పుకున్న 47 మంది అభ్యర్ధులు
– హైదరాబాద్ జిల్లా బరిలో 332 మంది
– బుజ్జగింపుల్లో కాంగ్రెస్ సక్సెస్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భారీగా నామినేషన్లు ఉపసంహరించు కున్నారు. ఇందులో అత్యధికులు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్న వారే. ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్‌లో దాఖలైన 114 నామినేషన్లకు గాను 72 మంది ఉపసంహరించుకోగా 44 మంది అభ్యర్థులు బరిలో మిగిలారు. సీఎం పోటీ చేస్తున్న మరో నియోజక వర్గమైన కామారెడ్డిలో 58 మంది అభ్యర్థులకు గాను 19 మంది అభ్యర్థులు పోటీ నుంచి వైదొలగగా 39 మంది పోటీలో నిలిచారు.
గజ్వేల్ తర్వాత రాష్ట్రంలోనే అత్యధిక నామినేషన్లు దాఖలైన మేడ్చల్ నియోజకవర్గంలో 67 మంది గాను 45.మంది ఉపసంహరించుకోగా 22 మంది పోటీలో మిగిలారు. హైదరాబాద్ జిల్లాలోని 15 నియోజక వర్గాల్లో ఉపసంహరణ అనంతరం పోటీలో ఉన్న 332 మంది అభ్యర్థులకు గాను 20 మంది అభ్యర్థులు పోటీ నుంచి వైదొలగగా 312 మంది బరిలో నిలిచారు. రంగారెడ్డి జిల్లాలోని 6 నియోజక వర్గాల పరిధిలో 173 మంది పోటీలో ఉన్నారు. ఇబ్రహీం పట్నంలో 28 మంది, ఎల్బీనగర్‌లో 38 మంది, మహేశ్వరంలో 27, రాజేంద్రనగర్‌లో 25, శేరిలింగంపల్లిలో 33, చేవెళ్లలో 12 మంది అభ్యర్థులు పోటీలో మిగిలారు.
బుజ్జగింపుల్లో సక్సెస్ అయిన కాంగ్రెస్
కాంగ్రెస్ పార్టీలో టికెట్లు లభించక రెబల్స్‌గా బరిలోకి దిగిన పలువురు ముఖ్యనేతలు పోటీ నుంచి వైదొలగారు. రాష్ట్ర నాయకులతో పాటు పార్టీ జాతీయ నాయకత్వం రంగంలోకి దిగి వారికి నచ్చచెప్పింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే బరిలో నుంచి తప్పుకున్న నేతలకు ఎమ్మెల్సీ, పార్లమెంట్, కార్పొరేషన్ చైర్మన్‌లతో పాటు డీసీసీ అధ్యక్ష పదవులను ఇస్తామని హామీ ఇచ్చింది. దాంతో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకున్నారు.. సూర్యాపేట నుంచి పటేల్ రమేష్ రెడ్డి, జుక్కల్ నుంచి గంగారం, బాన్సువాడ నుంచి బాలరాజు. డోర్నకల్ నుంచి నెహ్రూ నాయక్, వరంగల్ వెస్ట్ నుంచి జంగా రాఘవ రెడ్డి. ఇబ్రహీం పట్నం నుంచి దండెం రాంరెడ్డి. పోటీ నుంచి తప్పుకోవడంతో హస్తం పార్టీకి భారీ ఉపశమనం లభించినట్లైంది.